Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కొండాకోన; వాగూవంక; ఊరూవాడా; రాయీరప్ప… అన్నీ మాట్లాడే నేస్తాలు…

May 24, 2024 by M S R

గమనమే నీ గమ్యమైతే బాటలోనే బతుకు దొరుకు

భారత్- పాకిస్థాన్ సరిహద్దుల్లో ఒక ఊరి ముందు షియోక్ నది వంతెన మీద ఫోటోలు తీసుకుంటుంటే బైకుల మీద పర్వతాలను అధిరోహించే బృందం కూడా మా పక్కన ఆగి… ఫోటోలు తీసుకుంటోంది. ఒక రాయల్ ఎన్ఫీల్డ్ బండి మీద ఏపి నంబర్ ప్లేట్ ఉండడంతో తెలుగువారే అయి ఉంటారనుకుని… వెళ్లి పలకరించాను. విశాఖపట్నం దంపతులు. రోజుకు 200 నుండి 250 కిలో మీటర్లు బైక్ మీద ప్రయాణిస్తూ విశాఖ నుండి లేహ్ వచ్చారు. రాను పోను 25 రోజుల ప్రయాణ ప్రణాళిక.

ఇంత సాహసయాత్ర దేనికి తల్లీ? ఈ ప్రయాణంలో ఏమిటి మీ అనుభవాలు? అని అడిగాను.

Ads

“1500 ఎస్ఎఫ్‌టీ జైలు గదిలాంటి అపార్ట్ మెంట్. తలుపు తీయగానే దేభ్యపు మొహాలు వేసుకుని నిర్వికారంగా కనిపించే మనుషులు. ఆకాశం లేదు. మేఘం కనపడదు. నక్షత్రాలెక్కడున్నాయో తెలియదు. రోజూ అదే చోటు. అవే మొహాలు. విసిగిపోయామండీ. కాస్త ఊపిరి పీల్చుకోవాలనుకున్నాం. పక్కా ప్లాన్ తో బయలుదేరాము. దాదాపు చివరి చోటుకు వచ్చాము. ఇక తిరుగు ప్రయాణమే…” అని కళ్లల్లో కాంతితో ఉత్సాహంగా ఆమె గలగలా చెప్పుకుపోతోంది. నావీ అవే అభిప్రాయాలు కాబట్టి ఆమె మాటలకు కడుపు నిండిపోయింది.

“మా ఆవిడ కాసేపు, నేను కాసేపు ఎన్ఫీల్డ్ నడుపుతున్నాం. జర్నలిస్టులకంటే గొప్పగా మా ఆవిడ స్పాట్ రిపోర్టింగ్ చేస్తుంది” అని ఆయన ముసి ముసి నవ్వులతో చెబుతుంటే…”మన మనసులో మాట ఉన్నదున్నట్లు చెప్పడానికి జర్నలిస్టులే కావాలా ఏమిటి?” అని ఆమె మౌలికమైన ప్రశ్న వేసింది.

ఆ దంపతులకు ఆకాశమే పైకప్పు. భూమి కాళ్ల కింద ఫ్లోర్. ఎడతెగని దారి వారి చక్రాల కింద పరచుకున్న చాప. కొండా కోన; వాగూ వంక; ఊరూ వాడ; ఎత్తు పల్లాలు; రాళ్ళూ రప్పలు అన్నీ మాట్లాడే నేస్తాలు.

భారత్- చైనా (అక్సాయ్ చిన్) సరిహద్దుకు వెళ్లి… తిరుగు ప్రయాణంలో ఒకచోట కారు ఆపి చుట్టూ మంచు కొండలను, ప్రకృతి గీచిన రమణీయ చిత్రాన్ని చూసి మైమరచిపోతుంటే మా కారు పక్కన కెఎల్ నంబర్ ప్లేట్ ఉన్న ఒక స్కూటీ వచ్చి ఆగింది. ఒక యువకుడు హెల్మెట్ తీసి… నీళ్లు తాగుతున్నాడు. కేరళ నుండి వస్తున్నావా? అని మాట కలిపాను. అవునన్నాడు. పరస్పరం పరిచయాలయ్యాక అతడి దేశ సంచారం గురించి ఒళ్లు పులకించిపోయేలా చెప్పాడు.

ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. మధ్యతరగతి కుటుంబం. పిజికి వెళ్లేలోగా ఒక ఏడాది దేశం తిరగాలనుకున్నాడు. ఇంట్లో మొదట ఒప్పుకోలేదు. స్కూటీ పెట్రోల్ కు, తిండికి మాత్రమే డబ్బు ఇవ్వగలం అని చివరికి ఒప్పుకున్నారు. ఏడు నెలల నిరంతర ప్రయాణం. కేరళ నుండి లడాఖ్, నేపాల్, భూటాన్ రూట్ మ్యాప్ సిద్ధం చేసుకున్నాడు. రాత్రిళ్లు లాడ్జుల్లో బస చేస్తే డబ్బు చాలదు కాబట్టి చిన్న టెంట్ ఏర్పాటు చేసుకున్నాడు. బైకుల మీద దేశ సంచారం చేసే బృందాలను సంప్రతించాడు. ఏ రుతువులో ఎక్కడికి చేరుకోవాలో ముందే ప్లాన్ వేసుకుని ఒంటరిగా తిరుగుతున్నాడు. ఇప్పటికి అయిదు నెలలయ్యింది. ఇప్పటిదాకా ఎక్కడా ఏ ఇబ్బందీ ఎదురు కాలేదు.

ఏమి నేర్చుకున్నావు ఈ పర్యటనలో అని అడిగాను. “మనుషులందరూ మంచివాళ్లే అని తెలుసుకున్నా” అన్నాడు తడుముకోకుండా. పట్టుమని పాతికేళ్లు కూడా నిండని పిల్లాడు నా కళ్లు తెరిపించినట్లు అనిపించింది. భాష సమస్య కాలేదా? అని అడిగాను. కొండాకోనలు, వంతెనలు, మలుపులు, బండ రాళ్లే మనతో ఏదో మాట్లాడేప్పుడు మనుషుల భాషతో సమస్య ఎందుకుంటుంది? అన్నాడు. లోకం తిరిగిన అతడిలో లోకం ప్రతిఫలిస్తున్నట్లు, ఏవేవో తాత్విక రహస్యాలను అతడు కనుక్కుని తనలో తానే ఆనందంగా సంచరిస్తున్నట్లు స్పష్టంగా అర్థమయ్యింది.

ఇలా వారం రోజుల్లో లెక్కలేనన్ని బైక్ యాత్రికుల బృందాలను చూశాను. అందరితో మాట్లాడడం కుదరదు. ఈ ఇద్దరే ఆ అందరిలో కూడా ఉండి ఉంటారు. ఇందులో ఎంతమందికి గమ్యం సినిమాలో సిరివెన్నెల రాసిన అనన్యసామాన్యమైన బతుకు బాట పాట తెలుసో? తెలియదో? నాకు తెలియదు.

“ఎంతవరకు? ఎందుకొరకు? ఇంత పరుగు అని అడక్కు!
గమనమే నీ గమ్యమైతే బాటలోనే బ్రతుకు దొరుకు
ప్రశ్నలోనే బదులు ఉంది గుర్తుపట్టే గుండెనడుగు

ప్రపంచం నీలో ఉన్నదని చెప్పేదాక ఆ నిజం తెలుసుకోవా?
తెలిస్తే ప్రతీ చోట నిన్ను నువ్వే కలుసుకుని పలకరించుకోవా?

కనపడేవెన్నెన్ని కెరటాలు కలగలిపి సముద్రమంటారు
అడగరే ఒక్కొక్క అల పేరు
మనకిలా ఎదురైన ప్రతివారు మనిషనే సంద్రాన కెరటాలు
పలకరే మనిషి అంటే ఎవరూ
సరిగా చూస్తున్నదా నీ మది మదిలో నువ్వే కదా ఉన్నది
చుట్టూ అద్దాలలో విడి విడి రూపాలు నువ్వు కాదంటున్నది
నీ ఊపిరిలో లేదా గాలి వెలుతురు? నీ చూపుల్లో లేదా
మన్ను మిన్ను నీరు? అన్నీ కలిపితే నువ్వే కాదా కాదా?

ప్రపంచం నీలో ఉన్నదని చెప్పేదాక ఆ నిజం తెలుసుకోవా
తెలిస్తే ప్రతీ చోట నిన్ను నువ్వే కలుసుకుని పలకరించుకోవా

మనసులో నీవైన భావాలే బయట కనిపిస్తాయి దృశ్యాలై;
నీడలు నిజాల సాక్ష్యాలే;
శత్రువులు నీలోని లోపాలే; స్నేహితులు నీకున్న ఇష్టాలే;
ఋతువులు నీ భావ చిత్రాలే;
ఎదురైన మందహాసం నీలోని చెలిమి కోసం;
మోసం రోషం ద్వేషం నీ మకిలి మదికి భాష్యం;
పుట్టుక చావు రెండే రెండు నీకవి సొంతం కావు; పోనీ
జీవితకాలం నీదే నేస్తం రంగులు ఏం వేస్తావో కానీ…”

ఈ పాటే వారైన వారికి పాటతో పనిలేదు. పాట ప్రతిపదార్థం తెలుసుకోవాల్సింది మనమే. -పమిడికాల్వ మధుసూదన్ 9989090018

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions