ఇండియన్ సినిమా డెవలప్ కాలేదని ఎవరన్నారు..? బాగా ఎదిగింది… ఏవో చిన్న చిన్న తుపాకులు, కత్తులతో నడిచే హింస, యాక్షన్ సీన్స్, విధ్వంసం, హీరోయిజం ఇప్పుడు కాస్తా మెషిన్ గన్స్ దాకా ఎప్పుడో పెరిగిపోయింది… ఆమధ్య ఏదో రవితేజ సినిమా… రకరకాల తుపాకులు, సినిమా మొత్తం కాల్పులే… అదేదో అమ్మవారి విగ్రహం చేతులు, వేళ్లలో కూడా మెషిన్ గన్నులే…
అసలు పుష్ప, కేజీఎఫ్ వంటి సినిమాలు యాక్షన్ సీన్లను ఓ కొత్త పంథాలోకి, ఓ కొత్త రేంజులోకి తీసుకుపోయాయి… అందరూ ఇప్పుడు బోయపాటిని మించిన ఘనాపాటీలే కదా… కొత్తగా మహేశ్ బాబు బావ సుధీర్ బాబు సినిమా ఒకటి వచ్చింది… మహేశ్ బాబు బావ అని ఎందుకున్నానంటే… ఇది సుధీర్ బాబు సినిమా అనే రేంజులో తనది ఒక్క సినిమా కూడా రాలేదు కాబట్టి… అప్పట్లో సమ్మోహనం కాస్త బాగుంది…
మరీ గత నాలుగు సినిమాలైతే డిజాస్టర్లు… ఇక ఈ ఏవేవో వేషాలు చాలించి, ఇక ఊరమాస్ వేషం ఒకటి వేద్దాం, అటోఇటో తేలిపోవాలి అన్నట్టుగా ఉంది ఈ కొత్త సినిమా హరోంహర… ఫుల్ యాక్షన్ సీన్లతో పరుగు తీయించాడు డైరెక్టర్… ఆయుధాల గురించి ముందే ఎందుకు చెప్పానూ అంటే… ఇందులో కూడా తెలుగు సినిమా ఆయుధప్రస్థానంలాగే చిన్న చిన్న తపంచాల నుంచి మొదలుపెట్టి ఏకంగా రాకెట్ లాంచర్ల దాకా వెళ్లిపోతాడు…
Ads
సరే, కొత్త కొత్త ఇన్నోవేషన్లతో అక్రమంగా ఆయుధాలు తయారు చేసే ఓ కేరక్టర్… ఊరికి జంట వైరసుల్లాగా పరిణమించిన ఇద్దరి పీడ వదిలించి ఎలా మంచి చేశాడనేది కథ… ఎలాగూ మనం స్పాయిలర్ అంటూ కథ జోలికి వెళ్లం కదా… సినిమాలో హీరోయిన్ మాళవిక శర్మ కాస్త మైనసే… తెలుగు సినిమా అన్నాక హీరోయిన్ ఉండాలి కాబట్టి ఆ పాత్రను పెట్టారు… సునీల్ ఫుల్ లెంత్ రోల్, బాగుంది…
సుధీర్ బాబు ప్లస్ పాయింటేమిటంటే తను ఇచ్చిన/వచ్చిన పాత్రకు న్యాయం చేయడానికి కష్టపడతాడు… కానీ ఎందుకోగానీ ఈ ఊరమాస్ వేషం, ఈ యాక్షన్ తనకు నప్పలేదు అనిపించింది… పైగా పుష్ప సినిమా ఇన్‌స్పిరేషన్ అంటే వోకే గానీ, మరీ ఆ హీరోను అనుకరించినట్టు కనిపిస్తుంది అక్కడక్కడా… పైగా ఆ కుప్పం యాస కూడా అతికినట్టు లేదు, కాస్త కృతకమే అనిపించింది… బట్ స్థూలంగా సుధీర్ బాబు శ్రమను తప్పుపట్టలేం… ఇది తన పాత ధోరణులకు భిన్నమైన సరికొత్త లుక్కు…
అన్నింటికీ మించి ఏరకమైన ఉద్వేగాల ప్రదర్శన లేకుండా కేవలం ఫైట్లు, యాక్షన్ సీన్లతో తెలుగు సినిమా నడవడం కష్టం… ఈ సినిమాలో ఆ లోపం కనిపిస్తోంది… అవునూ… ఇప్పుడు రాకెట్ లాంచర్లు, అత్యాధునిక తుపాకుల దాకా వచ్చాం కదా… ఇంకా రాబోయే సినిమాల్లో ఇంకో రేంజుకు తీసుకుపోవాలంటే ఏ ఆయుధాలు కావాలి… సింపుల్ సమాధానం… మిసైళ్లు…! మినీ అణ్వస్త్రాలు..!! ఏదో ప్రమోషన్ ప్రెస్‌మీట్‌లో సుధీరే చెప్పినట్టు గుర్తు… మహేశ్ బాబు సినిమా ఫుల్ బాటిల్ అయితే, అదొచ్చేవరకు ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చే నా ఈ సినిమా ఓ పెగ్గు అని… నిజమే, జస్ట్ ఏ స్మాల్ పెగ్ ఓన్లీ..!!
Share this Article