‘‘అతనికి శ్మశానమే దేవాలయం : వారాంతంలో అక్కడే నివాసం : ముందే స్మారక చిహ్నం నిర్మాణం . అలా గుర్తుండి పోయిన జర్నలిజం తొలి నాళ్ళ వార్త… నాకు స్మశానమే దేవాలయం , మనిషి ఆలయానికి వెళ్ళవచ్చు , వెళ్లకపోవచ్చు కానీ అంతిమంగా శ్మశానానికి రావలసిందే అందుకే నాకు శ్మశానం అంటే ఇష్టం…’’
41 సంవత్సరాల క్రితం బి ఆర్ లక్ష్మయ్య చెప్పిన మాటలు ఇవి . అప్పుడు నేను పదవ తరగతి పరీక్షలకు సిద్ధం అవుతున్న విద్యార్థిని . అప్పుడు జర్నలిస్ట్ ను కాను కానీ బి ఆర్ లక్ష్మయ్య మాటలు , అయన చర్యలు అలా గుర్తుండి పోయాయి . సంఘటనలు తప్ప వ్యక్తుల పేర్లు పెద్దగా గుర్తు పెట్టుకోవడానికి ఆసక్తి ఉండదు . కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు బి ఆర్ లక్ష్మయ్య పేరు అలా గుర్తుండి పోయింది .
అంత్యక్రియలు జరిగే స్మృతి వనాన్ని ఈనాడు అధినేత రామోజీరావు ముందుగానే నిర్మించుకున్నారు అంటూ జర్నలిస్ట్ గ్రూప్ లో ప్రపంచంలో తొలిసారి ఇలా ముందుగానే స్మృతి వనాన్ని నిర్మించుకున్న ఏకైక వ్యక్తి రామోజీరావు అని పేర్కొన్నారు . చాలా మంది జర్నలిస్ట్ లు కవులు , రచయితలు ప్రపంచంలో ఇదే మొదటి సారి అని రాశారు .
Ads
ఇలా ముందుగానే నిర్మించుకున్న స్మృతి వనాన్ని నేను 1983లోనే చూశాను . అంతకు ముందే ఆ నిర్మాణం జరిగింది . ఇది కూడా పెద్ద విశేషం కాకపోవచ్చు . చాలా గ్రామాల్లో వృద్దులు తమ వ్యవసాయ పొలంలో ఇలా నిర్మించుకుంటారు . రూపాయలు బహుశా నేనెరిగిన ప్రపంచంలో బి ఆర్ లక్ష్మయ్య లాంటి ప్రత్యేక వ్యక్తిని మరొకరిని చూడలేదు .
స్మశానమే నాకు దేవాలయం అని చెప్పడమే కాదు ఆదివారం , ఇతర సెలవు దినాల్లో తాను స్మశానంలో నిర్మించిన భవనంలోనే విశ్రాంతి తీసుకునేవారు . జంటనగరాల్లోని పెద్ద స్మశాన వాటిక అయిన బన్సీలాల్ పేట స్మశాన వాటికలో ఎక్కడ చూసినా బి ఆర్ లక్ష్మయ్య నిర్మించిన నిర్మాణాలు కనిపిస్తాయి . సికింద్రాబాద్ మార్కెట్ ప్రాంతంలో ఆయనది బండల వ్యాపారం . ఇప్పటిలా ఆ రోజుల్లో టైల్స్ లేవు . బండల వ్యాపారం జోరుగా సాగేది . తన సంపాదన ఎక్కువగా ఈ స్మశాన వాటిక కోసం ఖర్చు చేసేవారు . 1970 ప్రాంతంలోనే ఒకేసారి స్మశాన వాటిక అభివృద్ధి పనులకు 80 వేల రూపాయలు ఇచ్చారుు . 1980 ప్రాంతంలో మా బంధువులు ఎకరానికి వెయ్యి రూపాయల్లా భువనగిరి గజ్వేల్ రోడ్ లో 60 ఎకరాలు కొన్నారు . 70లో ఐతే 80 వేలకు 200 ఎకరాలకు పైగా వచ్చేది .
*
1983లో నేను పదవ తరగతి పరీక్షలకు సిద్ధం అవుతున్నప్పుడు మా నాన్న మరణించారు . ఓ పది రోజుల పాటు రోజూ స్శ్మశాన వాటికకు రోజూ వెళ్ళాను . బి ఆర్ లక్ష్మయ్య అనే వ్యాపారి తన కోసం ముందుగానే అంత్యక్రియలు నిర్వహించే స్మృతి వనం నిర్మించుకున్నారు అని తెలిసి ఆసక్తి కలిగింది . ఎవరు ఎంత డబ్బు చెల్లిస్తామని ముందుకు వచ్చినా అయన అంగీకరించలేదు అని వినిపించింది . రెండేళ్లు గడిచాక 85-86లో ఒక వైపు చదువుకుంటూనే మరోవైపు ఉదయం పార్ట్ టైం విలేకరిగా చేరాను . అప్పుడు బి ఆర్ లక్ష్మయ్యను కలిసి చాలాసేపు మాట్లాడి ఉదయం సిటీ పేజీలో వార్త రాశాను . జర్నలిజంలోకి వచ్చిన తొలి నాళ్లలో నాకు బాగా నచ్చిన , అలా గుర్తుండి పోయిన వార్త బి ఆర్ లక్ష్మయ్య ముందే నిర్మించుకున్న స్మృతి వనం , స్మశాన వాటిక కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేయడం , ఆదివారం అక్కడే పడుకోవడం బాగా గుర్తుండి పోయింది .
