ఆరా మస్తాన్ మీద ట్రోల్ సాగుతోంది… పోరా మస్తాన్, ఏరా మస్తాన్ అంటూ వెక్కిరింపులు… తను జగన్ గెలుస్తాడని తన ఎగ్జిట్ పోల్ సర్వేలో చెప్పడమే కారణం… ఇండియాటుడే తరఫున ఎగ్జిట్ పోల్ చేసిన మైయాక్సిస్ ఇండియా బాధ్యుడు ప్రదీప్ గుప్తా లైవ్ టీవీ షోలోనే కన్నీళ్లు పెట్టుకున్నాడు…
తన ఎగ్జిట్ పోల్ ఎక్కడెక్కడ, ఎందుకు ఫెయిలైందో కారణాలు కొన్ని చెప్పుకునే ప్రయత్నం చేశాడు… రవిప్రకాష్ ఆర్టీవీ తెలుగుదేశం కూటమి ఘనవిజయం అని చెబితే, సేమ్ కులం కాబట్టి అలా చెబుతున్నాడు అని ట్రోల్ చేశారు… నిజానికి జాతీయ స్థాయి చాలా ఎగ్జిట్ పోల్స్ బోల్తా కొట్టాయి… మైయాక్సిస్ ఇండియా మాత్రమే కాదు…
జీన్యూస్ ఎగ్జిట్ పోల్ కాస్త ప్రొఫెషనల్‌గా నడిచినట్టుంది… సరిగ్గా ఫలితాలు అలాగే వచ్చాయి… మోడీ హవా, హైప్ నేపథ్యంలో దాన్ని ఎవరూ పరిగణనలోకి తీసుకోలేదు మొదట్లో..! ఎగ్జిట్ పోల్‌కు కొన్ని లెక్కలుంటాయి, ఏరియా, కులం, వృత్తి, లింగం, వయసు వంటివన్నీ మిక్స్‌డ్ శాంపిల్‌లో ఉండాలి… ఐనాసరే, వోటరు సరిగ్గా తను ఎవరికి వోటేశాడో చెబితేనే సరైన అంచనా దొరుకుతుంది…
Ads
సో, గణాంకాలు వోటరు మూడ్‌ను పట్టి ఇవ్వలేవు… గణాంకాల్లో మునిగితే వోటరు పల్స్ దొరకదు… వోటరు మూడ్ పట్టుకోవాలి… ఫీల్డ్‌లో అసమ్మతి, ప్రత్యర్థి ఎవరు, ఏ పార్టీ, గ్రూపులు వంటివన్నీ ప్రభావితం చేస్తాయి… ప్రశాంత్ పాలిట్రిక్స్ వాళ్లు బీఆర్ఎస్‌కు జీరో సీట్స్ అని ఎగ్జిట్ పోల్ ఇచ్చారు… కరెక్టు… ఎవరో కేకే సర్వే ఏపీలో ఈ కూటమి ప్రభంజనాన్ని సరిగ్గా అంచనా వేసింది…
ఒక మిత్రుడు… ఏపీలో చాన్నాళ్లుగా తన బిజినెస్ పని మీద విస్తృతంగా తిరుగుతున్నాడు… జనం మూడ్ తెలుసు… జగన్ ఏ 23కు చంద్రబాబును నెట్టేశాడో ఆ 23కు జగన్ పడిపోయినా ఆశ్చర్యపోవద్దు అన్నాడు నాతో… మరీ అంతగా జనం తిరస్కరించేంత దారుణంగా ఉందా పాలన అనడిగాను… ప్రజల మూడ్ అంతే, చంద్రబాబు పాలన కూడా అంత దుర్మార్గం ఏమీ కాదుకదా 2019లో, మరి తనను 23కు ఎందుకు పడేశారు అన్నాడు… ఏపీలోని వివిధ ప్రాంతాల మిత్రుల కాన్ఫిడెన్షియల్ సమాచారం కూడా అలాగే ఉంది… (కాకపోతే మరీ 11 సీట్లకు జగన్‌ను పడేసేంత వ్యతిరేకతను మాత్రం ఊహించలేదు)…
