క్రికెట్ వరల్డ్ కప్ జరుగుతుందంటే ఒక జోష్ ఉంటుంది. ఏ దేశంలో జరిగినా ఇండియాలో సందడి చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ ప్రస్తుతం వెస్టిండీస్-యూఎస్ఏ వేదికగా టీ20 వరల్డ్ కప్ జరుగుతున్నా.. క్రికెట్ ఫ్యాన్స్‌లో పెద్దగా జోష్ కనిపించడం లేదు. ఇండియా మ్యాచ్‌లకు తప్ప మిగిలిన వాటికి అసలు రేటింగే రావడం లేదు. దీనికి తోడు అన్నీ లోస్కోరింగ్ మ్యాచ్‌లే కావడం కూడా ప్రేక్షకులు ఆసక్తి చూపించకపోవడానికి కారణం అవుతోంది. గతంలో కూడా వెస్టిండీస్ వేదికగా జరిగిన వరల్డ్ కప్ ఇలాగే ప్రేక్షకుల ఆదరణ కరువై బ్రాడ్‌కాస్టర్లకు నష్టాలు తెచ్చిపెట్టింది. ఈ విషయం పక్కన పెడితే.. ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్ కప్‌లో కొన్ని సంచలనాలు నమోదయ్యాయి.
క్రికెట్‌లో అగ్రశ్రేణి జట్లగా పేరున్న శ్రీలంక, న్యూజీలాండ్, పాకిస్తాన్ వంటి దేశాలు లీగ్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించాయి. వీటిలో పాకిస్తాన్ జట్టు 2009లో, శ్రీలంక 2014లో టీ20 వరల్డ్ కప్ విజేతలు కావడం గమనార్హం. ఇక టీ20 ఫార్మాట్‌లో న్యూజీలాండ్ జట్టు టాప్ లెవెల్ పెర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఆ జట్టులో హేమాహేమీలైన టీ20 ఆటగాళ్లు ఉన్నారు. అయినా సరే ఈ మూడు జట్లు లీగ్ దశలోనే వెనుదిరగడం క్రికెట్ ఫ్యాన్స్‌ను షాక్‌కు గురిచేసింది.
బలమైన బ్యాటింగ్, బౌలింగ్ లైనప్ కలిగిన పాకిస్తాన్ జట్టు యూఎస్ఏపై ఓడిపోవడం ఒక సంచలనం. జూన్ 6న జరిగిన ఈ మ్యాచ్ సూపర్ ఓవర్ వరకు వెళ్లింది. కానీ చివరకు యూఎస్ఏదే పైచేయి అయ్యింది. ఆ తర్వాత ఇండియాతో జరిగిన మ్యాచ్‌లో చిన్న టార్గెట్‌ను కూడా పాకిస్తాన్ ఛేజ్ చేయలేక ఓడిపోయింది. కెనడా మీద మాత్రం 7 వికెట్ల తేడాతో గెలిచింది. అయితే గ్రూప్ ‘ఏ’లో ఉన్న ఇండియా మూడు మ్యాచ్‌లు గెలిచి సూపర్ 8కు అర్హత సాధించింది. అలాగే రెండు మ్యాచ్‌లు గెలవడంతో పాటు, ఐర్లాండ్‌తో మ్యాచ్ రద్దు కావడంతో ఒక పాయింట్ సాధించి.. మొత్తంగా 5 పాయింట్లతో యూఎస్ఏ సూపర్ 8కు వెళ్లింది. ఒక వేళ వర్షం పడకుండా యూఎస్ఏ, ఐర్లాండ్ మ్యాచ్ జరిగి.. ఐర్లాండ్ గెలిచి ఉంటే.. పాకిస్తాన్ కథ వేరేలా ఉండేది. పాకిస్తాన్ విషయంలో వర్షమే పెద్ద విలన్‌లా మారిందని అనుకోవచ్చు.
Ads
శ్రీలంక, న్యూజీలాండ్ విషయంలో మాత్రం సొంత తప్పిదాలే కారణం. గ్రూప్ డీలో సౌతాఫ్రికా, బంగ్లాదేశ్‌లతో జరిగిన మ్యాచ్‌లలో శ్రీలంక ఓడిపోయింది. సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో కేవలం 77 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఆ మ్యాచ్‌లో ఏకంగా నలుగురు డకౌట్ కావడం గమనార్హం. నిస్సాంక, కుషాల్ మెండిస్, సమరవిక్రమ, హసరంగ వంటి బ్యాటర్లు ఉన్నా.. కనీసం 100 పరుగులు చేయలేకపోయారు. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో నిస్సాంక, ధనంజయ డిసిల్వ తప్ప ఇతరులు ఎవరూ రాణించలేదు. దీంతో 124 పరుగులకే ఆలౌట్ అయ్యింది. బంగ్లాదేశ్ ఆ మ్యాచ్‌లో 2 వికెట్ల తేడాతో గెలిచింది. శ్రీలంక ఇటీవల బంగ్లాదేశ్ పర్యటనలో అత్యద్భుతంగా రాణించింది. కానీ వరల్డ్ కప్‌కు వచ్చేసరికి చతికిల పడింది. శ్రీలంక జట్టులో ఆటగాళ్లు ఫామ్‌లో లేకపోవడం, అమెరికాలోని స్లో పిచ్‌లను అర్థం చేసుకోవడంలో విఫలమవడమే వారి ఓటమికి ప్రధాన కారణం.