ఉదయం కోసం రాయడానికి ఆయనను కలిసినప్పుడు చాలాసేపు మాట్లాడాను . ఫోటో తీయబోతుంటే ఆగమని చెప్పి పాతతరం వాళ్ళు ధరించే కోటు వేసుకొని ఫోటో దిగారు . స్శశాన వాటిక కార్యాలయంపైన ఉన్న విశాలమైన గదిలో పడుకునేవారు . భయం వేయదా? అని అడిగితే ఎందుకు ? అని ఎదురు ప్రశ్నించారు . తన భార్యా పిల్లలను కూడా ఆదివారం ఇక్కడికి రమ్మని మొదట్లో అడిగితే వారు రావడానికి నిరాకరించారని, తాను మాత్రం తప్పనిసరిగా వస్తాను అని చెప్పారు .
అంత్యక్రియలకు వచ్చే వారి ప్రవర్తన , కులాల వారిగా వారు వ్యవహరించే తీరు చెప్పినట్టు గుర్తు . చివరకు అయన తన కులం గురించి కూడా తాను విమర్శించినట్టు బాగా గుర్తుండి పోయింది . రాజులు మొదలుకొని నేటి సంపన్నుల వరకు ఆలయాల అభివృద్ధికి భారీగా విరాళాలు ఇచ్చిన వారు ఎంతో మంది ఉంటారు. కానీ తన సంపాదనలో చాలా మొత్తం స్మశాన వాటిక అభివృద్ధికి ఖర్చు చేయడమే కాకుండా దానిని దేవాలయంగా భావించి అక్కడే సెలవు రోజుల్లో సేదతీరేవారు కనిపించరు . శ్మశాన వాటిక స్థలాలను ఆక్రమించుకొని భారీ భవనాలు నిర్మించుకున్నవారు ఉంటారు కానీ ఇలా సేవ చేసేవారు కనిపించరు .
1983లో బి ఆర్ లక్ష్మయ్య స్మృతి వనాన్ని చూశాను . అంటే అంతకు ముందే ఆ నిర్మాణం జరిగింది . బి ఆర్ లక్ష్మయ్య 2003లో మరణించారు . ఆ స్మృతి వనంలోనే అంత్య క్రియలు నిర్వహించారు . ఇప్పటికీ ఆ స్మృతివనం బి ఆర్ లక్ష్మయ్యకే పరిమితం . మరెవరి అంత్యక్రియలు అక్కడ నిర్వహించరు .
ముందే తన కోసం స్మృతివనం నిర్మించుకున్న బి ఆర్ లక్ష్మయ్య గురించి , బన్సీలాల్ పేట స్మశాన వాటికలో అయన సేవల గురించి 1985లో ఉదయంలో రాశాను . చాలా రోజుల క్రితం సీనియర్ జర్నలిస్ట్ భండారు శ్రీనివాసరావు జి కృష్ణ గురించి రాస్తూ బన్సీలాల్ పేట శ్మశాన వాటిక నిర్వాహకులతో కృష్ణ పరిచయాలు , ఛలోక్తుల గురించి రాశారు . అది చదివాక 85లో నేను బి ఆర్ లక్ష్మయ్య గురించి ఉదయంలో రాసిన వార్త చూసి జి కృష్ణ వారితో పరిచయం చేసుకున్నారేమో అనిపించింది .
*
ప్రపంచంలో తొలిసారి రామోజీరావు ఇలా ముందుగానే స్మృతి వనాన్ని నిర్మించుకున్నారు అని జర్నలిస్ట్ లు , కవులు , రచయితలు సామాజిక మాధ్యమాల్లో రాయడంతో తన మరణానికి రెండున్నర దశాబ్దాల ముందే – నాలుగు దశాబ్దాల క్రితం ఇలా ముందే స్మృతి వనం నిర్మించుకున్న బి ఆర్ లక్ష్మయ్య గురించి , 85లో ఉదయంలో తొలి నాళ్లలో నేను రాసిన నాకు నచ్చిన వార్త ఇలా గుర్తుకు వచ్చింది .
భారతీయ సినిమా పితామహుడు అని దాదాసాహెబ్ పాల్కేను సంబోధిస్తారు . తొలి భారతీయ సినిమాను నిర్మించింది వారే కాబట్టి . రామోజీ రావును తెలుగు జర్నలిజం పితామహుడు అని కొందరు రాశారు . తెలుగులో తొలి పత్రిక 1832లో వచ్చింది . 1883లో సత్యదూత వచ్చింది … (ఫోటో :: బి ఆర్ లక్ష్మయ్య మరణానికి రెండు దశాబ్దాల ముందే నిర్మించుకున్న స్మృతి వనం ..)
Share this Article