ఇదొక ఆసక్తికరమైన వివాదం… బహుశా మనకు ప్రపంచంలో ఎక్కడా ఏ ఎన్నికల ప్రక్రియల్లోనూ కనిపించదు… అవును, మోడీ వంటి లీడర్ కూడా కనిపించడు కదా… వంద మంది ప్రశాంత్ కిషోర్ల పెట్టు ఒక్క మోడీ… జనం సెంటిమెంట్లను రాజేయడంలో సిద్ధహస్తుడు…
మాటలు కాదు, ఫోటోలు దిగి ఫైట్ చేస్తాడు… చూడటానికి వింత గొలిపే ఆలోచనలు… కానీ ప్రత్యర్థుల్లో అవే వణుకు కారణాలు… జస్ట్, అలా లక్షద్వీప్ బీచ్‌లో కుర్చీ వేసుకుని ఫోటో దిగుతాడు… మాల్దీవులు అనే దేశం ఈ దెబ్బకు తల్లడిల్లిపోతూ, ఈరోజుకూ ఒడ్డున పడలేదు… ఎక్కడో కుర్చీ, ఇంకెక్కడో పేలుళ్లు… హఠాత్తుగా సముద్రగర్భంలోని ద్వారక వద్దకు మాంచి మెరైన్ జాగ్రత్తలతో వెళ్తాడు… కృష్ణుడు రమ్మన్నాడట… ఫుల్లు ప్రచారం…
అదేమంటే, దేవుడు నన్ను పంపించాడు, నాది మామూలు జన్మ కాదు, ఈ ఆలోచనలు, ఈ అడుగులన్నీ ఆయన నిర్దేశించినవే అంటాడు గడుసుగా… మమత వంటి నేతలకు చిర్రెక్కుతుంది… నువ్వు దేవుడివైతే బెంగాల్ రా, గుడి కడతా, డోక్లా (గుజరాతీ స్నాక్) తినిపిస్తా అంటుంది గుర్రుగా… ఇప్పుడేమో నేను కన్యాకుమారిలో వివేకానంద రాక్ వద్ద ధ్యానం చేసుకుంటాను అంటున్నాడు…
Ads
ఇది మళ్లీ రచ్చ… ఠాట్, ప్రధాని ధ్యానం చేయడానికి వీల్లేదు… అది వోటర్లను ప్రభావితం చేస్తుందీ అంటుంది యాంటీ బీజేపీ కూటమి… అరె, ఒకటిన చివరి దశ ఎన్నికలు, అంటే 30 సాయంత్రం నుంచి ప్రచారం చేయడానికి వీల్లేదు… రిజల్ట్ వచ్చేదాకా ఫుల్లు ఖాళీ… ఇన్నాళ్లూ తిరిగీ తిరిగీ… పుస్తెలు, ఆస్తులు, రిజర్వేషన్లు, నవీన్ కుట్ర వంటివి అరిచీ అరిచీ అలిసిపోయాను, కాస్త ప్రశాంతంగా ధ్యానం చేసుకుంటాను, మీ ముల్లేం పోయింది అంటాడు మోడీ…
అదేమిటంటే, గాంధీ ఎవడికీ తెలియదు ఆయనపై సినిమా వచ్చేదాకా అంటూ ప్రచారం ప్రభావం ఏమిటో ఓ ఉదాహరణ చెబుతాడు… పోనీ, ఆయన ధాన్యం ఎవరికీ తెలియకుండా, ప్రశాంతంగా, ఒంటరిగా, లోతుగా చేస్తాడా..? లేదు… 2 వేల మంది పోలీసుల భద్రత, అట్టహాసం, ఫోటో సెషన్లు, ప్రత్యేకంగా వీడియోగ్రఫీ అన్నీ ఉంటాయి… మరి భారత ప్రధాని ధ్యానం అంటే హిమాలయ గుహల్లో మామూలు సన్యాసులు చేసుకునే ధ్యానం కాదు కదా…
అసలే దేవుడు అంటాడు, మతం అంటాడు, గుడి అంటాడు, ఇప్పుడు ధ్యానం అంటాడు… నో, ఇదంతా వోటర్లను మాయ చేయడమే అంటుంది ఇండి కూటమి… ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది… ధ్యానాన్ని వద్దనలేదు, ఏ రూల్ ప్రకారం అది నియమోల్లంఘన అవుతుందో వాళ్లకు తెలియదు, తెలిసినా ఏమీ చేయలేరు, వాళ్లేమైనా శేషన్‌లా..? ఉత్త అవశేషాలే కదా…
అవున్నిజమే, మోడీ ధ్యాన ప్రహసనం ఎంతోకొంత బీజేపీకి పాజిటివ్ ప్రచారం తెస్తుంది… సరే, కానీ ధ్యానం ఎలా, ఎవరు అడ్డుకోగలరు..? ఇదుగో, ఇలాంటి ప్లాన్లు మోడీ దగ్గర బాగానే ఉన్నట్టున్నయ్… ఆయనేదో కళ్లమూసుకుని, కాషాయం వస్త్రాన్ని ఒంటికి చుట్టుకుంటాడు… ఫోటోలు క్లిక్, వీడియోలు స్టార్ట్… బీజేపీ మీడియా, సోషల్ మీడియా హంగామా… ఖేల్ ఖతం… ధ్యానం అంటే మనలోకి మనం ప్రయాణించడం కాదు, ఒక ప్రయోజనంలోకి ప్రయాణించడం..!!
Share this Article