చందు అలియాస్ చంద్రకాంత్ ఆత్మహత్య చేసుకున్నాడు… కానీ ఎవరతను..? ఒక టీవీ నటుడు… సర్లె, రోజూ బోలెడు ఆత్మహత్యల వార్తలు చదువుతున్నాం కదా, ఇంతకీ ఎందుకీ ఆత్మహత్య వార్తకు ప్రయారిటీ..?
ఆయన అక్రమ సంబంధం నెరుపుతున్నాడట పవిత్ర అనే మరో టీవీ నటితో… ఆమె మొన్నామధ్య రోడ్డు ప్రమాదంలో మరణించింది… ఆ బాధను మరిచిపోలేక అతనూ ఆత్మహత్య చేసుకున్నాడు… అందుకే ఈ వార్తకు ప్రయారిటీ…
సొసైటీలో చాలామందికి వివాహేతర సంబంధాలున్నయ్… వీళ్లు టీవీ సెలబ్రిటీలు కాబట్టి ఈ వార్తకు ఇంత ప్రాధాన్యం వచ్చిందా..?
Ads
అలా అని కాదు, ఫాఫం, చందు భార్య శిల్ప మొత్తుకుంటోంది, పవిత్ర మాయలో పడి చాన్నాళ్లుగా మమ్మల్ని పట్టించుకోవడం లేదు, రోజూ తాగొచ్చి కొట్టేవాడంటోందట… చందు తండ్రి వెంకటేష్ కూడా అదే చెబుతున్నారట తెలుసా..?
ఎహె, ఊరుకో… చాన్నాళ్లుగా చందు తన భార్యాపిల్లలకు దూరంగా ఉంటూ, పవిత్రతో సహజీవనం చేస్తుంటే, ఇక రోజూ తాగొచ్చి భార్యను కొట్టడమేమిటి నాన్సెన్స్..? తనే చెబుతోంది కదా ఐదారేళ్ల క్రితమే తనను, పిల్లల్ని చందు వదిలేశాడని…! తమ నడుమ మాటలు కూడా లేవని..! మళ్లీ తనే చెబుతోంది, పవిత్ర మరణాన్ని భరించలేక చేయిని కత్తితో కోసుకున్నాడని, ఆమె ఇన్‌స్టా ఖాతా నుంచి వైరాగ్యపు పోస్టులు పెడుతున్నాడని…
(ఐనా మొగుడు ఆత్మహత్య చేసుకుని లోకం విడిచివెళ్లిపోతే, ఈ సందర్భంలో ఆమె టీవీలకు ఈ ఇంటర్వ్యూలేమిటి..? చందుపై నిందలేమిటి..? హఠాత్తుగా దుర్మార్గుడు అయిపోయాడా..? సరే, దుర్మార్గుడే, మరి అలాంటివాడికి టీవీ వార్తల్లో ఈ ప్రయారిటీ ఏమిటసలు..?)
(వాడెవడో అడుగుతున్నాడు రిపోర్టర్ చందు ఐదారేళ్ల బిడ్డను… ‘మమ్మీ డాడీ గొడవపడుతూ మిమ్మల్ని కొట్టేవారా, తిట్టేవారా… ఆంటీ గురించి అడిగితే ఏమనేవాడు డాడీ…’ మన టీవీ రిపోర్టింగ్ దరిద్రం, ఇన్‌సెన్సిటివిటీ గురించి తెలిసిందే కదా… శవాలపై పేలాలు ఏరుకునే చానెళ్లు…)
నీకు తెలుసా..? వీడికి 35 ఏళ్లు కూడా ఉండవు, ఆమెకు 53 అట… ఐనా ఈ ప్రేమ బంధం ఏమిటి..? అందుకే జర్నలిస్టులు పండుగ చేసుకుంటున్నారు…
వాళ్ల మొహం… వాళ్ల ఏజ్ గ్యాప్‌తో సొసైటీకి సంబంధం ఏమిటి..? వాళ్లేమీ దొంగచాటుగా కలవడం లేదు, ఐదారేళ్లుగా కలిసే ఉంటున్నారు, ఏవో టెక్నికల్ ప్రాబ్లమ్స్‌తో పెళ్లిని అధికారికం చేయలేదు… ఐనా పెళ్లి అనే తంతు లేకపోతే కలిసి ఉండకూడదా..? ఇండస్ట్రీలో అందరికీ తెలుసు వాళ్ల సహజీవనం గురించి, ఇప్పుడు ఈ అనైతిక ముద్రలేమిటి..?
అబ్బే, భార్యాపిల్లలుండీ ఈ అక్రమ బంధం తప్పు కదా..? అందుకే టీవీలు కబడ్డీ ఆడుకుంటున్నాయి…
వాళ్ల మొహం… సొసైటీలో అందరూ శుద్ధపూసలా ఏంది..? ఆమె డైవొర్సీ, ఈయన దాదాపు డైవొర్సీ… పైగా ఆమె అంటే ఎంత బలమైన ప్రేమ, ఎమోషన్ లేకపోతే ఆమె దూరం కాగానే తను కూడా వెళ్లిపోయాడు… వాళ్ల ప్రేమను ఈ సోషల్ మీడియా, ఈ మీడియా జడ్జ్ చేయాలా..?
నిజమే, మమ్మల్నిలా వదిలేయండని పాపం పవిత్ర బిడ్డ ప్రతీక్ష కూడా మొత్తుకుంటోంది…
అదేకదా చెప్పేది… చివరకు ఆ పిల్లకున్న సెన్స్, సోయి కూడా మీడియాకు లేకపోయింది… ఎవరి ఏడుపుల్లో వాళ్లుంటే వీళ్ల ఏడుపు మరొకటి…
Share this Article