(నారపరాజు నర్సింగా రావు) ఈరోజు దినపత్రికలు తిరగేస్తూ ఉంటే నమస్తే తెలంగాణాలో యథాలాపంగా ఒక వార్త ఆకర్షించింది … మోడీ సీట్లో ఎవరు అని ది ఎకానమిస్ట్ లో ఒక కథనం వచ్చింది అంటూ పెద్ద వార్త వేశారు… విచిత్రం ఏమిటి అంటే, ఏ విధమైన అర్హతలు లేకపోయినా కుటుంబ వారసత్వం ఆధారంగా ఆ పార్టీ అధినేతగా, అనేక మంది అనుభజ్ఞులైన సీనియర్ నాయకులని కాదని కేవలం అధినేత కొడుకు మాత్రమే పార్టీ పగ్గాలు చేపట్టే కుటుంబ పార్టీకి చెందిన నమస్తే తెలంగాణా పత్రిక అది… ప్రజాస్వామ్యయుతంగా ప్రతి నాలుగేళ్లకు ఒకసారి నియమబద్ధంగా, నిబద్దత, అనుభవం, సమర్థత, సీనియారిటీల ఆధారంగా పార్టీ అధ్యక్షుడిని మార్చే భారతీయ జనతా పార్టీ ప్రధాని నరేంద్ర మోడీ తరువాత ఆ సీట్లో ఎవరిని కూర్చో పెడతారు అని అడగడమే…
ఈ కథనంలో కొన్ని ఆసక్తి కలింగించే సబ్ టైటిల్స్ కూడా పెట్టడం విశేషం… అవి 4 దశల్లో పడిపోయిన పోలింగ్ శాతం, మోడీపై ప్రజల్లో పెరుగుతున్న అవిశ్వాసం, వెరసి బిజెపిలోనూ మొదలైన అంతర్మధనం, మోడీ తరువాత ఎవరు అన్న దానిపై పెద్ద చర్చ, వారసుడి రేసులో అమిత్ షా, యోగి, గడ్కరీ అని ….
ఇది ‘ద ఎకనామిస్ట్’ కధనమా, నమస్తే తెలంగాణా కధనమా అనేది పక్కన పెడితే నాలుగు దశల్లో పడిపోయిన పోలింగ్ అనేది ఈ కథనంలో ఒక అంశం… పోలింగ్ పడిపోవడానికి ఒక పార్టీ ప్రధాని అభ్యర్థిత్వానికి ఏమిటి సంబంధం అనేది బుర్ర ఎంత చించుకున్నా కూడా అర్ధం కాలేదు… పోలింగ్ శాతం పెరగడం, తరగడం అనేది అనేక అంశాల మీద ఆధారపడి ఉంటుంది… ఒకవేళ నిజంగా ఈ కథనంలో ప్రస్తావించినట్లు దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడి మీద వ్యతిరేకత ఉన్నా, అసంతృప్తి ఉన్నా మళ్ళీ ఆయన అధికారంలోకి రాకుండా పోలింగ్ రోజున పోలింగ్ కేంద్రాలలో బారులు తీరాలి కదా వ్యతిరేక ఓటు వేయడానికి…
Ads
రెండో అంశం మోడీ పై ప్రజల్లో పెరుగుతున్న అవిశ్వాసం అని వ్రాసింది… ఆయన పదేళ్ల పాలనలో ఆయన మీద అవిశ్వాసం రావడానికి ఆయనేమైనా ఇచ్చిన హామీలు విస్మరించాడా? అవినీతిలో కూరుకొని పోయాడా? అర్హత లేకపోయినా కూడా తన కుటుంబ సభ్యులను వివిధ పదవుల్లోకి బలవంతంగా జొప్పించాడా? అంటే లేదు అనే సమాధానం వస్తుంది…..పైగా 500 సంవత్సరాల భారతీయుల కలను అయోధ్యలో బ్రహ్మాండమైన భవ్య రామమందిరం నిర్మాణానికి మార్గం సుగమం చేయడం ద్వారా సాకారం చేశాడు…
2020 ప్రధమంలో ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి సమయంలో ఆయన చూపిన మార్గం… వేసిన అడుగులు ..ఇచ్చిన ధైర్యం …కలిగించిన భరోసా ప్రపంచాన్నే అబ్బురపరిచింది అంటే అతిశయోక్తి కాదేమో… (పారాసెటమాల్ వేసుకుంటే సరి అని సభలో ఏదేదో మాట్లాడి, జనాన్ని గాలికి వదిలేసిన ముఖ్యమంత్రి తనే రోజుల తరబడీ పత్తాకు లేడు…)
