మొక్కలు పెంచడం అంటే… అలా ఓ మొక్క నాటేసి, ఫోటోలు దిగేసి, తరువాత ఏమైందో కూడా పట్టించుకోరు అనేకమంది… గ్రీన్ చాలెంజులు, ఫారెస్టు చాలెంజులు, సెలబ్రిటీ చాలెంజులు గట్రా అసలు మొక్కలు నాటడాన్నే అపహాస్యం చేస్తుంటాయి…
ఫోటో కోసం మొక్కనాటడం కాదు, పబ్లిసిటీ కోసం మొక్కనాటడం కాదు… దాన్ని ఓ సిన్సియర్ ఎఫర్ట్‌లాగా తీసుకోవాలి… అబ్బే, అంత సీన్ లేదండీ, మొక్క నాటామా, ఫోటో దిగామా, మీడియాలో కనిపించామా, అంతే… అంతకుమించి మేం పట్టించుకోం అంటారా..?
ఈ సివిల్ సర్వీసు అధికారి గురించి చదవాలి మీరొక్కసారి… వేల మంది పనిచేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రతిష్ఠాత్మక సింగరేణి సంస్థ సారథిగా క్షణం తీరిక లభించదు ఆయనకు… అదసలే సింగరేణి… ఫుల్లు వేడి… అక్కడ పచ్చదనం అత్యావశ్యం… గతంలోనూ సింగరేణి సంస్థ తరఫున మొక్కలు పెంచుతూ ఉంటుంది… కానీ ప్రజెంట్ సీఎండీ ఎన్.బలరామ్ తీరు వేరు… జస్ట్ అలా రెండు మొక్కలు నాటేసి మమ అనిపించేసి, ఫోటోలు దిగి చేతులు దులుపుకునే తరహా కాదు…
Ads
సింగరేణి వ్యాప్తంగా స్వయంగా 18,000 మొక్కలు నాటి సింగరేణీయుల్లో పచ్చదనం ప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తున్నాడు… ఆయన నాటిన మొక్కలు సింగరేణి వ్యాప్తంగా 12 ఏరియాల్లోని 34 ప్రదేశాల్లో మినీ ఫారెస్టులుగా మారడం విశేషం. సింగరేణి అవనిపై ఆకుపచ్చ సంతకం…
ఈయన 2019 నుండి ఇప్పటి వరకు 18 వేల మొక్కలను స్వయంగా తన చేతులతో నాటడం ఓ విశేషమే… అభినందిద్దాం… ఆయనది మహబూబ్‌నగర్ జిల్లాలో కడుపేద గిరిజన కుటుంబంలో జననం… మొదటి నుంచీ మొక్కల మీద అనురక్తి… 2019 ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జూన్ 5న 108 మొక్కల్ని కొత్తగూడెం బంగ్లోస్ లో తాను ఒక్కడే నాటి, ఓ బృహత్ హరిత యజ్ఞం చేపట్టాడు…
ఒక్కోచోట 150 నుంచి 1250 దాకా మొక్కలు స్వయంగా నాాటడం విశేషం… అప్పటి వరకు అధికారిక హోదాలో సూటు బూటు వేసుకొని కనిపించే ఆయన, మొక్కలు నాటే ప్రాంతానికి రాగానే బనియన్, నిక్కరు లోకి మారిపోయి పార తీసుకొని మొక్క తర్వాత మొక్క నాటుతూ ముందుకు సాగుతుంటాడు…
రామగుండం- 3 ఏరియాలో 120 అడుగుల ఎత్తులో ఉన్న ఓపెన్ కాస్ట్ 1 డంపు యార్డు పైన ఆయన 2019 సెప్టెంబర్ 15 తేదీన 1251 మొక్కలను కేవలం గంటన్నర సమయంలో నాటడం ఓ రికార్డే… అలాగే శ్రీరాంపూర్ ఏరియాలోని ఓపెన్ కాస్ట్ డంప్ పైన 1237 మొక్కల్ని కేవలం గంట సమయంలో లోపే నాటారు.
మియావాకీ పద్ధతిలో భూపాలపల్లి, రామగుండం, ఇల్లందు ప్రాంతాల్లో చిట్టడవులకు శ్రీకారం చుట్టిన ఆయన తను నాటే మొక్కల రకాల పట్ల కూడా శ్రద్ధ వహించడం మరో విశేషం… రావి, మర్రి, జువ్వి, సీమచింత వంటి 20 జాతులు మొక్కలు.., కోతుల బెడద నుంచి ఉపశమనం కలిగించేందుకు వీలుగా శ్రీరాంపూర్ ఏరియాలో ఆర్కే-5 గని సమీపంలో 600 కు పైగా పండ్ల మొక్కలు…
తాను మొక్కలు నాటిన ప్రతి ప్రదేశాన్ని జియో ట్యాగింగ్ చేయించాడు… తద్వారా ప్రతి ఉదయం పూట ఏ ఏ ప్రాంతాల్లో మొక్కలు ఏ విధంగా ఉన్నాయో చూసుకుంటాడు… ‘నేను నాటిన మొక్క ఏపుగా ఎదిగి కాయలు కాస్తుంటే ఓ కొడుకును చూసిన తండ్రిలాంటి భావన నాకు… నాకు అదే చోదకశక్తి…’ అంటాడాయన…
తన వ్యక్తిగతంలోకి వెళ్తే… ఏడుగురు సంతానంలో పెద్దవాడు… చిన్నతనంలోనే కూలీ పని… తరువాత భవన నిర్మాణ కార్మికుడు… హమాలీ, రైతుకూలీ… టెన్త్ అయిపోయాక హైదరాబాద్‌కు వలస… అప్పుడే పెళ్లి… కుటుంబ భారం మోయడానికి గ్యాస్ సిలిండర్ డెలివరీ బాయ్‌గా పని… షేరింగ్ ఆటో… 2010లో సివిల్స్ లో రెవెన్యూ సర్వీసుకు ఎంపిక… 2019 నుంచి సింగరేణి డైరెక్టర్ (ఫైనాన్స్, పర్సనల్, ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్) గా మూడు బాధ్యతలు… 2024 జనవరి 1 నుంచి సంస్థ ఛైర్మన్ మరియు ఎండీ…
తన హరిత ప్రస్థానంలో చాలా అవార్డులు వచ్చాయి, వాటిని ఇక్కడ ఏకరువు పెట్టడం లేదు గానీ… మొక్కలు నాటే వారు, ఫోటోలు దిగేవారు, మీడియా పబ్లిసిటీ కోసం తాపత్రయపడేవారు ఒక్కసారి ఈ బలరాముడి వృత్తాంతం చదివితే మేలు…!!
Share this Article