పెద్దగా విశ్లేషణలేమీ అక్కర్లేదు… జగన్మోహన్‌రెడ్డి ప్రజలు తన నాయకత్వాన్ని ఆమోదించి, తనకు అందించిన అరుదైన అద్భుతమైన అవకాశాన్ని చేజేతులా దుర్వినియోగ పరచుకున్నాడు… ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో కనిపిస్తున్న ప్రజాతీర్పు ఒక్క ముక్కలో చెప్పాలంటే జగన్ వ్యతిరేక వోటు… ఎందుకంటే..?
చంద్రబాబు పాలనను చూసీ చూసీ ఉన్నారు ఆంధ్రా ప్రజలు… బాబు కొత్తేమీ కాదు, తన పాలన విధానాలేమిటో పూర్తిగా తెలుసు… గతంలో చంద్రబాబును తిరస్కరించినవాళ్లే ఆంధ్రాజనం… పవన్ కల్యాణ్‌ను గత ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించారు ఇదే తెలుగుజనం… అప్పటికీ ఇప్పటికీ తనలో కూడా ఏ మార్పూ లేదు, మారడు… ఇక బీజేపీ గురించి చెప్పాల్సిన పనిలేదు… ఉండీలేని పార్టీ అది… చివరకు ఈ కూటమికి ఉమ్మడి మేనిఫెస్టో కూడా చేతకాలేదు… చివరకు కొన్నిచోట్ల బీజేపీ, జనసేనకు కూడా తెలుగుదేశమే అభ్యర్థుల్ని సర్దుబాటు చేయాల్సి వచ్చింది… ఈ దురవస్థలోనూ…
ఐనా సరే… ఆ కూటమికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు… ఎవరెవరో బ్రహ్మాండమైన మెజారిటీలతో గెలుపొందారు… దేనికి..? నిజానికి ఇక్కడ ఆ కూటమికి బ్రహ్మరథం పట్టారు అనే వాక్యమే కరెక్టు కాదు… జగన్ దిగిపోవాలి, ఈ పాలన మాకొద్దు అనుకున్న ప్రజలకు వేరే దిక్కు కనిపించలేదు… మరీ హార్ష్‌గా అనిపించినా సరే… ఈ జగన్‌కన్నా ఆ పాత దయ్యమే తక్కువ ప్రమాదకారి అనుకున్నారు… వేరే ఆల్టర్నేటివ్ లేదు, ఫలితమే ఈ కూటమి గెలుపు… అంతేతప్ప వాళ్లను ప్రేమగా వోటరు ఏమీ అక్కున చేర్చుకోలేదు…
Ads
ఎస్, ఆంధ్రా ప్రజలు గుంభనంగా ఉంటారు తప్ప అటూఇటూ కాని తీర్పు ఏనాడూ చెప్పలేదు, చెప్పరు, హంగ్ అనేది తెలుగునాట లేనేలేదు… ఇటోఅటో తేల్చేస్తారు… కానీ ముందే చెప్పరు… కాకపోతే 2019, 2024 ఎన్నికల తీర్పులో విశేషం ఏమిటంటే పూర్తిగా వన్ సైడ్ ప్రజాతీర్పు వంగిపోవడం…
తనకు వచ్చిన అరుదైన అవకాశాన్ని కాస్త జాగ్రత్తగా వాడుకుంటే జగన్ పాలనకు, ఆదరణకు తిరుగులేకుండా ఉండేది… వందల మంది సలహాదారులు, వందల కార్పొరేషన్లు, పదవులు, పెత్తనాలను వదిలేయండి కాసేపు… ఇదుగో ఇదీ గత ఐదేళ్లలో నేను గర్వంగా చెప్పుకునేది అని చెప్పడానికి ఏముందని..?
