టీజరో, ట్రెయిలరో… అది చూస్తుంటే హాశ్చర్యం… సింపుల్‌గా అర్థమైంది ఏమిటీ అంటే… మంచు విష్ణు బాహుబలి, మగధీర తరహాలో ఓ పాన్ ఇండియా సినిమా తీస్తున్నాడు… భారీగా ఖర్చు పెడుతున్నాడు… కానీ అది తను కొత్తగా రాయిస్తున్న కన్నప్ప చరిత్ర… అది మంచు కన్నప్ప చరిత్ర…
కన్నప్ప ఎవరు..? తెలుగువాడు… బోయ… రాజంపేట ప్రాంతంలోని ఊటుకూరు… అసలు పేరు తిన్నడు… తల్లిదండ్రులు భక్తులు… వేట వారి వృత్తి… ఓసారి తిన్నడు ఓ పందిని వేటాడుతూ కాళహస్తి గుడి ఉన్న ప్రాంతానికి వెళ్తాడు… అక్కడ పారవశ్యంలో మునిగిపోయి, తనకు తోచిన పద్ధతిలో శివుడిని అర్చిస్తుంటాడు… తనది భక్తిలో ఓ తాదాత్మ్య స్థితి…
నోట్లో పుక్కిలి పట్టిన నీళ్లతో అభిషేకిస్తాడు, ఏవేవో పిచ్చిపూలు వేస్తాడు, పంది మాంసం నివేదిస్తాడు… అక్కడి పూజారికి రోజూ దాన్ని కడగడం, తిన్నడు యథాప్రకారం తనదైన శైలిలో పూజించడం… శివుడు తిన్నడికి ఓ పరీక్ష పెడతాడు… లింగంపైని ఒక కంటి నుంచి రక్తం, తిన్నడు తన కన్ను పొడుచుకుని అమరుస్తాడు, మరో కంటిలో నెత్తురు, మరో కన్ను పెకిలించడానికి తిన్నడు సిద్ధం… అప్పుడు శివుడు ప్రత్యక్షమై తనకు ముక్తి ప్రసాదిస్తాడు… ఇదీ కథ…
Ads
(బెదర కన్నప్ప, కన్నడ సినిమా)
ఒక సగటు బోయ… వేట తన వృత్తి… మహా అయితే అప్పట్లో తనకు ఓ వెదురువిల్లు, బాణాలు, ఓ కత్తి ఉండేవేమో… శ్రీకాళహస్తీశ్వర మహత్మ్యంలో ధూర్జటి కూడా తిన్నడిని ఓ మామూలు వనవాసిగానే చిత్రించాడు… దానికి కొద్దిమార్పులు చేసి రాజకుమార్ 1954లో బెదర కన్నప్పగా సినిమా తీశాడు… అంతకుముందు నాటకాల్లో ఈ జానపద గాథ ప్రసిద్ధమే…
కృష్ణంరాజుకు అప్పట్లో ఫేమస్ మూవీ బెన్‌హర్ అంటే ఇష్టం… దాన్ని పోలిన సినిమా తీద్దామని ఈ తిన్నడి కథకు ముందుకొచ్చాడు… ఒక భక్తుడు గాకముందు తిన్నడు నాస్తికుడని కథకు మార్పు చేసుకున్న బాపు, రమణలు మంచి దృశ్యకావ్యంగా రూపొందించారు… నాస్తికుడు ఆస్తికుడైతే వచ్చే కంట్రాస్టు ఆ సినిమా కథకు బలం…
తిన్నడు సాహసి… ఓ అందమైన ప్రేయసి… ఎన్నీయెల్లో ఎన్నీయెల్లో అని పాటేసుకుని వెన్నెల్లో విహరించే ప్రేమజంట… శివుడి పేరు చెప్పి జనాన్ని బురిడీ కొట్టించే మరో నకిలీ బాబా పాత్రను కూడా సృష్టించారు… ఫేక్ భక్తికీ, నిజభక్తికీ నడుమ కంట్రాస్టు కోసం… వేటూరి అద్భుతంగా రచించిన కిరాతార్జునీయం పాట హైలైట్… మరో కంట్రాస్టు ఏమిటంటే..? భక్తి సినిమాలో రక్తిని కూడా చూపించడం… శివశివ అననేలరా అనే పాట అదే… అందుకే సినిమా సూపర్ హిట్ అయ్యింది… వాణిశ్రీ అభినయం అపూర్వం… బెన్‌హర్‌గా రూపుదిద్దలేదు గానీ తెలుగు జనానికి బాగా ఎక్కింది సినిమా…
