ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చెప్పింది ఇదే… ఎన్నికల్లో పోటీ అంటే యుద్ధం కాదు, ప్రతిపక్షాలు అంటే ప్రత్యర్థులే గానీ శత్రువులు కాదు, ప్రజాసేవకుడు అంటే అహంభావం లేకుండా ఓ హుందాతనం కనబరచాలి… రాజకీయ మర్యాదల్ని పాటించాలి…
రేవంత్ రెడ్డిని తన ప్రమాణ స్వీకారానికి పిలవని చంద్రబాబులో అది కనిపించలేదు… ఈ మాటంటే కొందరికి నచ్చలేదు… మోడీ ప్రమాణ స్వీకారానికి మల్లిఖార్జున ఖర్గే వెళ్లాడు… గతంలో రాజస్థాన్‌లో అశోక్ గెహ్లాట్ ప్రమాణ స్వీకారానికి వసుంధర రాజే వెళ్లింది… తాజా ఉదాహరణ ఏమిటంటే..? ఒడిశా మాజీ సీఎం కొత్తగా సీఎం మోహన్ చరణ్ మాజి ప్రమాణ స్వీకారానికి వెళ్లాడు… అదీ హుందాతనం, అదీ మర్యాద…
https://www.facebook.com/reel/3225583000907068
Ads
వేదిక మీద తనకు తారసపడిన నడ్డా, అమిత్ షా, యోగి, గడ్కరీ తదితరులతో కాసేపు కలిసిపోయాడు… మోహన్ చరణ్ మాజిని ఆశీర్వదించాడు… అంతకుముందు మాజి నవీన్ పట్నాయక్ వద్దకు వెళ్లి స్వయంగా ఆహ్వానించాడు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరై తనను ఆశీర్వదించాలని కోరాడు… ఇదీ ఆ ఫోటో…
ఈయన వెళ్లి రమ్మనడం బాగుంది, ఆయన రావడమూ బాగుంది… (నిజానికి ముందు అనుకున్నట్టు చర్చలు ఫలించి ఉంటే, బీజేపీతో పొత్తు కుదిరి ఉంటే నవీన్ పట్నాయకే మళ్లీ సీఎం అయ్యేవాడు… సరే, అది వేరే కథ…) ఇక్కడ కొత్త సీఎం మోహన్ చరణ్ మాజీ గురించి కూడా ఓసారి చెప్పుకోవాలి…
వసుంధర, రమణ్ సింగ్, శివరాజ్ సింగ్ తదితరులను పక్కనబెట్టిన బీజేపీ హైకమాండ్ కొత్త వాళ్లకు ముఖ్యమంత్రులుగా చాన్స్ ఇస్తున్న సంగత తెలుసు కదా… అదే కోవలో గిరిజన నాయకుడు మోహన్ చరణ్‌ను ప్రమోట్ చేసింది… ఏకంగా సీఎం పోస్టులోకి… తను గిరిజన తెగల్లో చాలా బలమైన సంతాలి తెగకు చెందినవాడు… రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా అదే తెగ…
ఒడిశాలో ఎస్సీ, ఎస్టీల్లోకి మరింత బలంగా చొచ్చుకుపోవడానికి ఒక గిరిజననేతను సీఎంగా చేయాలనేది బీజేపీ ప్లాన్ కావచ్చు… తన ప్రస్థానం తెలుసా..? ఈయన తండ్రి సెక్యూరిటీ గార్డుగా పనిచేసేవాడు… ఈయన లా గ్రాడ్యుయేట్… కొన్నాళ్లు సరస్వతీ శిశుమందిర్ టీచర్‌గా పనిచేశాడు…
1997లో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాక మొదట తన గ్రామానికి సర్పంచి… తరువాత బీజేపీ గిరిజన విభాగం కార్యదర్శి… 2000, 2004 ఎన్నికల్లో గెలిచినా 2009, 2014లో ఓడిపోయాడు, తరువాత 2019లో, ఇప్పుడు గెలిచాడు… ఈసారి ఏకంగా ముఖ్యమంత్రే అయ్యాడు… ఈ 52 ఏళ్ల లాయర్ ముఖ్యమంత్రి అవుతాడని కలలో కూడా అనుకోలేదు అని సంబరపడుతోంది ఆయన భార్య ప్రియాంక మరిండి…!!
Share this Article