ఇండి కూటమి… కాంగ్రెస్ నేతృత్వంలోని ఈ కూటమి మునుపెన్నడూ లేని రీతిలో అనేక భాగస్వామ్య పార్టీలతో ఓ పక్కా కూటమిని నిర్మించినా సరే… బీజేపీ మళ్లీ విజయఢంకా మోగించబోతున్నదనేది నిజం… ఎగ్జిట్ పోల్స్ కూడా అదే చెప్పాయి… కానీ ఈ కూటమి విశ్వసనీయత ఎంత..?
బెంగాల్‌లో ఈ కూటమి సభ్యులే టీఎంసీ, సీపీఎం ప్రత్యర్థుల్లా కాట్లాడుకుంటారు… కేరళలో సీపీఎం, కాంగ్రెస్ కూటముల నడుమే పోటీ… అంతెందుకు కూటమి నాయకుడు రాహుల్ గాంధీ మీద వయనాడ్‌లో కూటమి మరో కీలక సభ్య సీపీఐ ప్రధాన నేత రాజా భార్య అన్నీ రాజా పోటీచేసింది…
ఎన్నికల వరకు మాత్రమే మా పొత్తు అంటాడు ఆప్ వాల్… అవును, నాదీ అదే స్టాండ్ అంటుంది మమత… సరే, అది పక్కన పెడితే… తాంత్రిక పూజలు అనే యవ్వారం రెండు రాష్ట్రాల నడుమ, కాదు, కాదు, కూటమిలోని కాంగ్రెస్, సీపీఎం మధ్య చిచ్చు పెడుతోంది… కర్నాటకలో అధికారంలో ఉంది కాంగ్రెస్… కేరళలో అధికారంలో ఉంది లెఫ్ట్ కదా…
Ads
ఈమధ్య కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఎక్కడో మాట్లాడుతూ ‘‘కేరళలో నాకు, సిద్ధరామయ్యకు వ్యతిరేకంగా రాజకంటక, మరణమోహన స్థంభన యాగాలు అఘోరాలతో చేయిస్తూ పంచబలి… అంటే అయిదు రకాల జీవాలను బలి ఇస్తున్నారు… అది శత్రుభైరవి (అగ్నియాగం)…’’ అని ఆరోపించాడు కదా… ఇప్పుడు సీపీఎం రియాక్టయింది…
‘‘జూన్ 1 న, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డి కె శివకుమార్ చెప్పినట్టు… కన్నూర్ జిల్లాలోని తాలిపరంబ వద్ద ఉన్న రాజ రాజేశ్వరి ఆలయ పరిసరాల్లో ఎటువంటి జంతుబలి పూజల్ని నిర్వహించలేదు’’ అని కేరళ ప్రభుత్వం స్పందించింది… కేరళ దేవస్వోమ్ (దేవాదాయ) మంత్రి కె రాధాకృష్ణన్‌తోపాటు సదరు దేవస్థానం కూడా డీకే ఆరోపణలను ఖండించింది…
‘‘1968 నుంచే కేరళలో జంతు బలులపై నిషేధం ఉంది… డీకే చెప్పిన గుడి పరిసరాల్లోనే కాదు, ఏ గుడిలోనూ అలాంటి పూజలు ప్రస్తుతం చోటుచేసుకోలేదు, మేం అన్నిరకాలుగా సమాచారం తెప్పించుకున్నాం… డీకే ఆరోపణలు ఆధారరహితం’’ అన్నాడు రాధాకృష్ణన్… ప్రభుత్వం స్పెషల్ బ్రాంచ్ నుంచి ప్రత్యేక నివేదిక కూడా తెప్పించుకుంది…
‘‘మా ఆలయ పరిసరాల్లో అలాంటి పూజలేమీ జరగలేదు, జరగవు కూడా… సంప్రదాయ శాస్త్రోక్తమైన పూజలు మాత్రమే జరుగుతాయి… మీ రాజకీయాల్లోకి మా గుళ్లను లాగకండి’’ అని రాజరాజేశ్వరి గుడి బోర్డు ట్రస్టీ మాధవన్ అంటున్నాడు… ఈ ఆలయం ఉన్న నియోజకవర్గ సీపీఎం ఎమ్మెల్యే, పార్టీ రాష్ట్ర కార్యదర్శి గోవిందన్ ఏకంగా డీకే మాటలు ‘‘పిచ్చి వ్యాఖ్యలు’’ అని కొట్టిపారేశాడు…
దీనిపై బెంగుళూరులో డీకే మీడియాతో మాట్లాడుతూ… ‘‘ఆ గుళ్లో జరిగాయని నేను చెప్పానా..? గుడి బయట ఎక్కడో జరిగాయని చెప్పాను… వివరాలు నాకు తెలుసు, అవి చెప్పదలుచుకోలేదు, ఆ యాగాల్లో పాల్గొన్న ఓ పూజారి చెప్పాడు… ఆ గుడికి గతంలో నేనూ వెళ్లాను… అక్కడ ఇలాంటి పూజలు జరిగేవి, ఇప్పుడు జరుగుతున్నాయా లేదా నాకు తెలియదు…’’ అని వివరణ ఇచ్చాడు… డీకే మాటలపై మళ్లీ కేరళ ప్రభుత్వం ఏమీ స్పందించలేదు…
నిజానికి డీకే ఎవరినో ఉద్దేశించి, మర్మగర్భంగా ఈ వ్యాఖ్యలు చేశాడు… అందులో కేరళ ప్రభుత్వం గానీ, సీపీఎం పార్టీ గానీ ఉలిక్కిపడాల్సిన అవసరం లేదు… స్పందించాల్సిన పనీ లేదు… అనవసరంగా గోకే ప్రయత్నం చేస్తోంది… పైగా పైకి చూడబోతే రెండూ మిత్రపార్టీలు, ఒకే కూటమి సభ్యులు…
కేరళలో సీపీఎం వర్సెస్ కాంగ్రెస్ ఎప్పుడూ ఉన్నదే… ఏ చాన్స్ దొరికినా గోక్కుంటాయి… 39 మంది కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరారు, సాక్షాత్తూ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడే బీజేపీలో చేరే అవకాశాలున్నాయి… కేరళ కాంగ్రెస్ జస్ట్, బీజేపీ బీ టీమ్ మాత్రమే అని సీపీఎం విమర్శలకు దిగింది… మొత్తానికి జంతుబలులు, అఘోరా తాంత్రిక పూజలు వేరే రూట్‌లో ఫలిస్తున్నట్టున్నాయి చూడబోతే..!!
Share this Article