ఒక కేసు… అదీ అమెరికాలో… అదీ ప్రెసిడెంట్ జో బైడెన్ కొడుకు మీద కేసు… ఆ మొత్తం వార్తలో బాగా ఆకర్షించిన వాక్యం… నిజానికి చాలా కదిలించిన వాక్యం… ‘కోర్టు తీర్పును నేను అంగీకరిస్తున్నాను, నా కొడుకు శిక్ష విషయంలో క్షమాభిక్ష కోరాలని కూడా అనుకోవడం లేదు…’
… ఈ మాట అన్నది సాక్షాత్తూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్… సరే, కేసు గురించి సంక్షిప్తంగా చెప్పాలంటే… గన్ లైసెన్స్ కోసం బైడెన్ కొడుకు అధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చాడు… కొన్నేళ్ల క్రితం… అలాగే డ్రగ్స్ కొనడం, అక్రమంగా ఆయుధాన్ని కలిగి ఉండటం, వాటిపై తప్పుడు సమాచారం ఇవ్వడం… అంతకుముందు ఏదో ఇష్యూలో పన్ను ఎగవేత… ఇవన్నీ ఆరోపణలు…
వీటిల్లో గన్ కొనుగోలుకు సంబంధించిన ఆరోపణల్ని కోర్టు అంగీకరించి, బైడెన్ కొడుకు హంటర్‌ను దోషిగా తేల్చింది… శిక్ష ఎన్నాళ్లు..? ఎప్పటి నుంచి?.. అనేది జడ్జి చెప్పలేదు… కానీ అమెరికా చట్టాల ప్రకారం ఈ కేసులకు 25 ఏళ్ల జైలుశిక్ష ఉంటుంది… కాకపోతే ఫస్ట్ నేరం కాబట్టి ఏమైనా సడలింపు, తగ్గుదల ఉంటుందేమో…
Ads
కోర్టు హంటర్‌ను దోషిగా తేల్చిన వెంటనే హంటర్, ఆయన భార్య, తల్లి (బైడెన్ భార్య) నిశ్శబ్దంగా అక్కడి నుంచి వెళ్లిపోయారు, మీడియాతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు… సాక్షాత్తూ అధ్యక్షుడి కొడుకు నేరం విషయంలోనూ కోర్టు స్వేచ్ఛగా, ఏ ఒత్తిళ్లూ లేకుండా ‘న్యాయం’ ప్రకటించింది… తండ్రి వినయంగా దాన్ని అంగీకరించాడు… దర్యాప్తు సంస్థలు, న్యాయస్థానాలు స్వేచ్ఛగా పనిచేసే వాతావరణం ఉంటే న్యాయం ఇలా కనిపిస్తుంది… అదీ చెప్పదలిచింది ఇక్కడ…
ఇదంతా చదవగానే చటుక్కున స్పురించింది… ప్రజ్వల్ రేవణ్న కేసు… తన మీద ఉన్నన్ని లైంగిక ఆరోపణలు బహుశా మరే వారసనాయకుడి మీదా ఉండి ఉండవు… డర్టీ ఫెలో… ఈ డర్టీ పోకడలు, పొలిటికల్ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్, వరదలా వచ్చి పడే డబ్బు, తద్వారా విలాసాలు… మరేమీ ఉండవు ఇలాంటి కొత్తతరం నాయకుల్లో… చట్టాల్ని గౌరవించడం, నైతికత, సబ్జెక్టు నాలెడ్జి, ప్రజాజీవితంలో అనుసరించాల్సిన విజ్ఞత, పరిణతి, హుందాతనం వంటి సిలబస్‌గా పొలిటికల్ స్కూళ్లు రావల్సిన అవసరం కనిపిస్తోంది… నామినేషన్ స్వీకరణ సందర్భంగా ఈ అంశాల్లో అభ్యర్థిని నిగ్గుదేల్చే మరో విధానమేదో రావల్సి ఉంది…
ఇదే ప్రజ్వల్ రేవణ్న మీద కేసు పెట్టగానే… ఇంకా తీర్పుల దాకా కూడా రాలేదు… ఆ తండ్రి వెనకేసుకొచ్చాడు… తీరాచూస్తే కొడుకు దస్ నంబరీ, తండ్రి ఏక్ నంబరీ అట… దేశం మొత్తమ్మీద చూడండి, చిన్న నుంచి పెద్ద నాయకుల దాకా వారసులు డబ్బు, అధికారమదంతో వచ్చిపడే సర్వ దుర్లక్షణాలతో అచ్చోసిన ఆంబోతుల్లా (వాటికి సారీ) వ్యవహరించడం, తండ్రులు వెనకేసుకురావడం, పోలీసులను మేనేజ్ చేయడం, కోర్టుల్లో కొట్లాడటం… ఇదుగో ఇన్ని ఆలోచనల నడుమ హంటర్ తీర్పు, ఫాలోఅప్ వార్తలు ఆసక్తికరం అనిపించాయి…
ఒక్కసారి మన నేరం-న్యాయం వ్యవస్థల్ని అలా అలా పైపైన పరికించండి… మనం ఎక్కడున్నామో అర్థమవుతుంది… అఫ్‌కోర్స్, మన న్యాయస్థానాలూ నిర్భయంగా, నిష్పక్షపాతంగా, నిర్మొహమాటంగా ఇచ్చిన తీర్పులు అనేకం… అంతెందుకు, ఇందిరాగాంధీ ఎన్నిక మీదే తీర్పు వచ్చిందిగా, ఆ తరువాతే కదా దేశం ఎమర్జెన్సీని ఫేస్ చేయాల్సి వచ్చింది…
సరే, హంటర్ కేసుకు సంబంధించి ఓ పారడాక్స్ వార్త కనిపించింది… జో బైడెన్ మంగళవారం సాయంత్రం ఎవరీటౌన్ గన్ సెన్స్ యూనివర్శిటీలో గన్ వయోలెన్స్ బాధితులు, సర్వైవర్లను కలిసి మాట్లాడతాడు అనేది వార్త… గత వారం వాషింగ్టన్ హిల్టన్ కాల్పుల ఘటన తెలిసిందే కదా… ఒకవైపు కొడుకు గన్ కొనుగోలు కేసులో దోషిగా తేలిన గంటల్లోనే తను ఈ అక్రమ గన్ కొనుగోళ్లు, గన్ కల్చర్ మీద అధ్యక్షుడు మాట్లాడబోతున్నాడు..!! తను తీసుకొచ్చిన కొత్త గన్ చట్టం వల్ల దాదాపు 500 మంది బుక్కయ్యారని చెప్పబోతున్నాడట..!!
Share this Article