Kandukuri Ramesh Babu … దశాబ్ది ఉత్సవ విచారం : నిర్లిప్తం – రాష్ట్ర గేయం
నిన్నటి దశాబ్ది ఉత్సవాలు అమరుల కుటుంబాలకు స్పష్టమైన హామీ ఏమీ లేకుండా పూర్తి స్థాయిలో నిరాశా నిస్పృహలకు గురి చేసేలా సాగడమే కాదు, వింటుంటే రోమాలు నిక్కబొడుచుకునేలా ఉన్న అందెశ్రీ ఉద్యమ గీతాన్ని నిస్తేజంగా మార్చి అందించడం మరింత బాధించింది.
+++
Ads
బహుశా ముఖ్యమంత్రి అయ్యాక మొదటిసారి నిన్న ‘జై తెలంగాణ’ అని నినాదం చేసి మాట్లాడిన రేవంత్ రెడ్డి గారి ప్రసంగంలో ఇదే ఒక ప్రత్యేకతగా నిలిచింది తప్ప ఈ దశాబ్ది ఉత్సవాల్లో మరో ప్రత్యేకత ఏమీ లేదు.
పదేళ్ళ చారిత్రక సంబుర సందర్భంలో ‘ప్రత్యేకత’ లేకపోవడం ఒక పెద్ద లోటుకాగా ఏంతో నిరాశ పరచడం మరింత విచారకరం. నిరాశ పరచడమే కాదు, నూతన ప్రభుత్వ ‘ఉత్సవం’ తీవ్రంగా ఆందోళనకు గురి చేసింది. సాయంత్రం దాకా నోరు పెగలలేదు. ఇప్పటికీ బాధగా ఉంది. ఆ ఆవేదనతో రెండు మాటలు చెప్పక తప్పడంలేదు.
ముఖ్యమంత్రి గారు నిన్నటి ఉత్సవాలలో మాట్లాడుతుంటే అంత్యంత ఆసక్తిగా ఎదురు చూసిన ఉద్యమకారులకు నిరాశే మిగిలింది. వారిని, అలాగే అమరుల కుటుంబాలనూ పిలిచి అవమానించి నట్లయింది.
గన్ పార్క్ వద్ద యధావిధిగా నివాళి అర్పించడం కాకుండా వారు ఇక్కడకు వచ్చాక ఉద్యమకారుల భవితకు ఎటువంటి హామీ ఇవ్వలేదు. అంతకన్నా బాధాకరం అమరులకు నివాళి అర్పించలేదు. జోహార్లు చెప్పలేదు. వారి కుటుంబాలకు ఫలానా వ్యవధిలోగా మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చినవి అమలు చేస్తామనీ ప్రకటించలేదు. ఈ రెండూ గత ప్రభుత్వంలో గుర్తింపుకు నోచుకున్న దానికన్నా అధికంగా జరగాలని, జరుగుతుందని వెళ్లి భంగపడటం ఎంతో బాధకు గురి చేసింది.
ప్రత్యేకంగా పిలిచి మరీ వారి పట్ల బాధ్యతా రహితంగా వ్యవహరించడం పట్ల అమరుల కుటుంబాలు నిస్పృహకు గురై తిరుగు ముఖం పట్టారు. కనీసం లేచి నిలబడి ముఖ్యమంత్రి శ్రద్దాంజలి ఘటిస్తారేమో అని అనుకున్నది కూడా నెరవేరలేదు.
ఎందుకు మరి పిలిచినట్లు? ప్రేక్షకపాత్రలో కూర్చోబెట్టడానికి అమరుల కుటుంబాలే కావలసి వచ్చిందా అనిపించింది.
సోనియా గాంధి గారు వస్తారని కూడా అనుకున్నా వారు రాలేకపోయారు. కనీసం వారి వీడియో సందేశంలో కూడా అమరుల త్యాగాలకు ఎటువంటి భరోసా లభించలేదు.
