ప్రధాని మోడీ… ఒకటి మాత్రం క్లియర్, ఆ హోదాలో తను ఏం చెప్పినా దానికి న్యూస్ వాల్యూ ఉంటుంది… ఐతే న్యూసెన్స్ వాల్యూ లేదంటే సెన్స్ వాల్యూ… ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే, ఒక పార్టీ నేత, ఒక మంత్రి ఏం చెప్పినా సరే, వాటికి పెద్ద విలువ ఉండదు… కానీ మోడీ బీజేపీని సొంత మెజారిటీతో అధికారంలోకి తీసుకువచ్చాడు, మరోసారి అధికారం కావాలని తిరుగుతున్నాడు… పదేళ్లుగా తను అంతర్జాతీయంగా కూడా భారతదేశ గళం…
సో, తన మాటల్లో సంయమనం, బ్యాలెన్స్, లోతు, ప్రజాప్రయోజనం, పరిపక్వత వంటివి కనిపించాలి… అన్నింటికీ మించి రాజనీతి… సరే, తను బేసిక్‌గా ఓ పొలిటిషియన్ కాబట్టి, ఇప్పుడు దేశంలో జరుగుతున్న ఎన్నికలు రాబోయే రాజకీయాలకు కీలక సంధిదశ కాబట్టి… మోడీ చేస్తున్న కొన్ని తొందరపాటు వ్యాఖ్యల్ని బహుశా పార్టీ గానీ, తన టీం గానీ సమర్థిస్థాయేమో… కానీ కొన్ని మోడీ అభిమానులకు కూడా చిరాకు పుట్టించాయి… తను చేయాల్సిన వ్యాఖ్యలు కావు అని…
మన పుస్తెలు కూడా దక్కనివ్వరు, మైనారిటీలకు పంచేస్తారు ఈ కాంగ్రెసోళ్లు… అయోధ్య గుడి మీదకు బుల్డోజర్లు వెళ్తాయి, బాబ్రీ తాళం వేస్తారు… ఇలాంటి వ్యాఖ్యలు… సరే, ఆ పార్టీలో తనంత ఫోర్స్‌గా జనంలోకి పార్టీ వాయిస్‌ను తీసుకుని వెళ్లేవారు లేరు… మిగతా నేతలంతా అంగుష్టమాత్రులైపోయారు… కీలక రాజకీయ దశలో అవన్నీ స్ట్రాటిజిక్ వ్యాఖ్యలే అనుకుందాం… కానీ మొన్న ఏదో ఇంటర్వ్యూలో తన వ్యాఖ్యలు మరీ ఎక్కడో భారీ తేడా కొడుతున్నట్టు అనిపిస్తోంది…
Ads
‘మా అమ్మ బతికి ఉన్నంతవరకూ నేను అందరిలాగే ఈ భూమ్మీదకు వచ్చిన జీవిని (బయోలాజికల్ బర్త్) అనిపించేది, అమ్మ వెళ్లిపోయాక ఇప్పుడు బలంగా అనిపిస్తోంది… నా పుట్టుకను, నా ప్రయాణాన్ని దేవుడు నిర్దేశిస్తున్నాడు అని, తనే నన్ను పంపించాడు అని… నా అడుగులు, నా అనుభవాలు కూడా అవే చెబుతున్నాయి… నాతో దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడో అవి చేయిస్తున్నాడు’… రఫ్‌గా ఆయన వ్యాఖ్యల సారాంశం మీడియాలో ఇలాగే రిపోర్టయింది…
ఒక కోణంలో ఇదంతా అబ్సర్డ్ నిజానికి… నన్ను దేవుడు పంపించాడు, నేను దేవుడి దూతను, ఆయన చెబితేనే, ఆయన చెప్పినవే చేస్తున్నాను, ఆయనే గైడ్ చేస్తున్నాడు, ఆయన నిర్ణయాలే నా అడుగులు… ఈ మాటలు సగటు మనిషి కోణంలో వాల్యూలెస్, సమాజం కోణంలో మరీనూ… నేను దేవుడి దూతను అని చెప్పుకుని తిరగడానికి, మతవ్యాప్తికి తనేమీ ప్రవక్త కాదు, ప్రవచనకారుడు కాదు, పండితుడు కాదు, పూజారి కాదు…
అంతటి ఆదిశంకరాచార్యుడి వంటి అనితర ధర్మప్రచారకులు సైతం నా ప్రతి నిర్ణయం దేవుడి నిర్దేశించిందే అని చెప్పలేదు… రేప్పొద్దున తన నిర్ణయాలతో ఏ ఫలితం సంభవించినా సరే, అదంతా దేవుడి నిర్ణయం, నాదేముంది అని తప్పించుకునే మాటలా ఇవన్నీ… పుస్తెలు, అయోధ్యకు బాబ్రీ తాళం వంటి మాటలకు రాజకీయాల్లో తప్పడం లేదు అనే సమర్థనో, ముసుగో ఉంది, కానీ అంతా భగవదేచ్ఛ అనే ఈ దైవదూత ముద్ర దేనికి..? దీని వెనుక మోడీ స్ట్రాటజీ ఏమిటి..?
కొందరు పార్టీ నేతలైతే మరీ ‘మోడీ అక్షరాలా దేవుడే’ ‘దేవుడు పంపించిన దూత’ అనే వ్యాఖ్యలు చేస్తున్న వీడియోలు కూడా వస్తున్నాయి… మోడీ తన రాజకీయ జీవితంలో చాలా తప్పుడు నిర్ణయాలున్నాయి… సమాజానికి నష్టకారకాలూ ఉన్నాయి… అధిక ధరల మంటల దగ్గర నుంచి కీలక ప్రజోపయోగ అంశాల్లో ప్రజావ్యతిరేక నిర్ణయాలు కూడా ఉన్నాయి… అవన్నీ దేవుడు చెప్పినవేనా..? మోడీ తనంతటతాను తనను ఓ సుపీరియర్ డివైన్ పవర్‌గా ప్రొజెక్ట్ చేసుకుంటున్నాడా..? నేను మానవమాత్రుడిని కాను, దేవుడు చెప్పినట్టు నడిచే కారణజన్ముడిని అని చెప్పుకోవడం ఏ కోణంలో చూసినా అబ్సర్డ్…
చరిత్ర చాలామందిని చూసింది… కోట్ల మందిని తమ కనుసన్నలతో, తమ మాటలతో ప్రాణత్యాగాలకు కూడా వెరవకుండా కదిలించిన వాళ్లనూ చూసింది… నియంతలను చూసింది, బాబాలను చూసింది, మత ప్రచారకులను చూసింది, మహత్తుల స్వాములుగా ప్రచారం పొందినవారినీ చూసింది… కాలగతిలో ఎవరూ మిగల్లేదు… ఎవరూ మిగలరు కూడా… దేవుడు అనేది నమ్మకం… నేనే దేవుడి దూతను, రాయబారిని అని చెప్పుకోవడాన్ని ఏమనాలి..? హేమో… మోడీయే ఇంకేం చెబుతాడో మరి..!
అర్థమైంది కదా… శ్రీశ్రీశ్రీ మోడీ స్వామీజీ మరో రెండు పుష్కరాలు పాలిస్తాడట… ఈ గొప్పలు, భ్రమలు, ఏతులు చదువుతుంటే ఒక తెలుగు నాయకుడు గుర్తొస్తున్నాడా..? ఆయన గారికి ఈయన గారు వంద రెట్లు గొప్పోడు..!!
Share this Article