కేసీయార్ ఓడిపోయినా సరే ఒక కాళేశ్వరాన్ని గర్వంగా చూపించగలడు… ఒక మోడీ అయోధ్య రామాలయాన్ని చూపించగలడు… జగన్ దగ్గర ఏముందని..? పోలవరం రీటెండరింగ్, కమ్మను పీకేసి, రెడ్డికి ఇచ్చాడు… ఏమైంది..? ఎక్కడేసిన గొంంగళి అక్కడే… చంద్రబాబుకు రాజధాని నిర్మాణం చేతకాదని జగన్‌ను ఎన్నుకుంటే అది పూర్తిగా పడుకుంది… మూడు రాజధానులు అనే తుగ్లక్ ఆలోచనకు ప్రజలు కర్రుకాల్చి వాతపెట్టారు…
రోడ్లకు కూడా డబ్బుల్లేవు.., మద్యం విధానంలో అవినీతి, అక్రమాలు… ఇసుక దందాలు… మండలి రద్దు అన్నాడు, యూటర్న్… తెలుగుదేశం మీద కులకక్ష, వేధింపులు… చివరకు ఎస్సీ, ఎస్టీల మీద కూడా ఎస్సీ, ఎస్టీ అత్యాచార కేసులు పెట్టించాడట… ప్రజలకు అందుబాటులో లేకపోవడం, చివరకు ఎమ్మెల్యేలు, ఎంపీలకూ దొరకకపోవడం, ప్రత్యేక హోదా డిమాండ్‌ను అటకమీద పారేయడం, కేవలం పంచుడు పథకాలే తనను గెలిపిస్తాయనే పిచ్చి భ్రమలో ఉండిపోవడం…
చంద్రబాబు అరెస్టు కూడా నెగెటివ్ రిజల్ట్… యెల్లో మీడియా కాలకూటం కూడా కొంత పనిచేసింది… షర్మిల శాపం పనిచేసింది, బాబాయ్ ఆత్మ కక్షతీర్చుకుంది వంటి అసంబద్ధ, అనవసర ప్రస్తావనల్లోకి కూడా ఇక్కడ పోవడం లేదు…
అంతేకాదు, ఐప్యాక్ తనను ఉద్దరిస్తుందని నమ్మడం, అభ్యర్థులను ఎడాపెడా మార్చేయడం… ఇలా చెబుతూ పోతే బోలెడు దొరుకుతాయి… అలాగని చంద్రబాబు ఏదో ఉద్దరిస్తాడనీ, తనేదో ఆదర్శ పాలన అందిస్తాడనే భ్రమలూ అక్కర్లేదు… దొందూ దొందే… బాబు తనూ అలవిమాలిన వాగ్దానాలు చేశాడు… జగన్ ఆల్రెడీ ఖజానాను దివాలా తీయించాడు… ఈ స్థితిలో తక్షణం చంద్రబాబు కూడా అబ్రకదబ్ర అని ఒకేసారి కలర్‌ఫుల్ సీన్లేమీ సృష్టించలేడు…
రకరకాల విశ్లేషణలు వస్తాయి… ఈ వేడి కొన్నాళ్లు… కానీ జగన్ మొండి, మహామొండి… తను అంత తేలికగా యుద్ధ రంగాన్ని వదిలేసే రకం కాదు… తనకు ఇంకా వయస్సుంది, దూకుడు తత్వముంది… సో, జాగ్రత్తగా ఉంటూ జగన్‌కు చాన్సు ఇవ్వకుండా చూసుకోవడమే చంద్రబాబుకు ఇకపై అసలైన పరీక్షాకాలం… నో, నో, కేంద్రంలో చక్రాలు తిప్పే చాన్సొచ్చింది అనుకుని ఢిల్లీకి గనుక పోవాలనుకుంటే… తన శిష్యుడు కేసీయార్ భంగపాటు తెలుసు కదా… సో, జెరపైలం సారూ..!!
ఏమో… అంతిమ ఫలితాలొచ్చేసరికి… జగన్ కు ప్రతిపక్ష హోదా కూడా రాకపోవచ్చు, గతంలో చంద్రబాబుకు వచ్చిన ఆ 23 కూడా జగన్‌కు రాకపోవచ్చు, ఏమో, గుర్రమెగిరి ఆ పవన్ కల్యాణ్ పార్టీయే రెండో స్థానంలో నిలవొచ్చు… ఆ లెక్కల జోలికి ఇక్కడ మనం పోవడం లేదు…!!
కానీ, గత అయిదేళ్ల వేధింపులకు ఇంతకింతా తీర్చుకుంటాను, అని వైసీపీ మీద చంద్రబాబు కక్షసాధింపులకు వెళ్తాడా..? నేనయితేే అలా జరుగుతుందని అనుకోను… ఎందుకంటే..? చంద్రబాబు తత్వం అది కాదు, తను జగన్ కాదు..!! అవునూ… ఐప్యాక్ టీంతో ఫోటోలు దిగి జగన్ ఏమన్నాడు..? ‘‘దేశం నివ్వెరపోయే స్థాయిలో రిజల్ట్ ఉంటుంది’’..!! సిక్కింలో ఒక చామ్లిన్… ఏపీలో ఒక జగన్…!! దేశం నిజంగానే నివ్వెరపోయింది సార్..!!
Share this Article