భారతదేశ అత్యున్నత పదవైన రాష్ట్రపతి పీఠం వరిస్తే ఎవ్వరు మాత్రం కాదంటారు..? స్థితప్రజ్ఞులనుకున్నవారు సైతం.. ఆ అవకాశం వస్తే వదులుకోలేకపోయినవారే. కానీ, ఓ శాస్త్రీయ నృత్య కళాకారిణికి అలాంటి అవకాశం వస్తే.. వదులుకుందన్న విషయం మనలో ఎందరికి తెలుసు..? ఆ పేరే.. రుక్మిణీదేవీ అరుండేల్. రండి కలియుగ రుక్మిణీ కథేంటో ఓసారి తెలుసుకుందాం.
1904, ఫిబ్రవరి 29- 1986 ఫిబ్రవరి 24
ఏ ఫోటో చూసినా.. ఆమె నాట్య భంగిమల్లో ఓ తన్మయత్వంలోనే కనిపిస్తారు. ఫోటోగ్రాఫర్స్ ఎంతగా ప్రయత్నించినా.. కెమెరా లెన్స్ వైపు మాత్రం ఆమె లుక్కు పడదు.. కానీ, ఆ ఫోటోలే ఒర్జినాలిటీని పట్టిచూపుతాయి. ఆమె తన నాట్యంతో ఎంత మమేకమైందో కళ్లకు కడతాయి. అందుకు ఆమె ఛాయాచిత్రాలే.. నాట్యం పట్ల ఆమెకున్న అనురక్తిని చెబుతాయి.
Ads
కేవలం దేవదాసీలకు మాత్రమే పరిమితమనుకుంటున్న రోజుల్లో… భారతీయ శాస్త్రీయ నృత్యమైన భరతనాట్యానికి పునరుజ్జీవం పోసి.. ఆ కళ పునర్నిర్మాణంలో కీలక పాత్రధారి అయిన నర్తకి రుక్మిణీదేవి. ఆమెను కేవలం నాట్యగత్తెగానో, ఓ కొరియోగ్రాఫర్ గానో మాత్రమే కాదు.. జంతు ప్రేమికురాలిగా, జీవకారుణ్య, మనవతావాదిగా ఎన్నో సంస్థలకు పనిచేసిన రుక్మిణీదేవి పరిచయం ఈనాటి తరానికి తెలియాల్సిన విషయం.
అంతేకాదు, 1952 ఏప్రిల్ లో రాజ్యసభకు నామినేట్ అయిన మొట్టమొదటి రాజ్యసభ సభ్యురాలు రుక్మిణీదేవి. అలా 1956లో రెండోసారీ రాజ్యసభకు వెళ్లిన రుక్మిణీదేవి.. జంతు ప్రేమికురాలిగా.. ప్రివెన్షన్ ఆఫ్ క్రూయెల్టీ టూ యానిమల్స్ యాక్ట్ కోసం చట్టసభలో పోరాడిన లీడర్. అలా ఆమె చొరవతోనే నాడు 1962లో యానిమల్ బోర్డ్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేసిన భారత ప్రభుత్వం ఆమెనే చైర్ పర్సన్ గా నియమించింది.
1904, ఫిబ్రవరి 29 రుక్మిణీ దేవి అరుండేల్ జన్మదినం. తమిళనాడు మధురైలోని ఓ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన.. రుక్మిణి తండ్రి తిరువిసనల్లూర్ వాసి. పేరు నీలకంఠశాస్త్రి.. పబ్లిక్ వర్క్స్ డిపార్ట్ మెంట్ లో ఇంజనీర్ గా పనిచేసే నీలకంఠశాస్త్రి సంస్కృత పండితుడు. అదే సమయంలో.. పూర్తి కాంట్రాస్ట్ గా బుద్ధిజాన్ని బాగా ఇష్టపడ్డవాడు. తల్లి శేషామ్మాళ్ తిరువయ్యార్ వాసి. శాస్త్రీయ సంగీత ప్రియురాలు. తండ్రి, బాబాయ్ వీరంతా థియోసాఫికల్ సొసైటీకి అనుబంధంగా ఉండేవారు.
కుల, వర్ణ, మతాలుగా ఎవరిపైనా వివక్ష కనబర్చకుండా అందరినీ ఒకే తీరుగా చూడటం ఈ సొసైటీ ఉద్ధేశ్యం. అలా చెన్నై అడయార్ లో ఏర్పాటు చేసిన థియోసాఫికల్ సొసైటీకి దగ్గర్లోనే నీలకంఠశాస్త్రి తన మకాం మార్చారు. అప్పుడే నీలకంఠశాస్త్రి అనీబిసెంట్ కు సన్నిహితుడై, అనుచరుడిగా మారారు. అయితే, ఎంత సమభావనా విశాల దృక్పథాలున్నప్పటికీ.. భారతీయ గ్రంధాలపై వారికుండే గౌరవం.. వాటి విలువలపై ఉన్న నమ్మకం.. పిల్లలకు వాటిని నేర్పించేందుకు కారణమైంది.
వాల్మీకి రామాయణాన్ని పిల్లలకు ఔపోశన పట్టించాడు. ఆ తర్వాత రుక్మిణీ కూడా బౌద్ధ తత్వంతోనే పెరిగింది. సంకుచిత భావాలతో కాకుండా.. విశాల భావాలతో తమ తల్లిదండ్రులు తమను పెంచడం పట్ల రుక్మిణీదేవీ తరచూ చెబుతుండేవారట. అలా వారింటి పేరే బుద్ధవిలాస్ గా మారిపోయింది. రుక్మీణీ అదే సమయంలో శాస్త్రీయ సంగీతంతో పాటు.. నాట్యాన్ని నేర్చుకుంది.
రష్యా కళాకారిణి అన్నాభావ్లే బాలే నృత్యానికి ఆకర్షితురాలైన రుక్మిణీ… అన్నాభావ్లే గురువైన క్లియోనర్టి వద్ద తానూ నేర్చుకుని బాలే నృత్య ప్రదర్శనల్లో తనదైన శైలితో రాణించింది. మీనాక్షీ సుందరం వద్ద భరతనాట్యంలో ప్రావీణ్యురాలైంది. మొదట్లో తన నాట్య ప్రదర్శనల్లోనూ అవమానాలను ఎదుర్కొన్న రుక్మిణీ.. ఆ తర్వాత థియోసాఫికల్ సొసైటీ వజ్రోత్సవాల్లో భాగంగా 20 వేల మంది ముందు ప్రదర్శించి.. దేశ, విదేశీయులను ఔరా అనిపించింది.
జేమ్స్ కజిన్స్ అనే ఐర్లాండ్ కవి ఆమె నృత్య ప్రదర్శనకు ఆకర్షితుడై.. ఆమెను మరో పది మందికి నేర్పేలా ఓ కళాశాలను ఏర్పాటు చేయాలని సూచించాడు. అలా ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ అనే కళాశాల ప్రారంభమై… ఆ తర్వాత చెన్నైలో అదే కళాక్షేత్రంగా రూపుదిద్దుకుంది.
అయితే, తండ్రి నీలకంఠశాస్త్రి ప్రభావం మెండుగా ఉన్న రుక్మిణీపై.. అనిబీసెంట్ ప్రభావం కూడా పడటంతో.. ఆ తర్వాత తానూ థియోసాఫికల్ సొసైటీలో సభ్యురాలై.. జంతుబలులను ఆపడం.. గ్రామాల్లో అవగాహనా కార్యక్రమాల్లో పాల్గొనడం, ప్రసంగించడం.. ఇలా వాలంటీర్ గా తన జర్నీని కొనసాగించి లీడర్ షిప్ క్వాలిటీస్ నూ పెంచుకున్నారు. ఆ తర్వాత 1920లో తాను అనిబీసెంట్ అనుచరుడిగా ఉన్న ఓ క్రిస్టియన్ అయిన జార్జ్ ను పెళ్లి చేసుకోవడం నాటి సమాజంలో ఓ పెద్ద చర్చకే తెరలేపింది.
