Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మీ సోది మొహాల చెత్తా బిల్డప్పులకు మేం నిలువు దోపిడీలు ఇవ్వాలా..?!

May 18, 2024 by M S R

అయ్యో అయ్యో… కొత్త సినిమాల విడుదలల్లేవు… థియేటర్ల దగ్గర సందడి లేదు… ప్రేక్షకుల సమూహాల్లేవు… గల్లాపెట్టె గలగలల్లేవు… పరిస్థితి ఇలాగే ఉంటే థియేటర్లు ఇక శాశ్వతంగా మూసుకోవాల్సిందేనా..? స్టార్ హీరోల సినిమాలైనా రిలీజై ఆదుకోవాలి కదా……. ఇలా చాలా శోకాలు వినిపిస్తున్నాయి మీడియాలో, సోషల్ మీడియాలో, డిజిటల్ మీడియాలో…

సింగిల్ స్క్రీన్లు మూతపడ్డయ్… తాత్కాలికమే ఐనా సరే, రాబోయే మరిన్ని దుర్దినాలకు ఇది సూచిక… పాపం శమించుగాక… మీడియాలో శోకాలే తప్ప సగటు మనిషికి ఇదేమీ సమస్యగా కనిపించడం లేదు… ఎందుకంటే, చాలామంది థియేటర్లకు వెళ్లడం ఎప్పుడో మానేశారు కాబట్టి…

కాలక్షేపం కోసం థియేటర్‌కు వెళ్లాలంటే ఖర్చు తడిసిమోపెడవుతుంది కాబట్టి… ఇంటి నుంచి బయల్దేరి మళ్లీ ఇంటికి చేరేవరకు… అడ్డగోలు దోపిడీ, ప్రయాస, టైమ్ వేస్ట్, కాలుష్యం, ట్రాఫిక్ మన్నూమశానం… టికెట్ రేట్లు భయపెడతాయి… క్యాంటీన్ రేట్లు అదరగొడతాయి… పార్కింగ్ సరేసరి… సరే, అన్నీ భరించడానికి సిద్ధపడి వెళ్లినా… ఏముంది..?

Ads

దిక్కుమాలిన రొడ్డకొట్టుడు కథలు, హీరోల తలతిక్క బిల్డప్పులు, చెత్తా కామెడీలు, ఇమేజీ అనబడే భ్రమల్లో బతికే హీరోలు, సూపర్ హీరోయిక్ ఫైట్లు, కింకర రోగమొచ్చినట్టు స్టెప్పులు… అసలు సినిమా ప్రేక్షకుడిని థియేటర్ దాకా రప్పించేలా ఉంటే కదా… ఎవడో నటనలో బేసిక్స్ తెలియనివాడికి కూడా వందల కోట్ల పారితోషికాలట… వాడిని మోసి, పెంచి, రేప్పొద్దున వాడే రాజకీయాల్లోకి వస్తే జేజేలు కొట్టి, మన నెత్తి మీద స్వారీ చేయడం కోసం ఈరోజు నుంచే థియేటర్లకు వెళ్లాలా..?

అసలే పెరిగిన జీవనవ్యయం కారణంగా… చిన్న చిన్న సరదాలు కూడా ప్రియమైపోతున్నాయి… ఇంకా ఈ గుళ్లకు వెళ్లి నిలువు దోపిడీలు అర్పించుకోవాలా..? అసలు తప్పు థియేటర్లలోనే ఉంది, సినిమాల నిర్మాణంలోనే ఉంది… టెక్నాలజీ పెరిగింది, ఏటా కొంత చెల్లిస్తే బోలెడంత కంటెంటు ఇంట్లోనే, మనకు టైమ్ ఉన్నప్పుడు, ఆగి ఆగి… వెనక్కి తిప్పి, ముందుకు జరిపి చూసుకునే వీలుంది…

పోనీ, ఓటీటీల కోసమైనా సినిమాలు తీసేవాళ్లు ఉండాలి కదానేది ఓ పిచ్చి ప్రశ్న… అవసరం లేదు, నేరుగా ఓటీటీలే తమ కోసం కంటెంట్ క్రియేట్ చేసుకుంటున్నాయి… సినిమాలను మించిన టేకింగ్, స్క్రిప్టు, యాక్షన్, ప్రయోగాలు కనిపిస్తున్నాయి వెబ్ సీరీస్‌లలో..! వెగటు సీన్లు, వెకిలి భాషల నుంచి క్రమేపీ ఓటీటీ కంటెంటు కూడా క్రియేటివ్, ఫెయిర్ ప్రజెంటేషన్ దిశలో పయనిస్తోంది…

