తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు మరో ప్రమాణస్వీకారానికి (4.0 అట) ఆహ్వానించలేదు… ఎందుకు..? బీజేపీ అతిరథ మహారథుల్ని పిలిచారు… సరే, ఎన్డీయే ప్రభుత్వం కాబట్టి, కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ సంయుక్త ప్రభుత్వాలే కాబట్టి… బీజేపీ ముఖ్యుల్ని పిలిచారు, వాళ్లు వస్తారు… సమంజసమే, మర్యాదే…
మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రులను కూడా పిలిచారట… అవీ ఎన్డీయే ప్రభుత్వాలే కాబట్టి పెద్ద విశేషమేమీ లేదు… కానీ ఇరుగు, పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని ఎందుకు పిలవలేదు… అంటే, తమిళనాడు, తెలంగాణ, ఒడిశా… సరే, ఒడిశాలో ఇంకా కొత్త ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం జరగలేదు… స్టాలిన్..? పాపం, చంద్రబాబును మనస్పూర్తిగా అభినందించాడు… ఏపీకి పొరుగు రాష్ట్రం, పైగా ఏపీకి మాతృరాష్ట్రం… సరే, దాన్నలా వదిలేస్తే…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఎందుకు పిలవలేదు..? తనను ఇండికూటమి కోణంలో చూశాడా చంద్రబాబు..? అందుకే పిలవలేదా..? స్టాలిన్‌ను కూడా అలాగే పరిగణించారా..? అయితే తప్పు… పిలవాల్సిన మర్యాద చంద్రబాబుది, వస్తారా లేదానేది వాళ్లిష్టం… ఇక్కడ చంద్రబాబు మర్యాద తప్పాడు… అవును, మోడీ ప్రమాణస్వీకారానికి మల్లిఖార్జున ఖర్గే కూడా హాజరయ్యాడు… అదీ రాజకీయ హుందాతనం, గౌరవం, మర్యాద…
Ads
ఏమో, అసలే రేవంత్ రెడ్డిని ఇప్పటికీ చంద్రబాబు మనిషిగానే పరిగణిస్తున్నారు, తనను ప్రమాణస్వీకారానికి పిలిస్తే మరిన్ని ప్రచారాలు పెరుగుతాయని భావించాడా చంద్రబాబు..? సో వాట్… రేవంత్ రెడ్డిని ఎంకరేజ్ చేసి, ఓ పొజిషన్‌కు తీసుకొచ్చింది ఖచ్చితంగా చంద్రబాబే… పైగా వోటుకునోటు కేసులో చంద్రబాబు ప్రణాళికకు రేవంత్‌రెడ్డి నిందితుడు కమ్ బాధితుడు…
అన్నింటికీ మించి రేవంత్ రెడ్డిని తెలంగాణ సీఎంగా చూడాలి తప్ప, ఇలాంటి సందర్భాల్లో వేరే కోణాల్లో చూడకూడదు… ఎందుకంటే..? ఇతర ఇరుగు పొరుగు రాష్ట్రాలు వేరు, తెలంగాణతో ఏపీ బంధాలు, సమస్యలు వేరు… తెలంగాణ నుంచి ఏపీ పదేళ్ల క్రితమే విడివడింది… మొన్నమొన్ననే ఉమ్మడి రాజధాని అనే బంధమూ తెగిపోయింది… కానీ తెగాల్సిన బోలెడు చిక్కులు అలాగే ఉండిపోయాయి…
అన్నింటికీ మించి ఏపీ, తెలంగాణ నడుమ ఎన్నటికీ తెగిపోని బంధాలుగా లక్షల మంది ప్రవాసాంధ్రులున్నారు తెలంగాణలో… మొన్న ఎక్కడో చెప్పాడట చంద్రబాబు… ముందు మండలాల సమస్య తీర్చకపోతే సీఎంగా ప్రమాణస్వీకారం చేయబోనని బెదిరించాను, అందుకే మోడీ అర్జెంటుగా 2014లో పోలవరం ముంపు మండలాల్ని తెలంగాణ నుంచి ఏపీకి బదలాయించారు అని..!
పాత బకాయిలు, నదీజలాల వాటాలు, వివాదాస్పద ప్రాజెక్టుల దగ్గర నుంచి అనేక సమస్యలు వస్తూనే ఉంటాయి,.. కేసీయార్, జగన్ నడుమ ఏ సంబంధాలో గానీ ఇద్దరూ పరస్పరం సుహృద్భావంతో సహకరించుకునేవారు… అలాగని తమ రాష్ట్రాల ప్రయోజనాల్ని ఏమీ పణంగా పెట్టలేదు… మరి చంద్రబాబు, రేవంత్ రెడ్డి నడుమ ఆ పరస్పర సహకార ధోరణి, సుహృద్భావ ధోరణి ఎందుకు ఉండకూడదు..?
ఏపీ ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారానికి తెలంగాణ ముఖ్యమంత్రిని పిలవాలి, అంతే… ఇక్కడ వాళ్ల పార్టీలు, ఆ ఇద్దరి నడుమ వ్యక్తిగత సంబంధాలు వంటివి పరిగణనలోకి రాకూడదు… ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు అంటే ప్రత్యర్థులు కాదు, శత్రువులూ కాదు… ఎవరి రాష్ట్రం వాళ్లది… సమస్థాయి… రెండు అధికార వ్యవస్థల అధినేతల నడుమ ఈ పరస్పర మర్యాదలు, గౌరవాలు కనిపించకపోవడం మంచిది కాదు… అది చంద్రబాబుకే శోభనివ్వదు..!! (చిత్ర సౌజన్యం :: మృత్యుంజయ్)
Share this Article