ఒక వార్త చదివాక… చకచకా మన తెలుగు చానెళ్లలో డిబేట్ ప్రజెంటర్లు తమను తాము అర్నబ్ గోస్వాములు అనుకుని, గెస్టులతో రెచ్చిపోయి పిచ్చిపిచ్చిగా వాదించే తీరు గుర్తొచ్చింది… విచిత్రమైన గొంతులో ఓ జర్నలిస్టు, వింత భాషతో మరో హోస్టు గెస్టులను పిచ్చెక్కించే తీరూ గుర్తొచ్చింది…
సినిమా ప్రమోషన్ కోసం ఓ యూట్యూబర్ తల మీద పెట్రోల్ పోసుకున్న ఫేక్, ప్రాంక్ వీడియో చేయించిన హీరో గుర్తొచ్చాడు… యూ గెటౌట్ అని అరిచిన మరో టీవీ యాంకర్ గుర్తొచ్చింది… ఓ హీరోయిన్ బాడీలోని పుట్టుమచ్చలన్నీ చూశావా అని హీరోను అడిగిన ఓ వెకిలి గొంతు గుర్తొచ్చింది… మన యూట్యూబర్ల దరిద్రాలన్నీ గుర్తొచ్చాయి…
ఒకప్పుడు సినిమా ప్రమోషన్ కోసం పత్రికలు, మెయిన్ స్ట్రీమ్ టీవీలకు ఇంటర్వ్యూలు ఇవ్వడం, ప్రెస్ మీట్లు అరేంజ్ చేయడం, ప్రిరిలీజ్ ఫంక్షన్లు, పాటల విడుదలలు, గ్లింప్స్ రిలీజులు, టీజర్లు, ట్రెయిలర్లు గట్రా తప్పదు… మరీ రీచ్ ఇప్పుడు యూట్యూబర్లకే కాబట్టి వాళ్లకూ ఇంటర్వ్యూలు ఇవ్వాల్సి వస్తోంది పాపం… వాళ్లడిగే ప్రశ్నలకు బెంబేలెత్తిపోతూనే తప్పనిసరై భరించాల్సి వస్తోంది…
Ads
ఇంతకీ ఆ వార్త ఏమిటంటారా..? హన్నా రేజి కోషి అని ఓ మలయాళ నటి… మోడల్… రకరకాల అందాల పోటీల్లో పాల్గొంది… కొన్నాళ్లుగా మాలీవుడ్‌లో అవకాశాలు వెతుక్కుంటూ ఏదో కష్టపడుతోంది… అష్కర్ సౌదాన్ అని నటుడు… మమ్ముట్టి సోదరుడి కుమారుడు… తనూ ఇండస్ట్రీలో ఎదగే క్రమంలో ఉన్నాడు… వీళ్లిద్దరూ డీఎన్ఏ అనే సినిమాలో ప్రధాన పాత్రలు చేశారు…
దాని ప్రమోషన్ కోసం వరుసగా యూట్యూబర్లకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు… సుహైలా అనే ఓ ఫిమేల్ ఇంటర్వ్యూయర్ హఠాత్తుగా ఆమెను ఓ ప్రశ్న అడిగింది… కెరీర్‌లో ఎదగడానికి ఎవరితోనైనా పడుకోవాల్సి వచ్చిందా అని..! హన్నా షాక్… కాసేపు ఏమని బదులివ్వాలో తెలియక మౌనంగా ఉంది… ఆమె పక్కనే కూర్చున్న హీరో కూడా ఇబ్బందిగా ఫీలయ్యాడు… తరువాత మౌనంగా ఉంటే అది అంగీకార సూచన కాబట్టి ‘‘ఇది చాలా అమర్యాదకరమైన ప్రశ్న… మరీ ఓ ఫిమేల్ యాంకర్ నుంచి ఈ ప్రశ్న ఊహించలేదు’’ అని చెప్పి తిరస్కార సూచనగా ఇంటర్వ్యూ నుంచి వెళ్లిపోయింది విసురుగా…
ఇదొక దిక్కుమాలిన ట్రెండ్… తారలతో ఇంటర్వ్యూ అనగానే కాస్టింగ్ కౌచ్ గురించిన ప్రశ్నలు… అసలు ఆ సందర్భమేమిటి..? ఆ ప్రశ్నలేమిటి..? సదరు హీరో కూడా ఆ నటితోపాటు వాకవుట్ చేశాడు… గుడ్… నిజానికి చాలామంది ఈ ఇంటర్వ్యూలో యాంకర్ ప్రాంక్ చేస్తుందని అనుకున్నారు… కానీ కాదట… ఉద్దేశపూర్వకంగానే ఆ ప్రశ్న వేశాను అంటోంది సదరు యాంకర్… ‘‘నాకూ సినిమా కెరీర్ అంటే పిచ్చి, అవకాశాల కోసం నన్ను లైంగిక అవసరాలు తీర్చాలని అడిగారు కొందరు… అందుకే ఆ ప్రశ్న వేశాను…’’ తన మరో వీడియోలో క్లారిటీ ఇచ్చింది…
నిజమే, ఇండస్ట్రీలో మహిళలను మరీ అంగడి సరుకుగా ట్రీట్ చేస్తారు, వాడుకుంటారు… కానీ ప్రతి ఇంటర్వ్యూలోనూ ఎక్కువ వ్యూస్ కోసం పదే పదే అలాంటి ప్రశ్నలే అడగడం మరీ ఎక్కువైపోయింది… ఇంటర్వ్యూయర్లు కొన్ని పరిమితులు విధించుకోవాలి… పైగా ఈమధ్య ప్రాంక్ మోడల్ ఇంటర్వ్యూలు ఎక్కువయ్యాయి… కావాలని ఏదో పర్సనల్ అంశాల్లో ప్రశ్న వేయడం, ప్రొవోక్ చేయడం దాన్నే తమ యూట్యూబ్ వీడియోకు ఏదో హాట్ థంబ్ నెయిల్ పెట్టేసి ప్రచారం చేసుకోవడం…
విచిత్రంగా ఈ వీడియోకు సంబంధించి యాంకర్ సుహైల్ భలే ప్రశ్న అడిగింది, మంచి సబ్జెక్టు తీసుకుంది అని సోషల్ మీడియాలో ప్రశంసలు వచ్చాయట… కానీ ఇంటర్వ్యూ ఇస్తున్న మహిళ పడే ఇబ్బందిని గుర్తించినట్టు లేరు వాళ్లంతా… మౌనంగా ఉంటే ఓ తంటా, ప్రశ్న దాటవేయనివ్వరు… ఏదో చెబితే దానికి ఇంకేదో పీకుతారు… రచ్చ…
ఇంటర్వ్యూ నుంచి వాకవుట్ చేస్తే అదొక ఇష్యూ…!! అవును, ప్రశ్నకు జవాబు చెప్పకుండా దాటేయవచ్చుకదా, ఎందుకింత ఇష్యూ చేస్తోంది ఆమె అనేవాళ్లూ ఉన్నారు… ప్రశ్నలు ఫేస్ చేసేవాళ్లకు తెలుస్తుంది ఆ పెయిన్..!! మరీ వర్దమాన తారలే వీళ్లకు టార్గెట్స్ అవుతుంటారు ఇలాంటి ప్రశ్నలకు..!!
Share this Article