ఒక ఫోటో… ఆశ్చర్యం వేసింది… బెంగుళూరు గూన కప్పిన ఓ పాత ఇల్లు… సిమెంటు పూతలతో మాసికలు వేసిన పాత గోడ… పక్కన ఓ జిల్లేడు చెట్టు… గోడపై విప్లవం వర్ధిల్లాలి అనే వాల్ రైటింగ్… సుత్తీకొడవలి గుర్తు… లంగావోణి, బుగ్గల జాకెట్ వేసుకున్న ఓ అమ్మాయి ఆ సుత్తీ కొడవలి గుర్తు చుట్టూ ఓ లవ్ సింబల్ గీస్తోంది… విప్లవాన్ని ప్రేమిస్తోందా..? విప్లవం కూడా ఓ ప్రేమ చర్యే అంటోందా..? ఆ కథలోకి తరువాత వెళ్దాం… కానీ ఇలాంటి ఫోటో ఒక తెలుగు సినిమాలో కనిపించడమా..? అది ఆశ్చర్యాన్ని కలిగించేది… అసలు తెలుగు సినిమా అంటేనే రియాలిటీకి వేయి మైళ్ల దూరంలో ఉంటుంది… పల్లెకు పది ఆమడల దూరంలో ఉండిపోతుంది… పైగా తెలంగాణ పల్లె అంటే తెలుగు సినిమాకు అస్పృశ్యం… అత్యంత సహజంగా కనిపిస్తున్న ఈ ఫోటో నిజంగా తెలుగు సినిమాలోనిదేనా అనేదే ఆశ్చర్యంతో కూడిన సందేహం… అన్నింటికీ మించి పిచ్చి ప్రేమకథలు, తిక్క ఫార్ములా కథలు, రొటీన్ ఫార్మాట్లు తప్ప ఇంకేమీ పట్టని ప్యూర్ కమర్షియల్ వ్యాపారులు సురేష్ ప్రొడక్షన్స్ ఈ సినిమాను సమర్పించడమా..? వావ్… ఏమిటో ఈ విపత్తు సంకేతాలు… పైగా ఇందులో దగ్గుబాటి వంశోద్ధారకుడు రానా ప్రధాన పాత్ర… అఫ్ కోర్స్, ఓ నక్సలైట్నూ ఓ సగటు తెలుగు సినిమా హీరోలాగా కమర్షియలైజ్ చేసి భ్రష్టుపట్టించే చాన్స్ లేదులే… దర్శకుడు వేణును మనం నమ్మొచ్చు… ఐనా ఈ తరానికి ఫేస్ బుక్ వాల్స్ తప్ప ఈ ఎర్రటి రాతల వాల్స్ ఏం తెలుసు..?
ఈ గోడ పోస్టర్ తెలంగాణలోని వేల మంది… నిజమే… వేల మందిని తమ వెనుకటి రోజుల్లోకి తీసుకుపోయాయి… భూస్వాములను తరిమేసిన రాతలు… మళ్లీ ఊళ్లకు రాకుండా చేసిన చేతలు… ఒక ఊళ్లో ‘విప్లవం వర్ధిల్లాలి’ అని కనిపిస్తే చాలు… బూర్జువా శక్తులు జంపు… ఊళ్లో ఉండటానికి జంకు… ఇప్పుడు యాభైలలో ఉన్నవాళ్లకు, దాటినవాళ్లకు ఈ రాతల తీవ్రత, ప్రభావం ఏమిటో బాగా తెలుసు… రాత్రిళ్లు దొంగతనంగా ఈ రాతలతో మొదలుపెట్టి, చిన్నాచితకా యాక్టివిటీస్… ఏవేవో కేసుల్లో ఇరికి, మెల్లిగా దళాల్లో అడుగుపెట్టి… ఒరిగిన వాళ్లెందరో… ఆ జ్ఞాపకాలు పదిలంగా మిగిలినవాళ్లెందరో… ఈ వాల్ రైటింగ్ గోడ ఫోటో చూడగానే తెలంగాణ పల్లెతో… ప్రత్యేకించి ఉత్తర తెలంగాణ ఊళ్లతో సంబంధమున్నవారికి పాతవన్నీ గుర్తొస్తయ్… అప్పట్లో ప్రతి ఊరూ ఓ భాస్వరం గుట్ట..!! ఇప్పుడంటే మళ్లీ ప్రతి పల్లెలోనూ శుష్క నాగరికతా భజనల వాసనలు గుప్పుగుప్పుమంటున్నయ్… ఇది వేరే కథ…
Ads
Revolution is an act of love…. దర్శకుడు ఊడుగుల వేణు తీస్తున్న విరాటపర్వం సినిమాకు కాన్సెప్ట్ ఇదే… దాన్నెలా వివరిస్తాడు, ఎలా సమర్థిస్తాడు, ఎలా కన్విన్స్ చేస్తాడో కాసేపు వదిలేద్దాం… తను థింకర్ కాబట్టి జస్టిఫై చేయగలడనే నమ్ముదాం… ఒక అమ్మాయి అమరుల స్థూపం దగ్గర కూర్చునే పోస్టర్… గోడ మీద విప్లవాల వాల్ రైటింగుల పోస్టర్… రానా, సాయిపల్లవి, నందితాదాస్, ప్రియమణి, నవీన్ చంద్, జరీనా వాహెబ్, ఈశ్వరీరావు, సాయిచంద్… ఏక్సేఏక్ ఎంపిక… ఏ పాత్రలకు ఎవరనేది వదిలేస్తే నందితాదాస్ వంటి నటిని ఓ తెలుగు సినిమాకు ఒప్పించడం విశేషమే… నయీం కిరాతకానికి, రాజ్యం క్రూరత్వానికి ప్రతీకగా ముక్కలుముక్కలుగా చెక్కబడిన ఒక బెల్లి లలిత పాత్రలో సాయిపల్లవి ఉంటుందా..? మిగతా పాత్రలు ఏమిటి..? అనేదీ వదిలేస్తే… వేణు ఈమధ్య రిలీజ్ చేసిన కోలుకోలోయమ్మ అనే పాట బాగా నిరాశపరిచింది… రాసింది చంద్రబోస్ అట… తను గతంలో మంచి పాటలు రాసేవాడంటారు… కానీ ఇందులో తెలంగాణతనం లేదు, తెలంగాణ మట్టి వాసన అసలే లేదు… ఒక చరణంలో పిల్లగాడు తరువాత చరణంలో కుర్రవాడు అయిపోతాడేమిటో… కాలి ధూళి బొట్టేమిటో, సిన్నదేమిటో, ఆ పదాలేమిటో… పండుగలకు, పబ్బాలకు టీవీలు, యూట్యూబ్ చానెళ్లు కృతకంగా వండి వార్చే పాటల తరహాలో… 22 లక్షల వ్యూస్ అని యూట్యూబ్ చూపిస్తోంది కానీ అంతగా ఘొప్పదనం ఏమీ కనిపించలేదు, వినిపించలేదు, కనెక్ట్ కాలేదు… అసలే విప్లవాన్ని, ప్రణయాన్ని కలిపి ఏదో కొత్త కథ చెబుతున్నావ్… ఈ అపశృతులు మోగనివ్వకు వేణూ…!!
Share this Article