ఒక పిచ్చి, ఒక పైత్యం…. కావు, ప్రజాధనంతో విలాసాన్ని, వైభోెగాన్ని అనుభవించడం అంటారు దీన్ని… ముఖ్యమంత్రులు, కీలక స్థానాల్లో ఉన్న బ్యూరోక్రాట్లు, మంత్రులకు, ఇంకొందరు పెద్దలకు ప్రభుత్వమే నివాస భవనాలు సమకూరుస్తుంది… అవి వాళ్లు ఆయా స్థానాల్లో ఉన్నన్ని రోజులకు మాత్రమే…
కానీ కొందరు వాటిని ప్యాలెసులుగా మార్చేసుకుంటారు, సొంత డబ్బు కాదు కదా, జనం సొమ్మే, ఎలా తగలేస్తేనేం..? అఖిలేష్ యాదవ్ దాదాపు 60 వేల అడుగుల మేరకు ఓ ప్యాలెస్ నిర్మించుకున్నాడు… దాదాపు 100 కోట్ల ఖర్చు అట… సుప్రీం తీర్పు మేరకు చివరకు దాన్ని ఖాళీ చేయకతప్పలేదు, విలువైన ఫర్నిచర్ గట్రా ఎత్తుకుపోయాడు… మాయావతి కూడా దాదాపు 40 కోట్ల దాకా ఖర్చు పెట్టి తను సీఎంగా ఉన్నప్పుడు ఓ ప్యాలెస్ కట్టుకుంది…
మన కేసీయార్ ప్రగతి భవన్‌కు ఎంత పెట్టాడో తెలిసిందే కదా… అధికారం పోగానే నిర్వికారంగా ఫామ్ హౌజ్ బాట పట్టాడు… పట్టాల్సి వచ్చింది… ఇదంతా ఎందుకు చెప్పడం అంటే ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు తక్కువేమీ కాదు… కర్నాటకలో అధికారం వెలగబెడుతున్న సింధూరి రోహిణి అనే తెలుగు మహిళ గురించి అప్పట్లో ఆహా ఓహో, డైనమిక్, టెరిఫిక్, లేడీ సింగం వంటి విశేషణాలతో బోలెడు స్టోరీలు వచ్చాయి కదా…
Ads
తరువాత మరో లేడీ ఐపీఎస్ అధికారితో గొడవలు, రచ్చ, ఒకరివి ఒకరు తవ్వుకోవడంతో ఈ రోహిణి అంత పరిశుద్ధాత్మురాలు ఏమీ కాదని జనానికి అర్థమైపోయింది… తాజాగా ఓ వార్త ఇంట్రస్టింగ్ అనిపించింది, ఏమిటంటే…
ఈమె మైసూరు జిల్లా అధికారిగా కూడా పనిచేసింది కదా… అప్పుడు గెస్ట్ హౌజులో ఉండేది… 2020 అక్టోబరు నుంచి నవంబరు 14 దాకా… (అంతకుముందు తన విలాసం కోసం ప్రజాధనం భారీగా వెచ్చించినట్టు కూడా ఆరోపణలు వచ్చాయి, బహుశా అది వేరే భవనం అయి ఉంటుంది…)
అది ఎవరి గెస్ట్ హౌజూ అంటే అడ్మినిస్ట్రేటివ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ (ఏటీఐ) వాళ్లది… సరే, తాత్కాలికంగా అందులో ఉంది, తరువాత ఖాళీ చేసింది… కానీ అందులోని పలు వస్తువులు మాయమయ్యాయి… అమ్మా, తల్లీ, ఆ వస్తువులు వాపస్ చేయాలని ఈ ఇన్‌స్టిట్యూట్ లేఖ రాసింది… డిసెంబరు 16న తొలిసారి, 2012 జనవరి 8న మలిసారి, ఏప్రిల్ 12న మరోసారి లేఖలు రాశారు, ఆమె నుంచి నో రెస్పాన్స్… మరి ఐఏఎస్ అనే అహం…
2022 నవంబరు 30న మరో లేఖ రాసింది ఇన్‌స్టిట్యూట్… అలా పోయిన వస్తువుల విలువ 77,296 రూపాయలు అని ఇన్‌స్టిట్యూట్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికీ రిపోర్ట్ ఇచ్చింది… ఆ వస్తువుల విలువు కాదు ఇక్కడ ముఖ్యం, ఆమె ప్రదర్శించిన చిల్లరతనం…
రోహిణి సింధూరి దేవదాయశాఖ కమిషనర్‌గా వ్యవహరిస్తున్న సందర్భంలోనూ అతిథిగృహం సామగ్రిని వాపసు చేయాలని ఏటీఐ కోరింది… 2023 జనవరి 15న లేఖ అందినా ఆమె ఎటువంటి సమాచారం ఇవ్వలేదు… దాంతో ఆమె వేతనం నుంచి కోత విధించి, సామగ్రి మొత్తాన్ని వసూలు చేయాలని ప్రభుత్వాన్ని సంస్థ ప్రతినిధులు కోరినట్టు తాజా సమాచారం… కనిపించకుండా పోయిన సామగ్రి ఏమిటో తెలుసా..?
టెలిఫోన్ టేబుల్, కోట్ హ్యాంగర్, బ్లాంకెట్, మైక్రో ఓవెన్, కుర్చీలు, పరుపు, కంప్యూటర్ మౌజ్, ట్రే, యోగామ్యాట్, టెలిఫోన్ స్టూల్, ప్లేట్, టీపాయ్, రిసెప్షన్ టెలిఫోన్, మంచంతోపాటు పలు వస్తువులు ఉన్నట్టు ఏటీఐ తన లేఖలో పేర్కొంది… చివరకు కంప్యూటర్ మౌజ్, ట్రే, బ్లాంకెట్, కోట్ హ్యాంగర్… ఛ, తెలుగు మహిళల ఇజ్జత్ తీశావు కదమ్మా తల్లీ..!!
ఆ డబ్బు చెల్లించడం ఆమెకు పెద్ద సమస్య కాదు, కానీ చెల్లిస్తే తప్పు చేశానని అంగీకరించినట్టు అవుతుంది… ఆ సంస్థ వదిలిపెట్టడం లేదు..!! ఐనా, ఆ చిల్లర వస్తువులు నీకెందుకమ్మా… ప్రభుత్వం అడ్డగోలు జీతాలిస్తోంది, అలవిమాలిన సౌకర్యాలిస్తోంది..!! భర్త సంపాదన ఉండనే ఉంది… అధికారం, వసతి, వాహనాలు, పెత్తనం, పనిమనుషులు మన్నూమశానం, ఐనా ఈ చిల్లరకొట్టుడు దేనికి..?!
Share this Article