ఎస్, ఖచ్చితంగా కార్తీకదీపం టీవీ రేటింగ్స్ ఓ చరిత్ర… స్టార్ మాటీవీ వాడు ఏమేం ప్రయత్నాలు చేశాడో, ఏ దారులు తొక్కాడో గానీ ఏళ్ల తరబడీ దాన్ని ప్రథమ స్థానంలో నిలిపాడు… జనం కూడా అలాగే చూశారు… ప్రేమి విశ్వనాథ్‌లో తమ ఇంటి మనిషిని చూసుకున్నారు… పెద్ద పెద్ద స్టార్ల సినిమాలకు కూడా దక్కని రేటింగ్స్ ఇచ్చారు… ఏమాటకామాట నిరుపమ్ బుల్లితెర శోభన్‌బాబులా అందగాడే గానీ పెద్ద నటుడేమీ కాదు, కానీ ప్రేమీ అదరగొట్టేది… (బోలెడు మంది తెలుగు టీవీ కన్నడ తారల నడుమ ఈ మలయాళీ వెలిగిపోయేది)…
అది ఒడిసిన కథ… పిచ్చి పిచ్చి ట్విస్టులు, ప్రయోగాలతో నిర్మాతలు మొదటి పార్ట్‌ను చివరలో నానా బీభత్సం చేసి, భ్రష్టుపట్టించారు సీరియల్‌ను… ఐనాసరే, ఆ ఇద్దరు పిల్లలు, మోనితగా శోభాశెట్టి సీరియల్‌కు ప్రాణంగా నిలిచారు… చివరకు ఈ కథను ఎక్కడ ఎలా ముగించాలో తెలియక అర్థంతరంగా ఫుల్ స్టాప్ పెట్టాడు దర్శకుడు…
తరువాత బుర్రలో ఏదో పురుగు మెసిలింది… అదే పేరుతో మళ్లీ వాళ్లే హీరోహీరోయిన్లుగా మరొకటి వదులుదాం, ఎలాగూ తెలుగు ప్రేక్షకులు పిచ్చోళ్లు, ఏ చెత్త చూపించినా చూస్తుంటారు కదానే ధీమాతో సెకండ్ పార్ట్ తీసుకొచ్చారు… అదుగో ఇదుగో ఇక దున్నేస్తుంది అని అందరూ తెగరాసేశారు… తీరా చూస్తే…
Ads
తాజా బార్క్ రేటింగుల జాబితా చూస్తే బ్రహ్మముడి సీరియలే టాప్… మంచి జోష్‌తో నడుస్తోంది… ఈ కార్తీకదీపం సెకండ్ పార్ట్‌ను ఎంతగా లేపాలని సదరు టీవీ వాడు ఏం ప్రయత్నించినా సరే, అది కుదరడం లేదు… ఆ పాత జోష్ ఆ ఫస్ట్ పార్ట్‌తోనే ముగిసింది… పైగా కథ ప్రేక్షకుడికి కనెక్ట్ కాలేదు… ఆ ఇద్దరు పిల్లల్లేరు, ఆ శోభాశెట్టి లేదు… అసలు ఆ కథనమే వేరు…
బ్రహ్మముడి 9 నుంచి 10 దాకా రేటింగ్స్ పొందుతుంటే, ఈ కార్తీకదీపం రెండో వంట 8 నుంచి 8.7 దగ్గరే ఆగిపోతోంది… వారంలో ఐదు రోజులూ బ్రహ్మముడే టాప్… అలా బిగుసుకుపోయింది ముడి… మనం కేవలం టీవీ సీరియళ్ల గురించే చెప్పుకుంటున్నాం కదా, జెమిని, ఈటీవీ సీరియళ్లు ఎప్పుడూ నామమాత్రం పోటీ ఇవ్వలేవు మాటీవీ, జీతెలుగు టీవీలకు… వాటి గురించి చెప్పుకోవడం శుద్ధ దండుగ యవ్వారం…
టాప్ 30 జాబితాలో జీతెలుగు వాడి సీరియళ్లు అప్పుడో ఇప్పుడో రెండు కనిపించేవి… అందులో ఒకటి త్రినయని… అది ఓ విఠలాచార్య బాపతు మంత్రతంత్రాలు, మూఢనమ్మకాల బాపతు సీరియల్ అయినా సరే, హీరోయిన్ ఆషిక పడుకోన్ దాదాపు ప్రేమి విశ్వనాథ్ రేంజులో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది… ఆమెకు దీటుగా చేసేది పవిత్ర… నెగెటివ్ కేరక్టరే అయినా సరే మెప్పించేది… మొన్న ప్రమాదంలో మరణించింది కదా… ఆమే…
ఇప్పుడూ త్రినయని టాప్ 30లో ఉంది… కానీ దాన్ని పడమటి సంధ్యారాగం బీట్ చేసి, త్రినయనిని కిందకు నెట్టేసింది… ఎంతసేపు చూస్తారు పాములు, పగలు, పిచ్చి పాత్రలు… ఇప్పుడిక పవిత్ర లేకపోవడంతో ఆ సీరియల్ కథేమిటో ఇప్పుడే చెప్పలేం, కానీ గతంలో మంచి రేటింగ్స్ సాధించిన ప్రేమ ఎంత మధురం క్రమేపీ కార్తీకదీపం ప్రయోగాల్లాగే భ్రష్టుపట్టిపోయి, చివరకు టాప్ 30లో లేకుండా పోయింది, అసలు జీతెలుగు సీరియళ్లలో ఎక్కడో దూరంగా ఉండిపోతోంది… కథ, కథనాలే దానికి కారణం… సీనియర్ నటి జయలలిత కూడా ఈ సీరియల్‌లో చేయడం మానేశానని చెప్పినట్టుంది కదా…!!
Share this Article