Murali Buddha…… మెచ్యూరిటీ అంటే ? ఒక పార్టీ ఓటమిని తట్టుకోలేక ఒక 28 ఏళ్ల యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు .. దీన్ని ఫేస్ బుక్ లో ఒకరు పోస్ట్ చేస్తే దానికి లాఫింగ్ ఎమోజీతో ఒకరి స్పందన ….
జగన్ సోదరికి ఆస్తిలో , అధికారంలో వాటా సరిగా దక్కలేదు అని అన్న ఓటమికి నడుం బిగించింది … తల్లి ఆమెకు మద్దతుగా నిలిచింది … ఎలాగైనా బాబును తిరిగి అధికారంలోకి తీసుకురావాలి అనుకున్న జ్యోతి మీడియా ఆమెకు ప్రచారం కల్పించింది . ఆస్తులు పంచుకున్న వారికి లేని బాధ నీకెందుకు ? జగన్ కు నీ పేరు కూడా తెలియదు .
2004 లో టీడీపీ ఓడిపోయినప్పుడు హిందూపురం టీడీపీ నేత ముస్లిం ఆత్మహత్య చేసుకున్నాడు … 2004 ఓటమి తరువాత ఇప్పటికి బాబు రెండు సార్లు అధికారం అనుభవించారు … ఆ ముస్లిం నేత కుటుంబానికి అతని లోటు తీరలేదు … ఎన్నటికీ తీరదు కదా ? బాబుకు అధికారం లేని లోటు తీరింది కానీ ఆత్మహత్య చేసుకున్న ఆ ముస్లిం నేత కుటుంబ లోటు ఎప్పుడూ తీరదు . కనీసం పేరు కూడా గుర్తుండదు … ( అతను mla గా పోటీ చేసి ఓడిపోయాడు, నాకు పేరు కూడా గుర్తుకు రావడం లేదు ..)
Ads
ఐదేళ్ల తరువాత జగన్ మళ్ళీ అధికారంలోకి రావచ్చు .. అప్పుడు నువ్వు ఉండవు .. నీ కుటుంబం రోడ్డు పాలు అవుతుంది ..
తెలంగాణ ఉద్యమం ఉదృతంగా సాగుతున్నప్పుడు ఆత్మహత్యలు – రేపు ఏర్పడబోయే తెలంగాణ చూసేందుకు నువ్వు ఉండాలి .. నువ్వు చనిపోతే తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించేవారు తెలంగాణ కోరుకునే ఒకరు పోయారు అని సంతోష పడతారు . పోరాడు ఆత్మహత్య వద్దు అని ఆంధ్రభూమిలో వ్యాసం రాస్తే సమైక్యాంధ్ర ఎడిటర్ రిజెక్ట్ చేశారు .. కొన్ని వందల ఆర్టికల్స్ ( దాదాపు మూడు నాలుగు వేలు ) రాస్తే భూమిలో జీవితంలో రిజెక్ట్ అయిన ఏకైక ఆర్టికల్ .
ఉద్యమకారులపైకి తుపాకీ తీసుకు వెళ్లిన వ్యక్తి రాష్ట్రాన్ని పాలిస్తున్నారు .. ఆత్మహత్య చేసుకొని కుటుంబానికి క్షోభను మిగిల్చారు కొందరు .. వారి క్షోభ ఎప్పటికీ తీరదు .
సమాజం ఇలానే ఉంటుంది .. నీ ఆత్మహత్యపై కూడా లాఫింగ్ ఎమోజీతో స్పందిస్తుంది . ఇలాంటి సమాజం గురించి ఎక్కువగా ఆలోచించడంకన్నా నువ్వే ప్రపంచం అని బతికే నీ కుటుంబం గురించి ఎక్కువగా ఆలోచించడమే మెచూరిటీ అంటే ..
బాబు రాజకీయ వారసత్వం , బాబు ఆస్తులు బాబు కుటుంబానికి దక్కుతాయి . జగన్ రాజకీయ వారసత్వం , జగన్ ఆస్తులు జగన్ కుటుంబానికి దక్కుతాయి . నీ ఆత్మహత్యతో జీవితకాల క్షోభ నీ కుటుంబానికి దక్కుతుంది …
ఎన్నికల ఫలితాలు రాగానే RGV బాబు, లోకేష్ లను అభినందిస్తూ ట్విట్ చేశాడు .. RGV ప్లేట్ ఫిరాయించాడు అని టుంరీ యూ ట్యూబ్ ఛానల్స్‌లో వార్తలు .. RGV ఎప్పుడూ ఎలా ఉంటాడో అలానే ఉన్నాడు .. ముంబయ్ లో మాఫియాకే భయపడని వాడు …
తనకు తానే ప్రపంచం … ఎవరికీ భయపడడు, ఎవరినీ ప్రేమించడు … తన జీవితానికి తానే ముఖ్యం .. మనం మరీ ఆ స్థాయికి వెళ్లలేక పోయినా .. మన కుటుంబం మనకు ముఖ్యం అనుకోవాలి …, బాబుపై సినిమా తీయమని అడిగితే తప్పక తీస్తాడు … తనకు తానే ముఖ్యం … సినిమా , రాజకీయం, భక్తి అన్నీ వ్యాపారమే … వ్యాపారం అన్నాక లాభం నష్టం సహజం … ఆత్మహత్యల దాకా దేనికి..? అదీ ఎవరి కోసమో…. — బుద్దా మురళి
Share this Article