ఇక న్యూజీలాండ్ జట్టు లైనప్‌ను పరిశీలిస్తే.. ప్రస్తుతం ఆడుతున్న జట్లలో అత్యంత బలమైన టీ20 జట్టు ఇదే అని చెప్పొచ్చు. ఫిన్ ఆలెన్, డేవొన్ కాన్వే, రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్, డేరిల్ మిచెల్ వంటి బ్యాటర్లు.. లాకీ ఫెర్గూసన్, టిమ్ సౌథీ, ట్రెంట్ బౌల్ట్, మిచెల్ సాంట్నర్ వంటి బౌలర్లు ఉన్నారు. వీళ్లందరూ టీ20 ఫార్మాట్‌లో అరవీర భయంకరమైన ఆటగాళ్లుగా పేరొందిన వాళ్లే. ఇక కెప్టెన్ కేన్ విలియమ్‌సన్ సమయానికి తగినట్లుగా ఆడి జట్టుకు సహకరిస్తుంటాడు. ఇంత మంది కలిసిన జట్టు కనీసం సూపర్ 8కు కూడా అర్హత సాధించకపోవడం క్రికెట్ ఫ్యాన్స్‌కు షాకిచ్చింది.
ఆఫ్గానిస్తాన్‌పై 84 పరుగుల తేడాతో ఓడిపోవడంతో కివీస్ జట్టు ఆత్మస్థైర్యం దెబ్బతిన్నది. ఆ తర్వాత వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా 13 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఉగాండా మీద మాత్రం 9 వికెట్ల తేడాతో గెలిచింది. కానీ ఆ గ్రూప్ నుంచి ఆఫ్గానిస్తాన్, వెస్టిండీస్ సూపర్ 8కు వెళ్లిపోయాయి. దీంతో న్యూజీలాండ్ లీగ్ దశలోనే ఇంటికి వెళ్లిపోయింది. లీగ్ దశలో పాపువా న్యూ గినియా జట్టుతో జరిగే మ్యాచ్ నామమాత్రమే.
న్యూజీలాండ్ జట్టులోని పలువురు ఆటగాళ్లు ఐపీఎల్‌లో రాణించారు. బంతితో పాటు, బ్యాటుతో కూడా అలరించారు. అయితే వరల్డ్ కప్‌కు ముందు సన్నాహకంగా ఉంటుందని న్యూజీలాండ్ క్రికెట్ బోర్డు పాకిస్తాన్ పర్యటన ఏర్పాటు చేసింది. కానీ ఐపీఎల్‌లో ఆడుతున్న ఆటగాళ్లు ఎవరూ ఆ పర్యటనకు వెళ్లలేదు. ఐపీఎల్ నుంచి నేరుగా అమెరికా వెళ్లి టీ20 వరల్డ్ కప్ ఆడారు. సరైన ప్రాక్టీస్ లేకపోవడం వల్లే న్యూజీలాండ్ జట్టు లీగ్ దశలోనే నిష్క్రమించిందని కొందరు క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు పాకిస్తాన్ జట్టు రెండు మూడు టోర్నీలు ఆడింది. అయినా సరే లీగ్ దశలోనే నిష్క్రమించిన సంగతి గుర్తు చేస్తున్నారు.
ఈ మూడు జట్లతో పాటు ఇంగ్లాండ్‌కు కూడా ముప్పు పొంచి ఉన్నది. శనివారం రాత్రి నమీబియాతో జరుగనున్న మ్యాచ్ కనుక రద్దయితే స్కాట్లాండ్ జట్టు సూపర్ 8కు వెళ్తుంది. ఒక వేళ నమీబియాపై ఇంగ్లాండ్ గెలిచినా.. ఆస్ట్రేలియా, స్కాట్లాండ్ మధ్య జరిగే మ్యాచ్‌లో స్కాట్లాండ్ గెలిస్తే ఇంగ్లాండ్ ఇంటికి వెళ్లాల్సిందే. చివరకు ఇంగ్లండ్ కూడా ఈ ఈక్వేషన్లలో చిక్కుకోవడం విశేషమే… మరొకటీ చూడాలిక్కడ… మరో అగ్రశ్రేణి జట్టు దక్షిణాఫ్రికాను నేపాల్ చెమటలు పట్టించింది… కేవలం ఒక్క పరుగు తేడాతో దక్షిణాఫ్రికా గెలిచింది… సెన్సేషనల్ మ్యాచ్… ఏదేమైనా అగ్రశ్రేణి జట్లు లీగ్ దశలోనే వెనుదిరగడంతో సూపర్ 8 పెద్ద ఆసక్తికరంగా ఉండకపోవచ్చని క్రికెట్ ప్రేమికులు భావిస్తున్నారు…. (విశ్లేషణ :: జాన్ కోరా)
Share this Article