దాత విరాళంపై కేరళ ఆలయం అభ్యంతరం ధర్మబద్దమేనా?
సంస్కృతంలో మొదటిసారి ఛందోబద్ధమయిన శ్లోకం వాల్మీకి నోట్లో నుండే వెలువడింది. ఆదికావ్యం రామాయణం. ఆది కవి వాల్మీకి. బోయకులానికి పర్యాయపదంగా వాల్మీకి వాడుకలోకి వచ్చింది కానీ- నిజానికి వాల్మీకి ప్రచేతస మహర్షి పుత్రుడు. పేరు ప్రాచేతసుడు. దారితప్పి అడవుల్లో అల్లరి చిల్లరగా తిరుగుతుంటే- ఒక రుషి జ్ఞానోదయం కలిగిస్తాడు. ఈ దారి దోపిడీలు ఎందుకోసం? అన్న రుషి ప్రశ్నకు ప్రాచేతసుడు నవ్వి – కుటుంబాన్ని పోషించడం కోసం అని బదులిస్తాడు. అయితే ఈ దోపిడీ పాపంలో ఎంత వాటా వారు పంచుకుంటారో వెళ్లి కనుక్కురా! ఇక్కడే ఉంటాం అంటాడు రుషి. ప్రాచేతసుడు ఇంటికెళ్లి దీనంగా తల వేలాడేసుకుని తిరిగి వచ్చి రుషి కాళ్ల మీద పడతాడు. తల్లిదండ్రులు, భార్యా పిల్లలు ఎవరూ నా దోపిడీల పాపం పంచుకోము అని తెగేసి చెప్పారు అని బాధపడి- ప్రాయశ్చిత్తం చెప్పాల్సిందిగా ప్రాధేయపడతాడు.
రామనామం ధ్యానం చేస్తూ ఉండు- నేను మళ్లీ ఇటుగా వస్తాను అని రుషి వెళ్లిపోతాడు. ఏళ్లతరబడి అలా రామనామాన్ని ధ్యానం చేస్తున్న ప్రాచేతసుడి మీద వల్మీకం- పుట్ట ఏర్పడుతుంది. రుషి తిరుగు ప్రయాణంలో ప్రాచేతసుడిని తట్టి లేపి గంగా తీరానికి వెళ్లమని చెబుతాడు. అలా అక్కడి నుండి తమసానది తీరంలో ఆశ్రమం నిర్మించుకుని శిష్యులతో కాలం గడుపుతున్న వాల్మీకికి నారదుడివల్ల, బ్రహ్మ వల్ల రామకథ తెలిసి- రామాయణం రాశాడు. వాల్మీకి కిరాతుడు కాబట్టి రామ అనలేకపోతే మరా మరా అనమని రుషి చెప్పాడని, అదే తిరగేస్తే రామ అయ్యిందని కట్టుకథ అల్లి ప్రచారం చేసి ఇప్పటికీ వాల్మీకిని అవమానిస్తున్నారు. వాల్మీకిని బోయకులం ఓన్ చేసుకుని ఆరాధించడం మంచిదే. నెత్తిమీద రూపాయ పెడితే పావలాకు కూడా కొరగాని ఎందరో నాయకుల విగ్రహాలు వీధి వీధినా వెలుస్తుంటాయి. వాల్మీకులు ఎక్కువ ఉన్న ఊళ్లల్లో ఎక్కడో ఒక చోట వాల్మీకి విగ్రహం పెట్టి- వాల్మీకి జయంతులు జరుపుతుంటారు. వాల్మీకి పేరుతో కమ్యూనిటీ భవనాలు కడుతుంటారు. అలా అయినా వాల్మీకి ప్రస్తావన రావడం సంతోషించదగ్గ విషయమే. అయితే వాల్మీకి యావత్ సంస్కృత సాహిత్యానికే ఆదిపురుషుడు. రుషి. కారణజన్ముడు. వాల్మీకి భారతీయులందరూ, ప్రత్యేకించి వేద సాంప్రదాయాన్ని నమ్మేవారందరూ ఓన్ చేసుకోవాల్సిన మహర్షి. ఇంతకంటే వాల్మీకి పుట్టుపూర్వోత్తరాల చర్చ ఇక్కడ అనవసరం. రుషి పుట్టుక, నది పుట్టుక చర్చించకూడదని శాస్త్ర ప్రమాణం.