మరి మంచు కన్నప్ప పాత్ర..? చివరకు సినిమా కథ ఎలా ఉంటుందో తెలియదు గానీ నయా ధూర్జటి ఎవరో గానీ ఓ పాన్ ఇండియా సినిమా కోసం ఎడాపెడా కొత్త చరిత్ర రాశారు… మోహన్‌బాబు ఎక్కడో చెబుతున్నాడు, ఇది భక్తి సినిమా కాదు, చరిత్ర అని…! ఏ చరిత్ర, ఎవరి చరిత్ర, ఎవరితో రాయబడే చరిత్ర, ఎలా తీయబడే చరిత్ర… బహుశా రాజమౌళిని ఆదర్శంగా తీసుకున్నట్టున్నారు…
అల్లూరి, కొమ్రం భీమ్ పాత్రలనే కసకసా తనకు తోచిన రీతిలో నరికేసి, కుట్టేసి ఏదో కొత్త చరిత్ర రాశాడు కదా రాజమౌళి… అందరమూ వేల కోట్లు కురిపించాం కదా, తన తెలివికి మెచ్చి… మరి తిన్నడి చరిత్ర కూడా అలాగే రాస్తే తప్పేముంది అనుకున్నట్టున్నారు… ఈ తిన్నడు అలియాస్ కన్నప్ప బాపు మార్క్ నాస్తికుడు కాదు… శివభక్తుడు… రకరకాల రాజమౌళి మార్క్ ఆయుధాలు చేతబట్టి తిరుగుతాడు…
మధ్యలో వాయులింగం… వందల మంది దాడి, ఊచకోత… ఆ ట్రెయిలర్‌లోని ఒక సీన్ చూడండి… సగటు తెలుగు స్టార్ హీరో కనబరిచే విపరీతమైన వయెలెన్స్‌కు ప్రతిరూపం… అనేకమందిని ఊచకోత కోసి, ఆ శవాలపై కూర్చుని ఉంటాడు… మరి ఇది ఆ భక్తకన్నప్ప కథ కాదు కదా, సగటు తెలుగు సూపర్ హీరోయిక ఇమేజీ కనిపించాలి కదా… యుద్ధాలు, గుర్రాలపై వేటలు, దాడులు… మగధీర టైపులో వంద మంది ప్రస్తావన… యుద్ధంలోె శివుడిని శరణు వేడటం, ప్రియురాలు కూడా బాహుబలి తమన్నా టైపు యుద్ధవనిత… అసలు ఇది వేరే కథ… నో ధూర్జటి, నో రాజకుమార్, నో బాపు, నో కృష్ణంరాజు… జస్ట్, ఇది మంచు కన్నప్ప…
పాన్ ఇండియా అంటే పలు భాషల స్టార్ హీరోలు ఉండాలనే ఓ పిచ్చి నమ్మకం… ప్రభాస్, అక్షయకుమార్, శరత్ కుమార్, మోహన్‌బాబు, మోహన్‌లాల్ ఎట్సెట్రా… విష్ణు లుక్కు, ఆ గడ్డం… ప్చ్… అప్పట్లో జిన్నా అనే సినిమా తీశాడు, ఎందరు వద్దంటున్నా అదే పేరు… మోహన్‌బాబు విచిత్రమైన సన్నాఫ్ ఇండియా తీశాడు… హేమిటో మంచు వారు అర్థం కారు… మరి కన్నప్ప… ఏమో, ఆ శివుడు తన కొత్త పాన్ ఇండియా బాహుబలి మార్క్ చరితను, నాటి బాపు భక్త కన్నప్పకు భిన్నమైన కథను ఆమోదిస్తాడో లేదో… టైమ్ చెబుతుంది..!! (డిస్‌క్లెయిమర్… ఇది టీజర్ చూశాక కలిగిన భావన… ఫైనల్ ఔట్‌పుట్ బ్రహ్మాండంగా ఉంటుందనే అనుకుందాం, ఆశిద్దాం…)
Share this Article