పొద్దున్నే నమస్తే తెలంగాణలో ఈ ఎగ్జిట్ పోల్స్ వార్త ఎలా వస్తుందో చూడాలని అనుకున్నాను… అచ్చం అలాగే… ఎగ్జిట్స్ ఏకపక్షమట, ఫీల్డ్ రియాలిటీ పట్టలేదట… సరే, ఈ విషయంలో మాత్రం కాంగ్రెస్, బీఆర్ఎస్ దొందూ దొందే… సేమ్ మాట, సేమ్ ఏడుపు…
అన్నింటికన్నా నవ్వొచ్చింది ఏమిటంటే… తెలంగాణ రిజల్ట్ విషయానికొచ్చేసరికి అదేదో సీప్యాక్ (ప్రశాంత్ కిషోర్ ఐప్యాక్ తరహాలో ఓ పేరు) సంస్థనట… ఎగ్జిట్ పోల్ నిర్వహించిందట… అందులో బీఆర్ఎస్‌కు 11 వస్తాయట, ఫాఫం, కాంగ్రెస్ పార్టీకి ఒకటి, మజ్లిస్‌కు ఒకటి, బీజేపీకి రెండు, టైట్ ఫైట్ రెండు అట… నవ్విపోదురుగాక అన్నట్టుంది…
మిగతా ఎగ్జిట్ పోల్స్ అన్నీ కేంద్రం విషయంలో హంబగ్… తెలంగాణ విషయంలో ఈ సీప్యాక్ అనే ఊరూపేరూ తెలియని ఏదో సంస్థ చెప్పింది మాత్రం రియలాటికి దగ్గరలో ఉందట… హహహ… నిన్న టీన్యూస్ చూస్తుంటే నిజంగానే ఓ విభ్రమ… అన్ని చానెళ్లు, సైట్లు ఎగ్జిట్ పోల్స్ మీద కాన్సంట్రేట్ చేసి, తమదైన విశ్లేషణలకు దిగితే… టీన్యూస్ మాత్రం ఈ దిక్కుమాలిన సీప్యాక్ వివరాలు క్లుప్తంగా ముగించేసి… కేసీయార్ క్యాండిల్ ర్యాలీ మీద కాన్సంట్రేట్ చేసింది… లైవ్… సుదీర్ఘంగా…
Ads
జనం ఏం కోరుకుంటున్నారనేది కాదు, మేమేం చేస్తున్నామనేదే ముఖ్యం… ఇదుగో ఇదే, బీఆర్ఎస్‌ను చివరకు వన్ ఆర్ నన్ అనే దుస్థితికి తీసుకొచ్చింది… ఐనా తన సొంత మీడియా మారదు, పార్టీ అసలే మారదు… టీన్యూస్‌కు దీటైన చానెల్ ఒకటుంది… అది ఏపీది… టీవీ5… అది టీన్యూస్ తాత… అరవీరభయంకర న్యూస్ ప్రజెంటర్లు పాత్రికేయానికే కొత్త పాఠాలే నేర్పగలరు…
చూశారు కదా… అదేదో తలకుమాసిన కేకే సర్వే సంస్థ అట… కొత్తగా వినిపిస్తోంది పేరు… బహుశా టీవీ5 వాళ్లే అప్పటికప్పుడు నెలకొల్పి ఉంటారు… టీడీపీ కూటమికి 25 సీట్లు అట, వైసీపీకి జీరో అట… జనం హౌలాగాళ్లలాగా కనిపిస్తారు ఈ చానెళ్లకు… అందుకే దీన్ని తన పేరుకు తగ్గట్టే అయిదో స్థానానికి తొక్కుతున్నారు పలుసార్లు ప్రేక్షకులు…
మనకు పార్టీల వారీ పంచాంగ శ్రవణాలు తెలుసుగా… ఏ రోటికాడ ఆ పాట అన్నట్టు… ఆయా పార్టీలకు అనుకూల శ్రవణాలు వినిపించి, మొత్తంగా పంచాంగ శ్రవణాల విశిష్టతనే భ్రష్టుపట్టించారు పంతుళ్లు… అచ్చం అలాగే… ఎవడికిష్టం వచ్చినట్టు వాడు… ఏవేవే సర్వే సంస్థల పేర్లతో తమకు అనుకూలంగా అంకెలు పేర్చి, వండి, ప్రేక్షకులకు, పాఠకులకు వడ్డించారు… జనం నవ్వుకోరా అంటారా..? భలేవారే… జనమే కదా అందరికీ అలుసు… అసలు ఫలితాల్లో కర్రు కాల్చి వాతపెట్టేవరకూ అంతే…!!
Share this Article