నిజానికి పలు సినిమాలు ఓటీటీ రైట్స్ బేరాలు తెగక రిలీజులు ఆగిపోతున్నాయి… గతంలోలాగా లేదు, ఎడాపెడా రేట్లకు పిచ్చి సినిమాలు కొన్న ఓటీటీలు చేతులు మూతులు కాల్చుకున్నాయి… ఆచితూచి బేరాలాడుతున్నాయి… సో, చిన్న సినిమాలకు, అంటే తక్కువ ఖర్చుతో తీసిన సినిమాలకే భవిష్యత్తు… వాళ్లే కాబోయే పథ నిర్దేశకులు…

ఎస్, థియేటర్ ఎక్స్‌పీరియెన్స్ బాగానే ఉంటుంది… కానీ ఫర్ వాట్ కాస్ట్..? ఏ మూల్యానికి..? అబ్బే, ప్రజల దగ్గర బోలెడు డబ్బు ఉంది, ఖర్చుకు వెనకాడటం లేదు అంటారా..? టూర్లు, ట్రిప్పులు, ఫుడ్ ఆర్డర్లు గట్రా లేవా అంటారా..? వోకే, కానీ ఇలాంటి సినిమాలకు ఆ ఖర్చెందుకు పెట్టాలి అనేది ప్రశ్న… మెదళ్ల నిండా కాలుష్యాన్ని నింపుకోవడానికి ఖర్చు పెట్టాలా..? దురదృష్టం ఏమిటంటే..? సగటు ప్రేక్షకుడి కోణం నుంచి విశ్లేషణలు, మథనాలు లేకపోవడం..!

ఇంకా దిల్ రాజు వంటి సినీ గుత్తాధిపత్య వ్యాపారమేధావులు తెరపైకి రావడం లేదు ఈ ఇష్యూపై..! థియేటర్ల మూతబడితే వేల మంది ఉపాధికి దెబ్బ అన్నాడు ఓ మిత్రుడు… తను మరిచిపోయింది ఏమిటంటే… గత పదేళ్లలో వందల థియేటర్లు మూతపడ్డాయి… బాలీవుడ్, అంటే హిందీ ప్రాంతాల థియేటర్ మరింత దీనంగా చూస్తోంది…  ఐనా వినోదం రూపం, మార్గం, ప్రదర్శన మారుతుంది తప్ప మూతపడదు… పైగా స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ దిశలో నాణ్యత వైపు అనివార్యంగా అడుగులు పడొచ్చునేమో..!!

పోనీ, మరొక్క కోణం… మాలీవుడ్ ఎందుకు వసూళ్లలో దూసుకుపోతోంది… కేరళ థియేటర్లు జనకళతో ఎందుకు వెలుగుతున్నాయి..? మనం ఎందుకు దివాలా తీస్తున్నాం..? ఈ కోణంలో ఓ విశ్లేషణ, ఓ మథనం సాగితే ఏదైనా మేలు మార్గం కనిపించవచ్చు కదా..!! ఇండియన్ సినిమాను వదిలేయండి కాసేపు, చాలా దేశాల్లో థియేటర్లు, టీవీలు, ఓటీటీలు గట్రా అన్నీ సమాంతరంగా బాగానే నడుస్తున్నాయి, గమనించారా..? పోనీ, ఆ కారణాల్ని అన్వేషించండి..!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఓహ్… వెన్నుపోటుపై మాగంటి బాబు వ్యతిరేక సినిమా ప్లాన్ చేశాడా..?!
  • పాటలు బాగుంటాయి… కానీ అసలు కథే సైకో ప్రేమలకు గ్లోరిఫికేషన్…
  • బుల్‌డోజింగ్ పాలసీకి ఆద్యుడే కేసీయార్… కేటీయార్ మరిచినట్టున్నాడు…
  • ఎంతసేపూ బాహుబలి ప్రమోషనే… మహాశయా, ఇస్రో రాకెట్ పేరు అది కాదు…
  • బంగారు తల్లులు..! ప్రత్యర్థులనూ ఓదార్చి, కన్నీళ్లు తుడిచిన వైనం..!!
  • ఒక్కసారి లిటిగెంట్ ముద్ర పడితే… ఎంతటి ప్రశాంత్ వర్మకైనా దెబ్బే..!!
  • అయ్యో ఉషాపతి..! సంసారంలో మంటబెట్టి, ఎగదోస్తున్న మీడియా..!!
  • స్మృతి మంధాన..! కప్ గెలుపు ప్రచారంలో ఎందుకో దక్కని ప్రాధాన్యత ..!!
  • వరల్డ్ కప్ గెలుపు సంబురాల్లో… ఈ వీల్ చైర్ భాగస్వామి ఎవరో తెలుసా..?
  • జస్ట్,, టైమ్‌ పాస్ పల్లీ బఠానీ… చిరంజీవి కదా… పైసలొచ్చేసినయ్…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions