ఈకాలంలో ఏ జీవజాలాన్ని పెంచడం లాభదాయకం..? కోళ్లు..? మేకలు- గొర్లు..? డెయిరీ..? పందులు..? గుర్రాలు..? చేపలు..? రొయ్యాలు..? సారీ, ఇవేవీ కావు… గాడిదల పెంపకమే సూపర్ డూపర్ క్లిక్కయ్యే వ్యాపారం కాబోతోంది… అవసలే గాడిదలు కదా… ఏం పెట్టినా పర్లేదు, మొండి జీవాలు… అవే పెరుగుతాయి… మార్కెట్ కూడా ఈజీ… అబ్బే, బరువులు మోయడానికి కాదులే బాబూ… మంచి శ్రేష్టమైన మాంసం, పాలు… గాడిదల పాల విక్రయం అందరమూ చూస్తున్నదే… కానీ గాడిద మాంసం తింటారా.?. అని హాశ్చర్యపోకండి… అసలు మన దగ్గర దొరికే గాడిదలు సరిపోవడం లేదట ఆ మాంసం గిరాకీకి… మన గాడిదలు సరిపోక కర్నాటక, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు తదితర రాష్ట్రాల నుంచి కూడా గాడిదలను దిగుమతి చేసుకుంటున్నారట…
ఏమో అఫ్ఘనిస్థాన్, కజికిస్థాన్, తజికిస్థాన్, ఉక్రెయిన్ల నుంచి కూడా దిగుమతి చేసుకోవాల్సి ఉంటుందేమో… పాకిస్థాన్ నుంచి చాన్స్ లేదు… ఆ గాడిదలన్నీ చైనాకు తరలిపోతున్నయ్… బహుశా దొరికితే మయన్మార్‌లో దొరకొచ్చునేమో… అరెరె, ఏమిటింత డిమాండ్..? ఎక్కడ అంటారా..? ఇంకెక్కడ… మన ఆంధ్రప్రదేశ్‌లోనే… గాడిద మాంసాన్ని తెగతినేస్తున్నారట… ఏపీలో గాడిదలు మాయమైపోయాయట… పలు జిల్లాల్లో అసలు చూద్దామన్నా సరే గాడిదలు కనిపించడం లేదట… వీర్యపుష్టి, లైంగికశక్తి కోసం గాడిద బిర్యానీలు, గాడిద కబాబ్‌లు, గాడిద పాయ, గాడిద కార్జం గట్రా తెగ తినేస్తున్నారట… ఇదిగో ఈ వార్త చూడండి… నమస్తే తెలంగాణలో వచ్చింది…
Ads
సురాబత్తుల గోపాల్ అనే జంతు సంరక్షణ సంస్థ కార్యదర్శి ఒకాయన గాడిదలు క్రమేపీ అంతరించిపోతున్న జాబితాలో చేర్చేయాల్సి ఉంటుందేమో… అంతగా తినేస్తున్నారు ప్రజలు, కాపాడండి మహాప్రభో అని సర్కారుకు విజ్ఞప్తి చేసుకున్నాడు… నిజంగానే గాడిద మాంసంతో మరీ అంత ధాతుపుష్టి, ఫుల్లు శక్తి సాధ్యమేనా అంటే డాక్టర్లు కొట్టేస్తారు… అన్ని మాంసాల వంటిదే ఆ మాంసం, దాంతో అదనంగా సమకూరే లైంగిక శక్తి ఏమీ ఉండదు అంటారు… కానీ ఎవరు వింటారు..? ఏమో, ఏ గాడిద పాలలో ఏ వయాగ్రా టైపు శక్తి దొరుకుతుందో అనుకుని మొక్కవోని ఆశావాదంతో లొట్టలేసేస్తున్నారట… ప్చ్, ఫాఫం… గాడిద బరువు, గాడిద బరువు అంటుంటాం… మనుషుల్లో ధాతుపుష్టి పెంచే బరువు బాధ్యత కూడా గాడిదలదేనన్నమాట…! నన్ను చంపకండిరా, నన్ను కోసుకుతిన్నా సరే, ఆ పనిచేసే సామర్థ్యం పెరగదురా అని గాడిదలు ఎంత ఓండ్రపెట్టినా ఎవరూ వినిపించుకోవడం లేదు…!!
Share this Article