యుద్ధం పలురకాలు… సరిహద్దుల్లో సైన్యం ఎదురెదురుగా తారసపడి కాల్చుకోవడం చాలా ఓల్డ్ స్టయిల్… ఇప్పుడు కాలం మారింది, పద్దతీ మారింది… సపోజ్, చైనా- అమెరికా అనుకొండి, ఆర్థిక యుద్దాలు చేసుకుంటాయి… పాకిస్థాన్ అనుకొండి, ఇండియాలోకి నకిలీ కరెన్సీ, ఉగ్రవాదులు, డ్రగ్స్ గట్రా పంపించి అదోరకం రోగ్ యుద్ధం చేస్తుంటుంది… రష్యా, ఉక్రెయిన్ అనుకొండి, భీకరంగా మిసైళ్లు, బాంబులతో దాడులు చేసుకుంటుంటాయి…
ఇజ్రాయిల్, పాలస్తీనా అనుకొండి… వేల పారాచూట్లలో ఉగ్రవాదులు దిగి కనిపించినవాళ్లనల్లా కాల్చేసి, ఆడవాళ్లను ఎత్తుకుపోతారు… ఇజ్రాయిల్ ప్రతిగా రఫానే రఫాడిస్తుంటుంది… కానీ దక్షిణ కొరియా, ఉత్తర కొరియా నడుమ మరీ చిల్లర, డర్టీ, డస్ట్ బిన్ యుద్ధం జరుగుతూ ఉంటుంది… తాజాగా ఏమిటంటే..?
దక్షిణ కొరియా నుంచి యాంటీ ఉత్తర కొరియా యాక్టివిస్టులు పెద్ద పెద్ద బెలూన్లను సరిహద్దుల్లో ఎగురవేసి, ఉత్తర కొరియాలో పడేలా చేసేవాళ్లు… వాటికి కట్టబడిన బ్యాగుల్లో ప్రజాస్వామ్య ఆవశ్యకత, ఉత్తర కొరియా పాలకుల అరాచకాలు, అనాగరిక విధానాలను ఎండగడుతూ కరపత్రాలు ఉండేవి… ఉత్తర కొరియాలో నిషేధించబడిన పాప్ మ్యూజిక్ పెన్ డ్రైవ్స్ గట్రా కూడా ఉండేవి… వాటిని గాలిలోనే పేల్చేయడానికి ఉత్తర కొరియన్లు ప్రయత్నించడం, ఉద్రిక్తతలు చోటుచేసుకునేవి…
Ads
దక్షిణ కొరియా పాత ప్రభుత్వానికి ఇది పెద్దగా ఇష్టం ఉండేది కాదు, ఈ బెలూన్ల యవ్వారాన్ని నిషేధించింది… కానీ అక్కడి గొప్ప అపెక్స్ కోర్టు ఠాట్, అలా ఎలా ఆపుతారు, అది భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, అడ్డుకోవడం తప్పు అని చెప్పింది… ఈ బెలూన్ల ద్వారా పంపించబడుతున్న సిద్ధాంత కాలుష్యానికి వ్యతిరేకంగా… తనూ తన రేంజ్‌లో స్పందించాలని ఉత్తర కొరియా భావించింది… అదసలే ఓ టైపు కంట్రీ… ఇక చూసుకొండి అని మొన్న ఆ విదేశాంగ శాఖ మంత్రి ఉరిమాడు కూడా…
ఇంకేముంది..? వందల బెలూన్లు ఉత్తర కొరియా నుంచి దక్షిణ సరిహద్దుల్లోకి వాలుతున్నాయి… వాటికి జతచేసిన బ్యాగులపై ‘విసర్జన’ అని రాసి ఉంటుంది… నిజంగానే తడి చెత్త, మలం గట్రా డ్రైనేజీ సరుకును నింపి వదులుతున్నారు… నిజంగానే ఆ చెత్త మాత్రమే ఉందా..? ఇంకేమైనా రేడియో యాక్టివ్ పదార్థాలు, ప్రమాదకర రసాయనాల్ని పంపిస్తున్నారా..? ఆ రోగ్ కంట్రీ చేసినా చేస్తుంది అనుకున్న దక్షిణ కొరియా అనేక మిలిటరీ బృందాలను సరిహద్దుల్లో దింపి, పరీక్షలు చేయిస్తోంది…
సరిహద్దు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేసింది, జాగ్రత్తగా ఉండాలని ప్రకటనలు చేస్తోంది… పర్లేదు లెండి, మరీ డ్రైనేజీ యుద్ధంలాగే ఉంది గానీ, ఎవరికీ ఏ ప్రమాదమూ లేదు కదా అంటున్నారట రెండు దేశాల్లోని రాజకీయ పరిశీలకులు…!!
Share this Article