ప్రపంచ అందగత్తె మార్లిన్ మన్రో… ప్రపంచ మేధావి ఆల్బర్ట్ ఐన్‌స్టీన్… ఓసారి కలుసుకున్నారట… ఆమె ఐన్‌స్టీన్‌తో మనిద్దరమూ పెళ్లి చేసుకుందామా..? నా అందం, మీ మేధస్సు కలిసిన పిల్లలు పుడితే ఎంతో వండర్ ఫుల్ కదా అనడిగిందట… తనొకసారి తేరిపార చూసి, నిజమేకానీ, ఒకవేళ నా అందం, నీ మేధస్సు కలిసిన పిల్లలు పుడితే ఎలా మరి అని బదులిచ్చాడట…
వాళ్లిద్దరూ నిజానికి ఎప్పుడూ కలవలేదు, ఇదొక జోక్… కానీ సినిమా తారలకు లుక్కు తప్ప బ్రెయిన్ తక్కువ అని చెప్పడానికి ఈ జోక్ వాడుతూ ఉంటారు చాలామంది… అఫ్‌కోర్స్, అందగత్తెలకు బుర్రలుండవనేది తప్పు, మేధావుల లుక్స్ బాగుండవని చెప్పడమూ తప్పే… కానీ రామానందసాగర్ తీసిన రామాయణంలో సీత పాత్ర చేసి, నిజంగానే ఓ సీతామాతగా జనం చేత మొక్కించుకున్న నటి ఆమె… అందగత్తే…
ఈమధ్య ఎక్కడో మాట్లాడుతూ ఈ ఇండియన్ మార్లిన్ మన్రో… ‘‘రామాయణాన్ని మళ్లీ మళ్లీ సినిమాగా తీయొద్దు, సమకాలీన పరిస్థితుల్లో కొత్తదనం పేరుతో ఆ మతగ్రంథం ప్రాశస్త్యం, పవితత్ర దెబ్బతీస్తున్నారు… ఆదిపురుష్ కూడా అంతే… సీతాదేవి పాత్ర గులాబీ రంగు చీరలో కనిపించడం ఏమిటి..? రావణాసురుడికి ఆ లుక్కు ఏమిటి..? క్రియేటివ్‌గా ఆలోచిస్తున్నామనే పేరుతో రామాయణం గొప్పతనాన్ని చెడగొడుతున్నారు… అందుకే భారతీయ ఇతిహాసాల జోలికి పోకుండా స్పూర్తిని నింపే స్వాతంత్ర్య సమరయోధులు ఇతరుల కథల్ని తీస్తే బెటర్…’’ అని చెప్పుకొచ్చింది…
Ads
అవునూ, సీత గులాబీ రంగు చీరె కడితే తప్పేమిటి..? కైకేయి తను నిర్దేశించిన అరణ్యవాసం షరతుల్లో ఫలానా రంగు చీరెలు, నార చీరెలు మాత్రమే ధరించాలని చెప్పిందా..? నిజానికి ఆ రామాయణకాలంలో స్వర్ణాభరణాలు, కిరీటాలు ఉండేవా..? ఏదో సినిమా లుక్కు కోసం దర్శకులు కొంత క్రియేటివ్ స్వేచ్ఛ తీసుకుంటారు… అదేమీ మనోభావాల్ని దెబ్బతీసే చర్య కాదు కదా… ఎస్, ఆదిపురుష్‌లో చాలా తప్పులున్నాయి, కానీ ఇంటెన్షనల్ కాదు, ఓవర్ స్మార్ట్‌నెస్…
రావణాసురుడి లుక్కు కూడా అంతే… దర్శకుడు ఏదో కొత్తగా చెప్పాలని ట్రై చేసి బొక్కబోర్లా పడ్డాడు… అలాగని ఇక సినిమాలే తీయవద్దంటే ఎలా..? తీయాలి, చూపించాలి, చెప్పాలి, వినిపించాలి… వేల కళారూపాల్లో, వేల రకాలుగా, వేల కోణాల్లో… ఎటొచ్చీ పూర్తిగా మూలకథను చెడగొట్టకుండా ఏం చేసినా సరే… అలా నిరంతరమూ అది జనంలో ఉంటేనే కదా, ఈరోజుకూ అది హిందువుల నిత్యపారాయణ గ్రంథంగా ఉంది…
ప్రస్తుతం సాయిపల్లవి సీతగా, యశ్ రావణుడిగా, రణబీర్ రాముడిగా రామాయణం నిర్మిస్తున్నారు… పెద్ద ప్రాజెక్టు… అందులో తప్పేముంది..? పైగా తవ్వి తీయడం మొదలుపెడితే దీపిక చిఖాలియా సీతగా నటించిన రామానందుడి టీవీ రామాయణంలోనూ బోలెడు తప్పిదాలు దొరుకుతాయి… కొన్ని వందల సినిమాలు రామాయణం చిత్రీకరించాయి… ఒకటీరెండు ఆదిపురుషులు తప్పుదోవన పోవచ్చుగానీ మిగతావన్నీ అలరించినవే కదా… సో, ఇక రామాయణాలు తీయొద్దు అనే దీపిక చిఖాలియా స్టేట్‌మెంట్ ఎందుకో గానీ మార్లిన్ మన్రో, ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ జోక్‌నే గుర్తుతెచ్చింది…!! ఈమెతో ఎవరైనా నిర్బంధంగా భైరప్ప రాసిన పర్వ గానీ, ఉత్తరకాండ గానీ చదివిస్తే మేలు..!!
Share this Article