సాక్షి వాళ్లు 120, 130, 140 సీట్లు వస్తాయని జగన్‌కు రిపోర్ట్ ఇచ్చారనే రకరకాల వార్తలు వచ్చినప్పుడు కూడా ఒకరిద్దరు మిత్రులతో నాకున్న సమాచారం హింట్స్ ఇచ్చాను, నమ్మలేదు… అందరిలోనూ జగన్ బొటాబొటీ మెజారిటీతోనైనా బయటపడతాడు అనే భావనే ఉండేది… కానీ వోటరు నిర్దయుడు… మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కేసీయార్ గురించీ అలాగే అనుకున్నారు, స్వల్ప మెజారిటీతో గట్టెక్కి, మజ్లిస్ ఏడు వోట్ల మద్దతు తీసుకుంటాడు అన్నవాళ్లూ ఉన్నారు… రాబోయే ఫలితం తెలిసీ మౌనంగా ఉండాల్సి వచ్చింది… ఎందుకంటే, జగన్ మీద ఒక్క వ్యతిరేక వాక్యం కనిపించినా భీకరంగా, అరాచకంగా చెలరేగే సోషల్ మీడియా ఆయన సొంతం… (టీడీపీ సోషల్ మీడియా శుద్ధపూసలని కాదు…)
కడియం కావ్య… కడియం శ్రీహరి బిడ్డ… బీఆర్ఎస్ టికెట్టు ఇచ్చాక కూడా వద్దని, వాపస్ చేసి, వెంటనే కాంగ్రెస్‌లో చేరి, టికెట్టు తెచ్చుకున్నారు… అటు మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య సెక్షన్, శ్రీహరి మళ్లీ కాంగ్రెస్‌లోకి రావడం ఇష్టం లేని గ్రూపులు ఆమెకు నెగెటివ్‌గా పనిచేస్తారని, ఓటమి ఖాయమనే భావన ఉండేది… ఆమె ముస్లింను పెళ్లి చేసుకుంది కాబట్టి అసలే రిజర్వ్‌డ్ సీటులో ఆమె అభ్యర్థిత్వమే చెల్లదనే వాదనలు కూడా వచ్చాయి… సరే, అది లోతైన ప్రశ్న…
కొండల్‌రావు అనే సీనియర్ గ్రామీణ జర్నలిస్టు… ఓ మాటన్నాడు… అంకెలు వేరు, జనం మూడ్ వేరు… బాగా తిరిగి చెబుతున్నాను, ఆమె 2 లక్షల నుంచి 2.5 లక్షల మెజారిటితో గెలుస్తుంది అని… సరిగ్గా అదే జరిగింది… 2.2 లక్షల మెజారిటీ… అంకెలు ఎల్లప్పుడూ నిజాలే చెప్పాలని ఏమీ లేదు… ఇదంతా ఎందుకు చెప్పడం అంటే… ఎగ్జిట్ పోల్స్ ఫెయిలయ్యాయనే విశ్లేషణల నేపథ్యం…
ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన వోట్ల మార్పిడి సులభంగా జరగదని కొందరు విశ్లేషణలు వినిపించారు… తప్పు… అసలు జనసేన, బీజేపీల ప్రభావం కాదు… ఇదంతా జగన్ వ్యతిరేక వోటు… తను వద్దని జనం ఫిక్సయినప్పుడు ఇక ఎదురుగా కూటమి తరఫున ఏ మొహం కనిపించినా వోటర్లు వోట్లేశారు… అదీ జనం మూడ్… దీని ఎదుట ఏ లెక్కలూ, సమీకరణాలూ, టేబుళ్లు, కూడికలు, తీసివేతలు పనిచేయవు…
లెక్కల్లో 2 ప్లస్ 2 ఈక్వల్ టు 4… కానీ రాజకీయాల్లో సమీకరణాలు, లెక్కలు వేరు… 2 ప్లస్ 2… ఏదైనా నంబర్ కావచ్చు… అది సరిగ్గా పట్టుకున్నవాళ్లే సరైన సెఫాలజిస్టులు… ఈసారి యూపీలో పరిస్థితులు చాలా తేడాగా ఉన్నాయని యోగేంద్ర యాదవ్ చెప్పినట్టు గుర్తు… అదే జరిగింది… ఎప్పుడైతే ప్రధాని విచిత్రమైన వ్యాఖ్యలు చేయడం స్టార్ట్ చేశాడో అప్పుడే తెలివైన సెఫాలజిస్టులకు అర్థమైంది… ఫీల్డులో ఏదో తేడా కొడుతోందని…! కానీ గుడ్డిగా ‘మ్యాథ్స్’ను మాత్రమే నమ్మి ‘లెక్కతప్పారు’…!!
Share this Article