సంప్రదాయ కుటుంబాలు దిగ్భ్రాంతినే వ్యక్తం చేశాయి. అలాగే, జార్జ్ ను రుక్మిణీ పెళ్లాడే సమయానికి.. రుక్మిణీ వయస్సు 16 ఏళ్లైతే.. జార్జ్ వయస్సు 42 ఏళ్లు. అంటే దంపతుల మధ్య 26 ఏళ్ల తేడా ఉండటాన్ని సమాజం అంగీకరించలేదు. మొత్తంగా నాటి ద్వాపర యుగాన శ్రీకృష్ణుడు ఎలాగైతే రుక్మిణిని ఎత్తుకెళ్లి పెళ్లి చేసుకున్నాడో.. అదే తరహాలో పేరుకు తగ్గట్టు రుక్మిణీదేవి అరండేల్ పెళ్లి జరిగిన తీరు యాదృచ్ఛికం. జార్జ్ బెనారస్ లోని సెంట్రల్ హిందూ స్కూల్ ప్రిన్సిపాల్ గా పనిచేసేవాడు. అలా రుక్మిణీదేవీ ప్రగతిశీల మహిళగా.. సనాతన, సంప్రదాయ బ్రాహ్మణవాదానికి భిన్నంగా తన కెరీర్ ను మల్చుకున్నారు.
కానీ, అదే సమయంలో సనాతన, సంప్రదాయవాదుల నుంచి రుక్మిణీదేవి కుటుంబం బహిష్కరణకు గురైంది. ఆ తర్వాత ముంబైలో కొంతకాలం జార్జ్ సిడ్నీ, రుక్మిణీ జంట జీవించారు. అక్కడి నుంచి మధ్యప్రదేశ్ ఇండోర్ కు వెళ్లగా.. నాటి మహారాజా హోల్కర్ తన రాజ్యంలో రుక్మిణి భర్త జార్జ్ ను విద్యాశాఖా మంత్రిగా నియమించాడు.
ఆ తర్వాత ఆ జంట చెన్నై అడయార్ కు తిరిగివచ్చింది. అక్కడ అనిబీసెంట్ కు చేదోడువాదోడుగా ఉంటున్న క్రమంలో.. రవీంద్రనాథ్ ఠాగూర్, సరోజినీదేవి వంటివారితో పరిచయాలేర్పడ్డాయి. అదే సమయంలో అడయార్ థియోసాఫికల్ సొసైటీకి జిడ్డు కృష్ణమూర్తి వంటివారిని ప్రపంచ ఉపాధ్యాయుడిగా గౌరవించుకున్న రోజులవి. అలా రుక్మిణీ, జార్జ్ ప్రయాణం దేశ, విదేశాల్లో సాగుతున్న క్రమంలో.. యూఎస్ కు కూడా నాడు ఆ దంపతులు థర్డ్ వరల్డ్ కాంగ్రెస్ కోసం స్పోక్స్ పర్సన్స్ గా వెళ్లారు.
ఒక సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి పెరిగిన రుక్మిణీదేవీ.. థియోసాఫికల్ సొసైటీలో చేరాక.. ప్రపంచ దేశాలన్నీ చుట్టుముట్టారు. అయితే, ఆమె 39 ఏళ్ల వయస్సులో భర్త జార్జ్ కన్నుమూశారు. రుక్మిణీదేవి సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఆమెను పద్మభూషణ్ తో సత్కరించగా.. సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్ నూ అందుకున్న నృత్యకారిణీ రుక్మిణి.
అలా ఓవైపు థియోసాఫికల్ సొసైటీతో సామాజిక తత్వవేత్తగా, ఇంకోవైపు శాస్త్రీయ భరతనాట్య నృత్యకారిణిగా… సనాతన బ్రాహ్మణవాదానికి భిన్నంగా సమతాదృష్టితో ముందుకెళ్లిన ఓ విప్లవకారిణిగా దేశ, విదేశాల్లో తిరుగుతూ అపార అనుభవాన్ని సంపాదించిన రుక్మిణీదేవికి.. మొరార్జీదేశాయ్ రాష్ట్రపతి పదవిని ఆఫర్ చేయడం విశేషం. అయితే, ఈ ఘటన 1977లో జరగ్గా… భారతదేశ అత్యున్నత పదవైన రాష్ట్రపతి పీఠాన్ని ఆమె తిరస్కరించడం.. తన థియోసాఫికల్ జర్నీకి, నృత్యకారిణిగా తన కళకూ ఆటంకమని భావించడం కొసమెరుపు… (రచయిత :: రమణ కొంటికర్ల)
Share this Article