Ads
వాల్మీకి పూర్వాశ్రమంలో చేసిన దారిదోపిడీల పాపంలో భాగం పంచుకోము అని ఆయన కుటుంబం చెప్పిన విషయానికే పరిమితమవుదాం. కేరళలో ఒక ప్రఖ్యాత ఆలయానికి కర్ణాటకకు చెందిన ఒక పెద్ద వజ్రాల వ్యాపారి అక్షరాలా 526 కోట్ల రూపాయల విరాళం ప్రకటించాడు. వెంటనే ఆలయ పాలకమండలి ఆ మహాదాతకు ఒక ఉత్తరం రాసింది. “అయ్యా! మీ భూరి విరాళ ప్రకటనకు సంతోషం. అయితే ఆ 526 కోట్లు ఎలా వచ్చాయో చెబితేనే- విరాళం స్వీకరించాలో- వద్దో? మేము తేల్చుకుంటాం” అని.
అలాగే. నెల రోజులు సమయమివ్వండి. వివరాలు సమర్పిస్తాను – అని ఆ మహాదాత ప్రత్యుత్తరమిచ్చాడు. ఇక్కడ కొన్ని మౌలికమయిన చట్ట, ధర్మ, న్యాయ, భక్తి, పాపపుణ్య సూత్రాలను కేరళ ఆలయం విస్మరించినట్లుంది. లేదా తనకు లేని అధికారం ఉందనుకుని దాతకు సంజాయిషీ నోటీసు ఇచ్చినట్లుంది. చట్టపరంగా ఆ 526 కోట్లు ఎలా వచ్చాయి? అని దాతను వివరణ అడగాల్సింది ఆదాయపు పన్ను శాఖ. కేరళలో ఏ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది? ఆ పార్టీకి హిందూ ఆలయాలమీద ఎంత గౌరవమర్యాదలున్నాయో? పాలుతాగే పసి పిల్లలకు కూడా తెలుసు. ఒక అకెడెమిక్ డిబేట్ కోసం అదే అయిదు వందల కోట్లు టిటిడికి విరాళం ప్రకటించి ఉంటే ఇలాంటి అభ్యంతరమే వచ్చి ఉండేది కాదు కదా? నిజానికి అంత భారీ విరాళం ఇస్తున్నాడంటే… ఖచ్చితంగా ఐటీ కన్ను పడుతుందని సదరు దాతకు తెలియదా..? ఐనా ఇస్తున్నాడంటే వైట్ మనీ, అంటే లెక్కల్లో చూపిన మనీయే అయి ఉండాలి…
హిందూ సంప్రదాయంలో చేసిన పాపం చెప్పుకుంటేనే పోతుంది. దానధర్మాలు చేస్తేనే పాపం క్షయమవుతుంది. పుణ్యం పోగవుతుంది. దేశవ్యాప్తంగా ప్రతి ఆలయాల్లో హుండీల ముందు- ధర్మ సంపాదన అని ధ్రువపత్రం చూపితేనే భక్తులు, దాతలు విరాళాలు ఇవ్వవచ్చని రూలేమయినా ఉందా? ఒకవేళ అలాంటి రూలే కనుక ఉంటే- భగవంతుడికి ఇన్నిన్ని విరాళాలు పోగయ్యేవా? తాత్వికంగా- ఇచ్చేదెవరు? తీసుకునేదెవరు? అంతా దేవుడిదే- ఆయన ఇచ్చింది- ఆయనకే ఇస్తున్నామని- నిజమయిన భక్తుల నమ్మిక. మంచి చెడు భగవంతుడే నిర్ణయిస్తాడు. అప్పుడప్పుడు ఆదాయపు పన్ను శాఖ వాలంటరీ డిస్ క్లోజర్ స్కీమ్ ప్రవేశపెడుతూ ఉంటుంది. అంటే లెక్కచూపని వేల కోట్ల ఆస్తులను స్వచ్చందంగా లెక్కల్లో చూపించి తక్కువ పన్నుతో శాశ్వత హక్కు పొందవచ్చు. అలాంటిది దేవుడి హుండీలో వేస్తే తప్పెలా అవుతుంది? చట్టం వేరు. ధర్మం వేరు. పాపపుణ్యాల ధర్మ చింతన వేరు. కేరళ ఆలయం ఒక దాతను అధర్మంగా అనుమానించి, అవమానించినట్లే భావించాలి…… By…. -పమిడికాల్వ మధుసూదన్
Share this Article