Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పరీక్ష పెట్టే పాత్ర దొరకాలే గానీ… ఎన్టీవోడు కంటతడి పెట్టిస్తాడు అక్షరాలా…

May 21, 2024 by M S R

Subramanyam Dogiparthi…….. భీష్ముడిగా వయసు మళ్ళిన పాత్ర వేసిన తర్వాత పదేళ్ళకు అంటే 1972 లో బడి పంతులుగా NTR చాలా గొప్పగా నటించారు , మెప్పించారు . మధ్య వయసు మాస్టారిగా ప్రారంభమైన పాత్ర రిటైర్ అయి , వయసు మళ్ళిన పాత్రగా ముగుస్తుంది . బడి పంతులుగా బాధ్యత , తండ్రిగా బాధ్యత సంపూర్ణంగా నిర్వహించాక పుత్ర రత్నాల చేతిలో పడి దంపతులు ఎలా బాధపడ్డారో దర్శకులు పి చంద్రశేఖరరెడ్డి బాగా చూపారు .

పుత్ర రత్నాలు , కోడళ్ళు తల్లిదండ్రులను మోసం చేసి ఆస్తులు వ్రాయించుకోవటం , వీధిన పడేయటం , విడదీయటం వంటి కధాంశాలతో చాలా సినిమాలు వచ్చాయి . అన్నీ చాలావరకు విజయాన్ని సాధించాయి . అయితే ఈ బడి పంతులు సాధించిన విజయం ఘన విజయం . స్క్రీన్ ప్లే , ఎమోషన్ డ్రామాలను పండించటంలో నటీనటుల, దర్శకుడి కష్టం కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది . ముఖ్యంగా NTR , అంజలీదేవి నటన సూపర్బ్ . వయసు మళ్ళిన ప్రేక్షకులు కంట తడి పెట్టాల్సిందే .

కూరిమి కలవారందరు కొడుకులేనురా , జాలి గుండె లేని కొడుకులు కూతుళ్ళ కన్న కుక్క మేలురా . ఈ పాట లోని ఈ మాట ఈ సినిమాలో చూస్తాం . కొడుకులు ఇల్లు తాళమేస్తే , ఎప్పుడో చదువుకున్న విద్యార్ధి విశ్వాసంతో ఆ ఇంటిని వేలంలో కొని , బడి పంతులికి సమర్పించుకుంటారు . ఒక ఉపాధ్యాయునిగా నాకూ ఇలాంటి పూర్వ విద్యార్థులు తారసపడుతుంటారు . ఎంతో సంతోషాన్ని , సంతృప్తిలను ఇస్తుంటాయి .

Ads

విశ్వాసం కల విద్యార్ధిగా జగ్గయ్య , అతని భార్యగా జానకి , కొడుకులుగా రామకృష్ణ , కృష్ణంరాజు , కోడళ్ళుగా జయంతి , విజయలలిత , కూతురిగా టి పద్మిని , అల్లుడిగా రాజబాబు చక్కగా నటించారు . ఇతర పాత్రల్లో అల్లు రామలింగయ్య , సూరేకాంతం ప్రభృతులు నటించారు .

మరీ ముఖ్యంగా చెప్పుకోవలసింది అతిలోకసుందరి శ్రీదేవి మనమరాలిగా ఆరిందా లాగా నటించింది . బూచాడమ్మా బూచాడు బుల్లి పెట్టెలో ఉన్నాడు అనే టెలిఫోన్ మీద పాటలో బేబీ శ్రీదేవి అభినయం చాలా గొప్పగా ఉంటుంది . ఈ సినిమా విజయానికి మరొక ముఖ్య కారణం కె వి మహదేవన్ సమకూర్చిన సంగీతం . పాటలన్నీ వీర హిట్ . భారత మాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు , పిల్లము బడి పిల్లలమూ , నీ నగుమోము నా కనులారా కడదాకా కననిండు పాటలు చాలా శ్రావ్యంగా ఉంటాయి . నీ నగుమోము నా కనులారా కననిండు పాటలో ఆర్ద్రత , అంజలీదేవి నటన వర్ణించటానికి మాటలు చాలవు . అలాంటి అనుబంధం , ప్రేమ ఉన్న భార్యాభర్తలకే అర్థం అవుతుంది .



భారత మాతకు జేజేలు పూర్తి పాట ఇదుగో… కొన్నేళ్లపాటు ప్రతి తెలుగు బడిలో పంద్రాగస్టు, రిపబ్లిక్ డే నాడు మారుమోగేది ఈ పాట…

భారత మాతకు జేజేలు
బంగరు భూమికి జేజేలు
ఆసేతు హిమాచల సస్యశ్యామల
జీవధాత్రికీ జేజేలు

త్రివేణి సంగమ పవిత్రభూమి
నాల్గు వేదములు పుట్టిన భూమి
గీతామృతమును పంచిన భూమి
పంచశీల బోధించిన భూమి

సహజీవనము సమభావనము
సమతావాదము వేదముగ
ప్రజాక్షేమము ప్రగతి మార్గము
లక్ష్యములైన విలక్షణ భూమి



ఓరోరి పిల్లగాడ వగలమారి పిల్లగాడా , రాక రాక వచ్చావు రంభ లాగ ఉన్నావు , నిన్న మొన్న రేకు విప్పిన , ఎడబాటెరగని పుణ్య దంపతుల విడతీసింది విధి నేడు పాటలు కూడా బాగుంటాయి . డి వి నరసరాజు సంభాషణలను కూడా ప్రత్యేకంగా మెచ్చుకోవాలి .

మరాఠీ రచయిత విష్ణు వామన్ శిర్ వాడకర్ నవల వైష్ణవి ఆధారంగా కన్నడంలో బి ఆర్ పంతులు తీసిన స్కూల్ మాస్టర్ కి రీమేక్ మన బడి పంతులు సినిమా . ఇదే కధతో 2003 లో అమితాబ్ , హేమమాలినిలతో బాగ్ బన్ సినిమా తీసారు . NTR నటనకు ఉత్తమ నటుడిగా ఫిలిం ఫేర్ అవార్డు కూడా వచ్చింది . వంద రోజులు ఆడి కమర్షియల్ గా కూడా సూపర్ హిట్ అయిందీ సినిమా .

టీచర్స డే నాడు ఏదో ఒక చానల్లో ఇప్పటికీ వస్తూనే ఉంటుంది ఈ సినిమా . మా నరసరావుపేటలో వెంకటేశ్వర పిక్చర్ పేలసులో చూసా . టి విలో చాలాసార్లు చూసా . యూట్యూబులో ఉంది . చూడని వాళ్ళు తప్పక చూడండి . ముఖ్యంగా క్రూర కూతుళ్ళు , కొడుకులూ తప్పక చూడాలి . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions