ఓ మిత్రుడు చెప్పుకొచ్చింది ఆసక్తికరంగా అనిపించింది… ‘‘చాలా అలవిమాలిన హామీలు ఇచ్చాడు బాబు… వాటిని తమ ఎన్డీయే హామీలుగా కూడా చెప్పడానికి బీజేపీకి ఇష్టం లేదు… ఆ మేనిఫెస్టోకు దూరంగా ఉంది… ఆ హామీలన్నీ వాస్తవ స్పూర్తితో అమలు చేయడం కష్టం… అసలే పీకల్లోతు అప్పుల్లో ఉన్న రాష్ట్రం…
సో, పరిమితులు, కత్తెరలు, ఆంక్షలు, పరిమితులు తప్పవు… వీటిని చూసి ప్రజలు వోట్లేయలేదు చంద్రబాబుకు… జస్ట్, ఇదంతా జగన్ వ్యతిరేక వోటు… జగన్‌కు వ్యతిరేకంగా ఎవరు నిలబెడితే వాళ్లను గెలిపించారు… మొహం, గత చరిత్ర, పార్టీ ఇవన్నీ పట్టించుకోకుండా…! జనసేన 100 శాతం స్ట్రయిల్ రేటు కారణం కూడా అదే…
మితిమీరిన హామీల్ని కష్టమ్మీద అమలు చేసినా జనానికి పట్టదు… పడుతుందని అనుకోవడం పార్టీల భ్రమ… జగన్ బటన్ నొక్కుడుతో లక్షల కోట్లు పంచాడు, ఒక్కడికీ అది పట్టలేదు, పక్కన పడేశారు… కర్నాటకలో నానా తిప్పలూ పడింది కాంగ్రెస్ ప్రభుత్వం, ఏమైంది..? మొన్న బీజేపీకి జై అన్నారు… ఇదే ఇండి కూటమి బోలెడు చెప్పింది, ఐనా అధికారంలోకి రాలేదు… సో, చంద్రబాబు కూడా ఆ హామీల పర్‌ఫెక్ట్ అమలు ఎలా ఉన్నా… ఇంకొన్ని పనులు చేస్తే లోకేష్‌కు సరైన భవిష్యత్తు బాట పడుతుంది…’’
Ads
ఏవో అయిదు తొలిసంతకాలు చేశాడు సరే… పోలవరం బ్యారేజీ స్థాయికి కుదించినా సరే, గ్రావిటీతో నీళ్లు ఇచ్చేలా ఆ ప్రాజెక్టును ఓ కొలిక్కి తీసుకురావాలి… ఇదీ నా కంట్రిబ్యూషన్ అని చెప్పుకోవడానికి..! ప్రస్తుతం రకరకాల దశల్లో ఉన్న అమరావతి నిర్మాణాలను తక్షణం పూర్తి చేసి, రోడ్లేసి యాక్టివిటీ స్టార్ట్ చేయాలి… అదే రాజధాని అనే నమ్మకం ఎల్లెడలా ఏర్పడాలి… రాజమౌళి మార్క్ గ్రాఫిక్స్‌కు స్వస్తి చెప్పి, ఆచరణ సాధ్యమైనట్టు, ఉన్నంతలో రాజధానిని ఓ రూపుకు తీసుకురావాలి…
సరే, ఊళ్ల మీద పడి దోచుకున్న పాత ఘన నేతల చరిత్రలను తవ్వుతారు, కేసులు పెడతారు, ఎంతగా కక్షసాధింపు ఉండదని చెబుతున్నా సరే, కొందరి అక్రమాలపై దర్యాప్తులు, విచారణలు తప్పవు… కన్నూమిన్నూ కానరాకుండా వ్యవహరించిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై వీలయితే డీవోపీటీకి సరెండర్ చేసేసి, ఉన్నంతలో అడ్జెస్ట్ చేసుకుంటే చాలా బెటర్… ఆల్రెడీ శ్రీలక్ష్మి, ఆంజనేయులు వంటి అధికారుల బొకేలు తీసుకోవడానికి, వాళ్ల మొహాలు చూడటానికి కూడా చంద్రబాబు ఇష్టపడలేదు, కొందరు ఆల్రెడీ తమ పదవుల నుంచి వెళ్లిపోయారు…
తిరుమల ప్రక్షాళన సరే… అక్కడి నిర్వహణ యంత్రాంగంలో వీలైనంతవరకూ రాజకీయ జోక్యం లేకుండా చూడాలి… ఆ ధర్మారెడ్డి తప్పులన్నీ సరిదిద్దాలి… సులభ దర్శనం, వసతి మాత్రమే కాదు, ఆ పవిత్రత కాపాడే అధికారుల్ని నియమించాలి… ఇలా ప్రక్షాళన చేయాల్సిన వ్యవస్థలు చాలా ఉన్నయ్… అన్నింటికీ మించి ఓ పని మీద అర్జెంటుగా దృష్టి సారించాలి…
పరమ దరిద్రమైన కొత్త బ్రాండ్లలో, ఆకాశాన్నంటే ధరలతో ప్రజలతో నిర్బంధంగా తాగించిన రంగు నాటుసారా అనగా, కాస్ట్‌లీయెస్ట్ చీప్ లిక్కర్‌ను తక్షణం నిషేధించాలి… ప్రతి ఊళ్లో లివర్ ఫెయిల్యూర్ కేసుల డేటా సేకరించాలి… లక్షల మంది సఫరర్స్… అనేక కుటుంబాలు కొత్తగా లివర్ ఫెయిల్యూర్లతో బజారున పడ్డాయి… అదొక విషమ సమస్య ఇప్పుడు ఊళ్లలో… లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్లు కూడా పనిచేయని స్థాయిలో ఒక విధ్వంసం… అంతేకాదు, అతి పెద్ద కుంభకోణం ఇది… ఈ దరిద్రమైన మద్యం కూడా జగన్ మీద ప్రజల్లో ఏర్పడిన కసికి ఓ ప్రధాన కారణం…
అన్నింటికీ మించి ఇసుక… దీన్ని స్ట్రీమ్ లైన్ చేయాలి… రాజకీయ నాయకులు, అధికారులు, జర్నలిస్టులు, ఇతర పెద్దలు కావల్సినంతగా ఇసుకను బొక్కుతున్నారు… నిర్దాక్షిణ్యంగా వ్యవహరించాలి చంద్రబాబు… సరే, ప్రభుత్వం అన్నాక, పార్టీ అన్నాక ఇతరత్రా చాలా ఆర్జన వ్యవహారాలుంటాయి… పైగా చంద్రబాబు… ఎటొచ్చీ, గ్రాఫిక్స్ పాలన గాకుండా ఈసారి కాస్త క్షేత్ర స్థాయికి నచ్చే వాస్తవ పాలన మీద దృష్టి పెడితే… అప్పుడిక జగన్ మీద ఏ ప్రతీకారాలు అక్కర్లేదు… అర్థమైందనుకుంటా..!!
Share this Article