హమ్మయ్య… కడుపు నిండింది మీడియాకు… చట్టానికి… సోషల్ మీడియాకు… సొసైటీకి… సినిమాలకు… టీవీ సీరియళ్లకు… అర చేతిలో స్మార్ట్ ఫోన్‌గా ఇమిడిన ప్రలోభానికి…!! ఆ ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుని, అందరి ఆత్మలకీ శాంతి చేకూర్చింది… తమ వల్లే దారితప్పిన ఓ యువతి జీవితం, తాము ఎంత పీక్కుతింటున్నా సరే, మళ్లీ ఎక్కడ నిలదొక్కుకుంటుందో, ఎక్కడ బాగుపడిపోతుందో అని తల్లడిల్లిపోయిన ఈ శక్తులన్నింటికీ ఇప్పుడు తృప్తిగా ఉంది… ప్రస్తుతానికి వీటి ఆకలి తీరింది… ఇప్పుడిక మరో కొత్త బతుకును, మరో శవాన్ని వెతుక్కోవాలి ఈ అఘోరాలు…….. అతిశయోక్తిగా అనిపిస్తోందా..? కాదు, నిజం అదే… నిష్ఠురంగా ఉన్నా బాధ్యత ఈ శక్తులదే… ఇవేవీ ఒక బతుకును నిలబెట్టలేవు… పొరపాటున నిలబడితే అసహనంతో రగిలిపోయి ప్రాణాలు తీసేదాకా ఊరుకోవు…
ఎవరీ ఫార్మసీ విద్యార్థిని..? ఈమధ్య కథే కదా… గుర్తు లేదా..? నన్నెవడో రేప్ చేయబోవటానికి ప్రయత్నించాడు, కిడ్నాప్ చేశాడు అని అమ్మకు ఫోన్ చేసింది… ఆమె పోలీసులకు చెప్పింది… దర్యాప్తు ముగిసింది… ఆమె తప్పు చెబుతోందని తేలింది… మస్తు గంజాయి సేవించి, ప్రియుడితో కలిసి, వాడి అన్నాదమ్ములతో కలిసి ఫుల్లు ఎంజాయ్ చేసి అందరినీ తప్పుదోవ పట్టించింది… ఇంకేముంది..? మీడియా, సొసైటీ గద్దల్లా వాలిపోయాయి… నోటికొచ్చిన కథలన్నీ అల్లాయి… అసలే చట్టమే క్రూరమైంది… దానికి శిక్షించడం తప్ప బతికించడం, దారినపెట్టడం, సున్నితంగా వ్యవహరించడం వీసమెత్తు కూడా తెలియదు… అసలది దాని పనే కాదు… మన కోర్టులు దానికి కొనసాగింపు మాత్రమే… మన చట్టమంటేనే ఓ థర్డ్ డిగ్రీ… దానికి మరే డిగ్రీలు తెలియవు… అది ఏదో చెప్పింది, మీడియా మసాలా వేసుకుని వండింది… సొసైటీ పండుగ చేసుకుంది… ((అవునూ, తెలంగాణలో గంజాయి విస్తరణ ఎవరి తప్పు..? ఎవరి వైఫల్యం..? పల్లెలు గం‘జాయ్’ అంటున్నవి ఎందుకు..? అసలు ఈ ఫార్మసీ కేసులోనూ గంజాయే ఆమెతో ఏమేం తప్పులు చేయించిందో, పోలీసులకు ఏమేం చెప్పించిందో, ఎలా ఇరుక్కుపోయిందో ఎవరు ఆలోచించాలి..?))
Ads
ఆమె చేసింది తప్పే… తనలాంటి కేరక్టర్లు కొత్తేమీ కాదు… దారితప్పడం ఎప్పట్నుంచో ఉంది… కారణాలు బోలెడు… ఇప్పుడైతే దారితప్పించడానికి వీలైన సినిమాలు, సీరియళ్లు, ట్యూబ్ వీడియోలు, చేతిలో జియో ఫోన్లు, అపరిమిత బ్రాడ్ బ్యాండ్… అసలు బ్రాడ్ అంటేనే అది కదా..? బతుకంటే ఇదీ అని చెప్పేవి ఉండవు… బతుకును గాడితప్పించే బోలెడు మార్గాలు… సమాజం కాకుల్లా పొడవడం అనేది గతం నుంచీ కామన్… కాకపోతే ఇప్పుడు మీడియా ఉంది, అది కాకుల తరహా కాదు, గద్దలు… అవశేషాలు కూడా మిగల్చదు… రకరకాల కథలల్లుతుంది… రంగులు పూస్తుంది… బద్దీబదనాం చేస్తుంది… మన దిక్కుమాలిన చట్టాలకు దిద్దడం తెలియదు… లాఠీలు పట్టుకుని గుద్దడం తప్ప… వెరసి ఆమె బతకడమే వేస్ట్ అనుకుంది… ఇంకేమైనా బయటికి తెలియని కారణాలున్నాయేమో కూడా తెలియదు… సూసైడ్ చేసుకుంది… కథ ముగిసింది… అనేకానేక కథల్లాగే అదీ ముగిసింది… హమ్మయ్య… బ్రేవ్… మరో బతుకును వెతకాలిక… అంతుచూడాలిక…!!
Share this Article