ఇక అందెశ్రీ పాట. అది రాష్ట్ర గీతంగా ఉంటుందని, దాన్ని అధికార గీతంగా తమ ప్రభుత్వం ప్రకటిస్తున్నదని ఏంతో ఉత్తేజంగా రేవంత్ రెడ్డి గారు ప్రకటించి స్వహస్తాలతో ఆ గేయాన్ని ప్లే చేశారు. కానీ నిలబడి వింటున్నంతసేపూ అది మరింత నిరాశ పరిచింది. వారం పది రోజులుగా అట్టుడికిన ఈ ఉదంతం ఇక మరుగున పడుతుందని, నూతన రాష్ట్ర గీతం గొప్పగా వచ్చి ఉంటుందన్న ఆశ నిరాశే అయింది. ఈ ఉదంతం అంతా ఎలాఉందీ అంటే “operation was successful, but the patient died” అన్నట్టే అయింది.
నూతన గీతంలో ఆర్ద్రత లేదు, ప్రేమా లేదు. ఉద్వేగం లేదు, సంబురమూ లేదు, ఆత్మగౌరవాణ్ని తట్టిలేపే అంశ లేశమాత్రమైన లేదు. సప్పగా ఉంది. అందెశ్రీ అన్నను అక్కడ కలవడానికి కూడా మనసొప్పలేదు. మళ్ళీ ఇంటికి వచ్చి పాత గీతాన్ని వింటే గానీ తృప్తి కలగలేదు.
గాత్రం బాలేకపోవడమే కాదు, అనవసర సంగీతపు హోరు, సరిగ్గా పొసగని కోరస్. వీటివల్ల గతంలో రామకృష్ణ గారు గానం చేసిన గీతం ముందు ఇది పూర్తిగా తేలిపోయింది. అసలు పోలికే లేకుండా అయింది. ఇది ఒక రకంగా ఉద్యమ గీతం అంటే నమ్మలేం. నిర్లిప్తంగా సాగింది.
ముఖ్యమంత్రి గారు ఈ వేదిక మీద చెప్పవలసినవి చెప్పకుండా స్టేట్ సంక్షిప్త అక్షరాలు, టిజి పునరుద్దరణ గురించి మాట్లాడారు. నూతన చిహ్నం గురించి మాట్లాడారు. అది పోరాటాన్ని ప్రతిబింబించేలా ఉంటుందని ప్రకటించారు. తెలంగాణ తల్లి కష్టజీవిలా ఉంటుందని త్వరలో రూపు దిద్దుకుంటుందని కూడా ప్రకటించారు. ఇవి తప్పా ప్రజలకు ఉపయోగపడేవి ఏమీ నొక్కి చెప్పలేదు. సాంస్కృతిక పునరుజ్జీవనం, ఆర్ధిక పునరుజ్జీవనం గురించి మాట్లాడారు. రాష్ట్రాన్ని మూడు జోన్లుగా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు.
పదేళ్ళ కేసీఆర్ పరిపాలనను మొహమాట పడకుండా దించివేసిన ప్రజల చైతన్యం ఏమి కోరుకున్నదో ఆది ఈ దశాబ్ది ఉత్సవాల్లో రేవంత్ రెడ్డి వ్యక్తం చేయవలసి ఉండింది. ఎంతో ఉత్సాహంగా హామీ ఇవ్వవలసి ఉండింది. ఆ కర్తవ్యంలో ఆయన నిన్నటి కైతే విఫలమయ్యారు. అందివచ్చిన మంచి సదవకాశాన్ని చేజేతులా జారవిడుచుకున్నారనే అనిపించింది నాకైతే.
కానీ ప్రసంగం ప్రారంభంలో మాదిరే చివర్లో కూడా ముఖ్యమంత్రి గారు “జై తెలంగాణ… జై జై తెలంగాణ” అంటూ అందరికీ ధన్యవాదాలు చెప్పి వీడ్కోలు తీసుకున్నారు. నిజానికి రెండుసార్లు చేసిన ఆ నినాదం కన్నా ఉద్యమకారులకు, అమరులకు గౌరవాన్ని కల్పించే ఒక్క మాట మాట్లాడినా ఎంతో బాగుండు. పాట విషయానికి వస్తే, అది బాగారాలేదని చెప్పి, పాత గేయాన్నిప్లే చేసే సాహసం చేస్తే మరింత అద్భుతంగా ఉండేది. ఏమైనా ఈ దశాబ్ది ఉత్సవం విచారకరం… -కందుకూరి రమేష్ బాబు
Share this Article