ప్చ్… కొన్ని మరణాలు అంతే… జస్ట్, చదవగానే ఒకసారి కలుక్కుమనిపిస్తాయి… ఏదో తెలియని భావనతో నిట్టూరుస్తాం… నూర్ మాళవిక (మాలబిక) దాస్… 37 ఏళ్లు… అందగత్తె… చాన్నాళ్లుగా ఇండస్ట్రీలో ఉంది… ఏవో వేషాలు వస్తున్నాయి, చేస్తోంది… 2023లోనే ది ట్రయల్ అనే ఓ లీగల్ డ్రామాలో కాజోల్ సరసన కూడా నటించింది… హిందీ సినిమాలు, వెబ్ సీరీస్ చేస్తుంటుంది ఆమె… స్వరాష్ట్రం అస్సోం…
విషాదం ఏమిటంటే… ఓ కుళ్లిపోయిన స్థితిలో కనిపించింది… అనాథ శవంగా మారింది… ఐనవాళ్లు అంత్యక్రియలకూ నిరాకరించారు… చివరకు ఓ స్వచ్ఛంద సంస్థ సాయంతో పోలీసులే ఆమెను ఈ లోకం నుంచి ఓ అనాథ ప్రేతంగా పంపించేశారు…
ముంబైలోని లోఖండ్‌వాలాలోని ఓ ఫ్లాట్‌లో ఉంటోంది ఒంటరిగా… ఇంట్లో ఏం జరిగిందో ఏమో తెలియదు గానీ… నెల క్రితం వరకూ ఆమె తన కుటుంబంతోనే ఉండేదట… వారం, రెండు వారాల క్రితం ఆమె కుటుంబం స్వరాష్ట్రానికి వెళ్లిపోయింది… ఈమె ఈ ఫ్లాట్ అద్దెకు తీసుకుని ఇక్కడ ఉంటోంది… హఠాత్తుగా ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో ఈ ఫ్లాట్ పొరుగు ఫ్లాట్ల వాళ్లు పోలీసులకు రిపోర్ట్ చేశారు…
Ads
తీరా పోలీసులు వచ్చి బలవంతంగా తలుపులు తెరిచి నిశ్చేష్టపోయారు… దేహం కుళ్లిపోయిన స్థితిలో ఉంది… ఆమె ఫోన్, డైరీ, ఆమె వాడుతున్న మెడిసిన్స్ స్వాధీనం చేసుకుని, పోస్ట్ మార్టం చేయించి, కుటుంబసభ్యులను కంటాక్టయ్యారు… వాళ్లు పాజిటివ్‌గా స్పందించలేదు… రాలేదు, దేహాన్ని తీసుకోలేదు… దాంతో పోలిసులే అనాథప్రేతాలను పైలోకాలకు పంపించే ఒక స్వచ్ఛంద సంస్థ సాయం తీసుకున్నారు… పైకి పంపించేశారు…
ఆమె జీవితం అలా అనామకంగా ముగిసిపోయింది… మిడ్ డే పత్రిక కథనం మేరకు… ఆమె ఫ్యాన్‌కు ఉరేసుకుని మరణించింది… కానీ ప్లాట్ మెయిన్ డోర్ లోపల నుంచి గడియ వేసి ఉండటంతో వారం రోజులపాటు ఆ శవం అలా వేలాడుతూనే ఉంది… చివరకు దేహం కుళ్లి దుర్వాసన ప్రబలి, ఇరుగూపొరుగూ రిపోర్ట్ చేసి, పోలీసులు వచ్చేదాకా ఆ మరణం గురించే ఎవరికీ తెలియదు…
పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు… దర్యాప్తు చేస్తున్నారు… ఇవన్నీ రొటీన్… కానీ ఎందుకో… సినిమా సెలబ్రిటీల్లో కొందరి జీవితాలు మరీ సున్నితంగా మారిపోయి, చివరకు హఠాత్తుగా ఇదుగో ఇలా ఎవరికీ పట్టని శవాలుగా మారిపోతుంటారు… అసలే లైంగిక వేధింపులు, వివక్ష, అణిచివేతలను భరిస్తుంటారు, అన్నీ చంపుకుని, అన్నింటికీ తలూపుతుంటారు… ఐనా విధి వారిని ఎప్పుడూ చిన్నచూపు చూస్తూనే ఉంటుంది… చివరకు ఈ లోకం నుంచి వీడ్కోలు తీసుకునే దశ వరకూ..!!
(ఇలాంటివి చదివినప్పుడే ఓ పాట గుర్తొస్తూ ఉంటుంది… అందమైన లోకమనీ, రంగురంగులుంటాయనీ అందరూ అంటుంటారు రామరామా…)
Share this Article