హీరోయిన్ మెహరీన్ పిర్జాదాదే తప్పు… ఎగ్ ఫ్రీజింగ్ గురించి అవగాహన కల్పించేలా సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేయడం గురించి కాదు… ఆ పని మంచిదే… ఓ పాపులర్ నటి ఎగ్ ఫ్రీజింగ్ మీద కాస్త మహిళల్లో చైతన్యం పెంచే ప్రయత్నం గుడ్… ఎటొచ్చీ ఆ తరువాత పరిణామాలే…
కొన్ని సైట్లు, యూట్యూబ్ చానెళ్లు ఎడాపెడా వార్తలు రాసేశాయి… ఏమనీ..? మెహరీన్ ఇదుగో ఇలా అవగాహన ప్రచారం చేసింది, అభినందనీయం, మహిళలూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని కాదు… చూశారా, మెహరీన్‌కు కడుపొచ్చింది, మెహరీన్ పెళ్లికి ముందే గర్భం, ఎంత తెగించిందో చూశారా, సింగిల్ మదర్‌గా ఉండబోతున్న మెహరీన్… ఇలా ఎవడికి తోచింది వాడు కుమ్మేశాడు…
ఆమె నిర్ఘాంతపోయింది ఆ వార్తలు, ఆ ప్రచారం, ఆ థంబ్ నెయిల్స్ చూసి… ఒరేయ్, ఎవర్రా మీరంతా..? యాణ్నుంచి వచ్చార్రా అంటూ కోపమొచ్చింది… ఎవడెవడైతే ఈ పిచ్చి రాతలు రాశారో, చానెళ్లలో కూశారో వాళ్లు వెంటనే అవన్నీ డిలిట్ చేసి, క్షమాపణలు, అవీ బహిరంగ క్షమాపణలు చెప్పాలనీ, లేకపోతే లీగల్ చర్యలు తీసుకుంటాను అని మరో ట్వీట్ రాసి భగభగమని మండిపోయింది…
Ads
ఇదుగో ఇక్కడ మెహరీన్ చేసింది తప్పు… ఈ లీగల్ చర్యలు, మన్నూమశానం ఏమీ పనిచేయవు, ఇవన్నీ వేస్ట్, కానీ ఆమె ముందుగా ప్రజెంట్ మీడియా పరిజ్ఞానం, పరిణతి మీద అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది… ఏదో ఎగ్ ఫ్రీజింగ్ మీద తను అవగాహన పెంచుకోవడం, పెంచడం కాదు, తను మీడియా మీద అవగాహన పెంచుకోవడం…
అది పెంచుకుని ఉంటే ఇలాంటి వ్యాఖ్యలు చేసేది కాదు… “కొన్ని మీడియా సంస్థలు వారి బాధ్యతను అర్థం చేసుకొని వార్తలు రాయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీడియాలో పనిచేసే వారు వాళ్ల వృత్తిని గౌరవించాలి. అలా కాకుండా తప్పుడు సమాచారాన్ని ప్రజలకు చేరవేయడం అనైతికం, అలానే చట్ట విరుద్ధం. ఇటీవల నేను పెట్టిన ‘ఫ్రీజింగ్ ఎగ్స్’ పోస్ట్‌పై కొన్ని మీడియా సంస్థలు ఇష్టమొచ్చినట్లు వార్తలు రాశాయి. అయినా నేను ధైర్యం చేసి ఈ అంశం గురించి మాట్లాడాను. ఫ్రీజింగ్ ఎగ్స్ కోసం అమ్మాయిలు గర్భవతులు కావాల్సిన అవసరం లేదని అందరూ గుర్తించాలనేదే నా ఉద్దేశం. ఓ బాధ్యతాయుతమైన సెలబ్రిటీగా కొందరికి దీని గురించి అవగాహన కల్పించడం కోసమే నేను ఈ పోస్ట్ పెట్టాను. పిల్లలు అప్పుడే వద్దు అని భావించే కపుల్‌కి ఎగ్ ఫ్రీజింగ్ పద్ధతి ఉపయోగపడుతుంది. అందుకే దాని గురించి మాట్లాడాను.
కానీ ఇవేమీ ఆలోచించకుండా మీ స్వార్థం కోసం మీరు తప్పుడు వార్తలు రాశారు. నేను ప్రెగ్నెంట్ అంటూ ప్రచారం చేశారు. కనీసం ఇప్పటికైనా ఇలాంటి వార్తలకి ఫుల్‌స్టాప్ పెట్టండి. లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అలానే నాపై పెట్టిన పోస్ట్‌లను తొలగించి బహిరంగ క్షమాపణలు చెప్పండి.” అంటూ మెహరీన్ డిమాండ్ చేసింది…
Share this Article