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై ప్రజల్లో విశ్వాసం ఉందా, అవిశ్వాసం ఉందా అనేది ఎన్నికలు అయ్యాక వచ్చే ఫలితాలను బట్టి మాత్రమే నిర్ణయించడం జరుగుతుంది.. ప్రజాస్వామ్యంలో ప్రజల నిర్ణయమే అంతిమం.. పోనీ ఏదైనా సర్వేల ద్వారా ప్రజాభిప్రాయాన్ని తెలుసుకున్నారా అంటే గత రెండు నెలల కాలంలో దేశంలో అగ్రశ్రేణి మీడియా సంస్థలు సర్వే సంస్థలు చేసిన వివిధ ముందస్తు సర్వేలలో ప్రధానిగా నరేంద్ర మోడీ చరిష్మా కానీ… పార్టీగా ఆయన పార్టీ బిజెపి కానీ మిగిలిన పక్షాలకు అందనంత దూరంలో ఉన్నట్లు తెలిసింది… ఇప్పటి వరకూ నాలుగు విడతలుగా జరిగిన ఎన్నికల్లో ఆయన పాల్గొన్న సభలలో పాల్గొన్న జన ప్రభంజనమే ఆయన చరిష్మా తగ్గలేదు అని చెప్తుంది.. అలాగే ఈ వారం ఆయన రెండు బ్రహ్మాండమైన రోడ్ షోలలో పాల్గొన్నాడు .. ఒకటి అయోధ్య రెండు వారణాశి.. రెండు చోట్లా ఆయన జననీరాజనాలు అందుకున్నాడు…
మూడో అంశం… వెరసి బిజెపిలో కూడా అంతర్మధనం మొదలయ్యింది అంటూ…… బిజెపిని ఎన్నికల్లో గెలిపించింది కేవలం ఇద్దరే ఇద్దరు.. ఒకరు 1999 లో ఆ పార్టీ అగ్ర నాయకుడు అటల్ బిహారీ వాజపేయి, రెండు నరేంద్ర మోడి… పైన చెప్పుకున్నట్లు ప్రజాస్వామ్యంలో ప్రజామోదం మాత్రమే కొలమానం అని అనుకుంటే అది వాజపేయి అడ్వానీల హయాంలో కన్నా కూడా నరేంద్ర మోడి హయాంలోనే ప్రజామోదం ఎక్కువ పొందాడు…
అటల్ బిహారీ వాజపేయి తన ఆరేళ్ల టర్మ్ లో జనసంఘ్ నుండి ఎన్నికల అజెండాలో ప్రధాన అంశాలుగా పొందుపరుస్తూన్న అనేక అంశాలు పూర్తి మెజారిటీ లేని కారణంగా ( సమతా, మమతా, లలితాల హెచ్చరికలకు ) దూరంగా జరగడం మనం చూశాం.. 2009 లో వాజపేయి తరువాత లాల్ కృష్ణ అద్వానీ ప్రధాని అభ్యర్ధిగా ప్రజలు ముందుకు వెళ్ళినా ఆమోదం లభించలేదు ..
కేవలం గుజరాత్ నమూనాతో నరేంద్ర మోడీ నాయకత్వంలో పార్టీ రెండుసార్లు అద్భుతమైన విజయాన్ని సాధించడమే కాక ఒకసారి మించిన మెజారిటీ రెండో సారి సాధించడం విశేషం.. బిజెపి అజెండాలో ప్రధాన అంశాలన్నీ ఈ పదేళ్లలో అమలు అయిన విషయం దేశ ప్రజలు అంత సులభంగా ఎలా మర్చిపోగలరు.. దేశంలో అనేక రాష్ట్రాలతో పాటు ఉత్తర ప్రదేశ్ లాంటి పెద్ద రాష్ట్రంలోపార్టీని రెండోసారి అధికారంలోకి తీసుకొని రావడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు…
కార్యకర్తల బలం ఆధారంగా నిర్మాణం అయ్యే బిజెపి, వామపక్ష పార్టీల్లో నాయకత్వ లక్షణాల ద్వారా నాయకులుగా రూపాంతరం చెందుతారు… వచ్చిన అవకాశాలు అందిపుచ్చుకొని పైకి ఎదుగుతారు.. నరేంద్ర మోడీ కూడా 1999 వరకు సామాన్య RSS ప్రచారక్ గా జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నవాడే… అనుకోకుండా 2001 లో ఆయనకు గుజరాత్ ముఖ్యమంత్రిగా అవకాశం దొరికింది..
