ఓ మనిషి మరణించాడు… యమదూత వచ్చాడు తీసుకుపోవడానికి… యమదూత దగ్గరకు వచ్చేకొద్దీ తన చేతిలో ఓ సూట్‌కేసు ఉండటాన్ని మనిషి గమనించాడు…
.
ఇద్దరి మధ్య సంభాషణ ఇలా నడిచింది కాసేపు…
.
యమదూత :: నీ సమయం ముగిసింది, పద, ఇక బయల్దేరుదాం…
మనిషి :: ఇంత త్వరగానా..? నా జీవితానికి సంబంధించి ఇంకా చాలా ప్లాన్స్ ఉన్నాయి నాకు…
అవన్నీ కుదరవు వత్సా, పద, టైమయింది…
అది సరే, నీ సూట్‌కేసులో ఏమున్నాయి స్వామీ…?
నీకు సంబంధించినవే ఉన్నాయి…
అంటే, నా బట్టలు, నా డబ్బు, నా ఆస్తిపత్రాలా..?
కాదు పుత్రా, అవన్నీ నీవెలా అవుతాయి, అవి ఈ భూమికి సంబంధించినవి మాత్రమే కదా…
మరలేమిటి..? నా జ్ఞాపకాలా..?
కాదు, అవన్నీ కాలానికి సంబంధించినవి కదా…
అర్థమైంది, అందులో ఉన్నవి నా ప్రతిభాపాటవాలు…
అసలే కాదు, అవి పరిస్థితులకు సంబంధించినవి కదా…
మరేమిటి..? నా స్నేహితులు, కుటుంబ సంబంధమా..?
కాదు బిడ్డా… అవి నీవు నడిచొచ్చిన బాటల అవశేషాలు కదా…
ఓహ్, అయితే ఖచ్చితంగా నా పిల్లలు, నా భార్యకు సంబంధించినవి…
కాదు, కాదు, అవి నీ హృదయానికి సంబంధించినవి కదా…
ఇప్పుడు ఊహించగలను, అందులో ఉంది నా దేహం…
కాదు, కాదు, నీ దేహం అంటే ఉత్త దుమ్ము మాత్రమే కదా…
ఇక మిగిలిందేముంది..? అందులో ఉంది నా ఆత్మ…
తప్పు, నీ ఆత్మ పరమాత్మది కదా, ఎప్పుడో అందులోకి చేరిపోయింది…
మనిషి కన్నీళ్లు నింపుకుని, యమదూత ఎదుట చతికిలపడిపోయి, భయంభయంగా తన చేతుల్లోకి ఆ సూట్‌కేసు తీసుకుని ఓపెన్ చేశాడు…
…… ఖాళీ….
మనిషి కళ్లల్లో ఆశ్చర్యం… చెంపల పైకి ధారగా కన్నీళ్లు… చేతులు జోడించి అడిగాడు యమదూతను… ఇదంతా ఖాళీయే కదా అన్నాడు…
అవును మానవా… నువ్వు సంపాదించింది ఏమీ లేదు… అంతా ఖాళీయే అన్నాడు యమదూత…
మరి నాకంటూ ఏముంది..? నేను సంపాదించుకున్నది ఏముంది..?
క్షణాలు, నీకంటూ నువ్వు ఆనందంగా గడిపిన క్షణాలు… నీ జీవితంలో ఒక్క క్షణమూ లేదు… అవి ఉంటే ఈ సూట్‌కేసులో నీకు కనిపించేవి… ఇక పద వెళ్దాం…
మనిషి నిరుత్తరుడై, నిర్నిమేష చూపులతో అనుసరించాడు…
నీతి :: జీవితం క్షణభంగురం, జీవించు, ప్రేమించు, అనుభవించు ఆ క్షణాన్ని… ప్రతి క్షణాన్ని…
.
.
.
.
.
ప్రభాకర్ జైనీ ఇంగ్లిషు పోస్టుకు నా తెలిసీతెలియని అనువాదం…
Share this Article