ఆఫ్టరాల్ అమెరికా క్రికెట్ జట్టు లెవలేంది..? అరి వీర భయంకరులమైన మన జట్టు రేంజ్ ఏమిటి అనుకున్నారా…? తప్పు… తప్పు అనే నిన్న అమెరికా జట్టు ప్రదర్శన చెప్పింది… ఐనా అందులో చాలామంది మనవాళ్లే కదా అంటారా..? అఫ్‌కోర్స్, ఎక్కువగా మనవాళ్లే… జట్టు కెప్టెన్ మోనాంక్ పటేల్ కూడా ఇండియనే… గుజరాతీ…
క్రికెట్ పుట్టిల్లు బ్రిటన్… అక్కడే గాకుండా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తదితర శ్వేత దేశాల్లో క్రికెట్‌కు మంచి ఆదరణ ఉన్నా సరే… ఎందుకోగానీ రష్యా, చైనా, అమెరికా, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, యూరప్ దేశాల్లో క్రికెట్‌కు ఆదరణ లేదు… పట్టించుకోరు… ఎంతసేపూ క్రికెట్ ఇండియా, శ్రీలంక, పాకిస్థాన్, బంగ్లాదేశ్, కొంతకాలంగా అఫ్ఘనిస్థాన్ వంటి మన ఇరుగూపొరుగు దేశాల్లోనే బలంగా వ్యాపించింది…
అమెరికాకు మనవాళ్లు కొన్నేళ్లుగా విపరీతంగా వలసపోయారు, మన రక్తంలో క్రికెట్ ఉంది కదా… పైగా క్రికెట్‌లో డబ్బుంది, పాపులారిటీ ఉంది… సో, మెల్లమెల్లగా అమెరికా కూడా క్రికెట్ మీద ఆసక్తిని పెంచుకుంది… టీ20 పోటీలకు వేదికగా కూడా మారింది… హోస్టులే తప్ప వాళ్లకంతగా పోటీపడే సరుకు ఎక్కడుంది అనుకున్న వాళ్లు తప్పులో కాలేశారు…
Ads
మరీ నిన్నటి మ్యాచులో సౌరభ్ నేత్రవల్కర్ అనే బౌలర్ ఏకంగా కోహ్లి, రోహిత్ వికెట్లను తీయడంతో అందరూ సైలెంట్… 111 పరుగులే చేసినా, దాన్ని ఇండియా అంత సులువుగా ఏమీ చేధించలేదు… కొంచెం కష్టపడాల్సి వచ్చింది… అవునూ, ఇంతకీ ఎవరు ఈ నేత్రవల్కర్… అమెరికన్ పౌరుడు కాదు, ఈరోజుకూ మన ఇండియానే… హెచ్1బీ వీసా మీద ఒరకిల్‌లో పీఎంటీఎస్‌గా (ప్రిన్సిపల్ మెంబర్ ఆఫ్ టెక్నికల్ స్టాఫ్) హోదాలో పనిచేస్తున్నాడు…
అంతేకాదు, పుట్టింది ముంబై… అండర్ 19 ఇండియా జట్టుకు కూడా ఆడాడు… ముంబై రంజీ, విజయ్ హజారే ట్రోఫీలకూ ఆడాడు… ఎయిర్ ఇండియా స్పాన్సర్ చేయడంతో బెంగుళూరు నేషనల్ క్రికెట్ అకాడమీలో శిక్షణ కూడా పొందాడు… యువరాజ్‌సింగ్ వంటి ప్లేయర్లనూ తరచూ ఔట్ చేసేవాడు… ఐసీసీ కార్పొరేట్ టోర్నీలో యూవీ, రాబిన్ ఉతప్ప, సురేష్ రైనా వంటి ప్లేయర్లతో కలిసి ఆడాడు…
కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, జయదేవ్ ఉనద్కత్ తదితరులు ఇండియా అండర్ 19 జట్టులో సహ క్రికెటర్లు… కానీ క్రికెట్ కెరీర్ అస్థిరం… పైగా సౌరభ్ ఆడుతున్నప్పుడు బలమైన ఇతర బౌలర్లు ఉండటంతో నేత్రవల్కర్‌కు అవకాశాలు రాలేదు… తను చదువులో కూడా దిట్ట… అమెరికా వెళ్లిపోయాడు, కార్నెల్ యూనివర్శిటీలో మాస్టర్స్ చేశాడు, వెంటనే ఒరకిల్‌లో కొలువు దొరికింది…
టెకీ పైగా క్రికెట్ ప్రేమికుడు… ఆసక్తి ఎక్కడ పోతుంది..? CricDecode అనే ప్లేయర్ అనాలిసిస్ యాప్ కూడా రూపొందించాడు… ప్రస్తుతం 32 ఏళ్లు… ఇంకొన్నాళ్లు ఆడగలడు… అమెరికా జట్టు క్రికెట్ ప్రపంచంలో ఎదగడానికి దోహదపడగలడు… ఆల్ ది బెస్ట్ సౌరభ్ నరేష్ నేత్రవల్కర్…! నువ్వు అమెరికాలో ఉన్న మన వేలాది మంది ఇండియన్ టెకీలకు అసలైన ప్రతిరూపానివి..!! (John Kora ఇన్‌పుట్స్)
Share this Article