ఆయనలో నాయకత్వ లక్షణాలు సమాజానికి చూపించాడు.. బిజెపిలో ద్వితీయ తృతీయ శ్రేణి నాయకులకు కొదువ లేదు… అలా లేదు కాబట్టే శివరాజ్ సింగ్ చౌహాన్, రమన్ సింగ్, యోగి ఆదిత్యనాథ్ లాంటి వాళ్ళు రెండేసి సార్లు, మూడేసి సార్లు ముఖ్యమంత్రులుగా అందలం ఎక్కుతున్నారు… ఏ విధమైన కుటుంబ నేపథ్యం లేకుండా… నరేంద్ర మోడి కూడా కష్టపడి ఉన్నత స్థితికి చేరినవాడే….. కాబట్టి సమకాలీన బిజెపి నాయకుల్లో నరేంద్ర మోడీ మీద అసంతృప్తి ఉండే అవకాశం కనిపించడం లేదు…
ఇక ఎకనామిస్ట్ ప్రస్తావించిన తరువాత అంశం నరేంద్ర మోడీ తరువాత వారసుడి రేసులో గడ్కారీ, అమిత్ షా, యోగి అని వ్రాసింది….
సరిగా ఆరేళ్ల క్రితం కూడా ఆంధ్ర ప్రదేశ్ నుండి ఇదేరకమైన నేరేటివ్ బిల్డ్ చేశారు… ముఖ్యంగా ఆంధ్రజ్యోతి, ఈనాడు, TV 5, ABN లలో డైలీ సీరియల్ లాగా ఈ అంశం మీదే కథనాలు వండి వడ్డించారు… ప్రత్యేక హోదా పేరుతో NDA నుండి బయటకు వచ్చిన చంద్రబాబు నాయుడుని జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీకి ప్రత్యామ్నాయంగా చూపడానికి..పెరుగుతున్న మోడీ చరిష్మాను ఖ్యాతిని తగ్గించి చూపడానికి ఈ కథనాలు వాడుకున్నారు… (ఇప్పుడు కేసీయార్ కూడా అదే బాట, అనగా నమస్తే బాస్, నేనే కాబోయే ప్రధానిని అంటున్నాడు…)
నాగపూర్ లో RSS కేంద్ర కార్యాలయంలో నితిన్ గడ్కరీని ప్రధానిగా ప్రతిపాదించడానికి పథకాలు రూపొందించారు అని… బిజెపి అగ్రనేతలు అయిన L K అద్వానీ, మురళీ మనోహర్ జోషి లాంటి వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ లోకసభలో పెట్టిన అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయబోతున్నారు అని…. MP లలో భారీ చీలిక అని అనేక కథనాలు వచ్చాయి….. 2019 ఎన్నికల ఫలితాలు అన్ని కథనాలను చెంప మీద చెల్లుమని చరిచాయేమో మళ్ళీ ఆ కథనాలకు 5 ఏండ్ల గ్యాప్ వచ్చింది…
అప్పట్లో చంద్రబాబు అనుకూల మీడియా ఇలాంటి కథనాలు వేదిక అయితే ఇప్పుడు KCR మీడియా అయ్యింది … మోడీ తరువాత ఎవరు అని అనేది నిర్ణయించాల్సింది రాజ్ దీప్ సర్దేశాయో… యోగేంద్ర యాదవో, మరొకరో కాదు కదా…. బిజెపి మాత్రమే… ఇంకొక కొసమెరుపు, నవ్వు తెప్పించే అంశం ఏమిటి అంటే 2019 లో బిజెపికి పడ్డ ఓట్లన్నీ మోడీని చూసి బిజెపికి ప్రజలు వేశారు… ఇప్పుడు మోడీ రిటైరైతే బిజెపికి గడ్డు కాలమే అని అనడం…!!
Share this Article