చంద్ర శేఖర్ ఆజాద్ అలియాస్ రావణ్ సంక్షుభిత దళిత రాజకీయాలలో సునామీ… కేవలం ముప్పై ఆరేళ్ళ పోరగాడు… తనకు పాతికేళ్ళు ఉన్నప్పుడే దేశం తనని గుర్తించింది… ఒక నిజాయితీ , ఒక మన్నన, జీవితంలో నేర్చుకున్న నాలుగు అక్షరం ముక్కలు తన కడుపు నింపకున్నా, పక్కోడి పళ్ళెంలో మెతుకయి మెరిస్తే చాలు అనుకోని ఒక అడుగు వేసాడు.
తనకు అవ్వలు లేరు, అయ్యలు లేరు, రాజకీయ వారసత్వం లేదు… ఇది అన్యాయం అని తోస్తే స్పందించడం మినహా. రావణ్ తండ్రి గోవర్ధన్ దాస్ స్కూల్ ప్రిన్సిపాల్ . వృత్తి రీత్యా న్యాయవాది. ప్రవృత్తి రాజకీయం… తన మిత్రులతో కలిసి భీం ఆర్మీ పక్షాన తాను పుట్టి పెరిగిన ప్రాంతాలలో దళితుల కోసం ప్రత్యేక బడులు పెట్టారు… అందుకేనేమో రావణ్ పుట్టిన వూరిలో జాతీయ స్థాయి సగటుకన్నా ఎక్కువ అక్షరాస్యులు ఉన్నారు.
తాను మూడేళ్ళ కింద ఆజాద్ సమాజ్ వాదీ (కాన్షీరాం) పార్టీ పెట్టాడు అదొక సాహసం… ఎందుకో మాయావతి కంట్లో నలుసు.., మనువాదుల గుండెల్లో ఫిరంగిలా మారాడు. ఇంత చిన్న వయసులో ఉత్తర భారత రాజకీయాలను ఆకర్షించిన రావణ్ మనలాగా పిరికి సన్నాసి కాడు. వదులు కోడానికి రాజ్యం లేదు. రాజుల వారసత్వం లేదు. పోతే తుచ్ఛమైన ప్రాణం.
Ads
ఆయనకు నిర్మాణాలు తెలియవు, నిబద్దత, నిమగ్నత లాంటి సూత్రాలు తెలియవు. తన చైతన్యాన్ని ఏ కాలి కిందనో అమ్మకానికీ పెట్టలేదు. మూడేళ్ళ కింద ఒక పార్టీ పెట్టాడు . నియోజక వర్గంలో ప్రతి గడప తొక్కాడు. తానెవరో చెప్పాడు. ఉత్తర ప్రదేశ్ లో నాగిన పార్లమెంట్ నియోజక వర్గం నుండి BSP, BJP, సమాజ్ వాదీ పార్టీ లాంటి తిమింగలాలు పోటీలో ఉన్నా కూడా లక్ష యాభై వేల వోట్ల మెజారిటీతో రావణ్ గెలిచాడు …
ఇప్పుడు పార్లమెంట్లో చెప్పులు కుట్టిన ఆ చేతులు మరో చరిత్ర రచనకు సమాయత్తం. రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో తన పార్టీ నిలబడబోతోంది. తెలంగాణలో ఇంకో యాభై ఏళ్ళు అయినా ఇంకో రావణ్ పుడతాడా ? నాకైతే ఆశ లేదు. ఎందుకంటే పగలంతా ఒక పాట. రాత్రి మరోపాట పాడే కళల బేహారులే అడుగడుగునా ఉన్నచోట రావణ్ లాంటి నీతిమంతులు పుడతారు అంటే అత్యాశే.
మనం పనిచేయం, తీర్పులు ఇస్తాం . జిగ్నేష్ ద్రోహి అన్నారు. ఆనంద్ టెల్టుంబడేని విద్రోహి అన్నారు. మేమే నీతిమంతులం అన్నారు. రావణ్ మాయావతిని అత్తా నన్ను ఆశీర్వదించు అని అభ్యర్ధించాడు, ఆమె లెక్కచేయలేదు. జనాలలోకి పోయాడు గెలిచాడు. ఎందుకంటే అతనికి మనిషిని ప్రేమించడం తెలుసు.
MLA/ MP అవడం అంటే రెడీమేడ్ వేన్నీళ్ళలో మ్యాగీ కలపడం కాదు. బూస్ట్ కలపడమూ కాదు. మమతలు నేర్పడం. అది రావణ్ , కన్నయ్య , జిగ్నేష్ లకు తెలుసు… డియర్ Dr. ప్రవీణ్ కుమార్ IPS సర్, మీకూ, మిమ్మల్ని ‘జ్ఞాన యోధ’ అని రాసిన రచయితలకు ఒకటే సూచన… వీలుంటే రావణ్ దగ్గర ఈ ఐదేళ్ళు రాజకీయాలు నేర్చుకొండి ప్లీజ్…… (గుఱ్ఱం సీతారాములు)
Share this Article