సడెన్‌గా ఇది యాంటీ తెలంగాణ సెంటిమెంట్ భావన అనుకుంటారేమో… అలా అనుకునే పనిలేదు, అవసరం లేదు… జయ జయహే తెలంగాణ… జననీ జయకేతనం… ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం… తెలంగాణ సహజకవి అందెశ్రీ రాసిన ఈ గీతం తెలంగాణ ఉద్యమకాలంలో ఉధృతంగా వినిపించింది…
ఉద్యమ కార్యక్రమాల్లో తప్పకుండా వినిపించేది… అదొక చోదకశక్తి… తెలంగాణ జాతిగీతంగా యావత్ తెలంగాణ సమాజం ఓన్ చేసుకుంది… తెలంగాణ ఆత్మగీతంగా కీర్తించింది… కానీ దాన్ని నేను తెలంగాణను తెచ్చానహోయ్ అని పదే పదే చాటుకునే కేసీయార్ పక్కన పడేశాడు… తను తెలంగాణ సమాజాన్ని బాగా ఉద్దరించిన పదేళ్ల కాలంలో జాతిగీతంగా ప్రకటన లేదు, ఎక్కడా ఆలపించిన దాఖలా లేదు…
రేవంత్‌రెడ్డి సీఎం అయ్యాక ఆ పాటను తెలంగాణ గీతంగా అధికారికంగా గుర్తిస్తున్నామని స్పష్టంగానే ప్రకటించాడు… అందెశ్రీని పిలిచాడు, శాలువా కప్పాడు… హత్తుకున్నాడు, అది సముచిత గౌరవం, గుర్తింపు… మరి ఓ నిర్ణీత బాణీలో రికార్డ్ కావాలి కదా… ఆస్కార్ అవార్డు విజేత కీరవాణిని పిలిచాడు… బాధ్యత అప్పగించాడు… తన స్టూడియోకు వెళ్లి మరీ విన్నాడు… ఇంకా ఫైనల్ కాలేదు…
Ads
(ఫోటోలో సీఎం రేవంత్‌రెడ్డితోపాటు స్వరకర్త కీరవాణి, గీత రచయిత అందెశ్రీ, సీఎంపీఆర్వో అయోధ్యరెడ్డి ఉన్నారు)
ఈలోపు ఓ కంట్రవర్సీ… ఎహె, తెలంగాణ ఆత్మగీతాన్ని ఆంధ్రులు స్వరపరచడం ఏమిటని… అది మా నైతిక హక్కు, ఆ బాధ్యత మేమే చేపడతాం అని తెలంగాణ సినీ మ్యూజిషియన్స్ సంఘం అంటోంది… అలా ఓన్ చేసుకోవాలనే తపన మంచిదే… కానీ మరో కోణం ఆలోచిద్దాం… అందెశ్రీ నూటికి వెయ్యిశాతం తెలంగాణవాడు… అంటే తెలంగాణ బాగును తపించేవాడు… తన పాటలోనూ తెలంగాణ ఆత్మే ధ్వనించింది…
ఒకప్పుడు ది గ్రేట్ ఆంధ్రా గాయకుడు బాలసుబ్రహ్మణ్యం తెలంగాణ పాటను పాడాలని కోరితే తిరస్కరించాడని వార్తలు చదివాం, ఎవరో ప్రముఖ కవిగాయకుడే ఆరోపించినట్టున్నాడు… తెలంగాణ పదాన్ని, భాషను, పాటను, సంస్కృతిని ఘోరంగా పరాభవిస్తున్న రోజులు అవి… మరి అలాంటివాళ్లే ఈరోజు సినిమాల్లో తెలంగాణను నెత్తిన పెట్టుకుంటున్నారు… తెలంగాణ ఆట, పాట, కల్చర్, ఆహారం, పండుగ… అన్నీ కావల్సి వచ్చాయి…
ఎస్, కీరవాణిని తెలంగాణ ఆత్మగీతానికి స్వరాలు కూరిస్తే తప్పేమిటి..? ఒక ఆంధ్రుడితో పనిచేయించుకుంటున్నాం తప్ప ఇందులో ఆంధ్రం మీద ప్రేమ ఏమున్నట్టు..? పైగా స్వరాలకు, రాగాలకు తెలంగాణతనం, ఆంధ్రాతనం వేరే ఉంటుందా..? కంటెంటుకు ఉంటుంది… అంతే… ఎవరు పాడితేనేం..? ఎవరు కూరిస్తేనేం..? కావల్సింది తరతరాలు జాతి పాడుకునే ఓ మంచి బాణీ… ఆ పదాలు సగౌరవంగా ఆ బాణీలో ఇమడాలి, అంతే… ప్రతిదీ వివాదం చేయడం తప్ప అసలు ఇందులో ఏముందని..?
ఐనా, కీరవాణి ఏదో బాణీ కట్టేయగానే ప్రభుత్వ ముఖ్యులు ఆమోదించరు… వింటారు, బాగుందని ఫీలైతేనే ఆమోదముద్ర వేస్తారు… మన అవసరం… కీరవాణి కాకపోతే తమిళ అనిరుద్ధుడిని, ఏఆర్ రెహమానుడిని, కన్నడ కాంతార అజనీషుడిని రప్పించుకుంటాం… మరీ కాదంటే… మన తమన్, మన డీఎస్పీలే రంగంలోకి దిగుతారు… సో వాట్..?! రాహుల్ సిప్లిగంజ్ పాడితేనే తెలంగాణతనం పలకాలని ఏమీలేదు… కృతకంగా ఉచ్చరించకుండా సరిగ్గా తెలంగాణపదాల్ని పాడితే చివరకు ఆ స్వరకఠోరుడు సిధ్ శ్రీరాముడైనా వోకే…!!
ఇంకా నయం… అందెశ్రీని కూడా ఏదో పనికిమాలిన వివాదంలోకి లాగి… చంద్రబోసుడు బెటర్ కదా, సుద్దాల బెస్ట్ కదా అనే వ్యర్థ వాదనలకు తీసుకురాలేదు… గుడ్..!! వాళ్లు ఆర్టిఫిషియల్స్, అందెశ్రీ హార్టిఫిషియల్..!!
చివరగా… కీరవాణి స్వరాలా అని గుండెలు బాదుకుంటున్నవారికి ఓ విషయం గుర్తుచేయాల్సి ఉంది ఇక్కడ… 2021… తెలంగాణ సంస్కృతీ వీరపరిరక్షకురాలు, బతుకమ్మ సృష్టికర్తగా ప్రచారమయ్యే కల్వకుంట కవిత ఆస్కార్ అవార్డు విజేత రెహమానుడితో బతుకమ్మ పాట కంపోజ్ చేయించింది.,. అంతా అరవ సినిమాల స్టయిల్… దీనికి గౌతమ్ మేనన్ దర్శకత్వం అట పాట చిత్రీకరణకు… మరి కీరవాణి కూడా అదే ఆస్కార్ విజేత… కానీ తెలుగుదనం తెలిసినవాడు… అన్నమయ్య పాటల్ని అమృతధారలా చెవుల్లోకి ఒంపినవాడు…!!
Share this Article