మళ్లీ ఓ విషయం చెప్పుకోవాలిప్పుడు… బాపు శ్రీరామరాజ్యంలో సీతగా నయనతారను ఎంపిక చేసినప్పుడు అందరూ పెదవివిరిచారు… వ్యాంప్ తరహా పాత్రలు వేసుకునే నటిని అంతటి సీతగా ఎలా చూపిస్తాడు బాపు అని… కానీ ఏం జరిగింది..? సినిమా విడుదలయ్యాక మళ్లీ ఎవ్వడూ నోరు మెదపలేదు… ఒక నటిని సరిగ్గా ఆ పాత్రలోకి తోసి, తనకు కావల్సినట్టుగా నటింపచేసి, సరైన ఔట్‌పుట్ వచ్చేలా చేసుకునే దమ్ము దర్శకుడి వద్ద ఉండాలి…
నటి అంటే ఓ మట్టిముద్ద… ఆ పాత్రకు తగినట్టు రూపుదిద్దాలి, అంతే కదా… అఫ్‌కోర్స్, చాలామంది తారలు అలా ఒదగడానికీ కష్టమే… అది వేరే సంగతి… రామాయణం టీవీ సీరియల్‌లో లక్ష్మణుడి పాత్ర వేశాడు కదా… సునీల్ లాహ్రి… తనేమంటున్నాడంటే..? ‘‘రణబీర్‌కపూర్ లుక్ రాముడిగా బాగానే ఉంది… పర్‌ఫెక్ట్ ఫిట్… మంచి నటుడు… కానీ యానిమల్ వంటి కేరక్టర్ చేశాక వెంటనే రాముడిగా ప్రజలు ఆమోదిస్తారా అనేది డౌటే…
సీతగా సాయిపల్లవి ఎంపిక కరెక్టు కాదు, నటిగా ఆమె ఎలా ఉంటుందో నాకు తెలియదు, ఆమె నటన నేనెప్పుడూ చూడలేదు… కానీ ప్రజలు సీత అంటే ఓ పర్‌ఫెక్ట్ మొహాన్ని, ఓ దేవతగా పరిపూర్ణతను ప్రదర్శించే మొహాన్ని కలిగి ఉండాలి… సాయిపల్లవిలో ఆ పరిపూర్ణత ఉందని నేను అనుకోను… సీత ఎంత అందంగా ఉండాలంటే రావణుడు అందుకే ఆమె వెంటపడ్డాడా అనిపించేలా ఉండాలి…’’
Ads
ఒకవైపు అదే రామాయణం టీవీ సీరియల్‌లో సీతగా నటించిన దీపిక చికిలియా… ఇక ఎవరూ రామాయణాన్ని తీయకపోవడం బెటర్ అంటుంది… సరే, ఆదిపురుష్ చూసిన బీభత్స అనుభవం ఆమెతో అలా అనిపించిందేమో… కానీ సునీల్ లాహ్రి వ్యాఖ్యలు అబ్సర్డ్… తనకు సాయిపల్లవి తెలియదు, తన నటన ఎప్పుడూ చూడలేదు, ఐనా సీతగా సూట్ కాదట…
పోనీ, ఎవరు నటించాలి..? దీపిక పడుకోన్, ప్రియాంక చోప్రా, కంగనా రనౌత్, విద్యాబాలన్, సోనాక్షి సిన్హా… వీళ్లా..? మరి యానిమల్ తరహాలో వీళ్లూ పాత్రలు చేశారు కదా… వాళ్ల మొహాల్లో ఏమైనా సీత పరిపూర్ణత కనిపిస్తుందా..? రాబోయే రామాయణం భారీ ప్రాజెక్టును తీసే దర్శకుడు కూడా అనుభవశూన్యుడు, అసమర్థుడు ఏమీ కాదు… దంగల్ తీసిన నితిశ్ తివారీ…
సీతగా సాయిపల్లవిని ఎలా చూపిస్తాడో తనకే వదిలేయాలి… ఐనా రామాయణం టీవీ సీరియల్‌లో ఇదే సునీల్ లాహ్రి లక్ష్మణ్ పాత్రకే సూట్ కాలేదు, ఐనా జనం ఆమోదించలేదా..? తరువాత కూడా తను నటించి క్లిక్కయిన సినిమాలూ లేవు…
సౌత్ ఇండియా నుంచి ఒక నటి అంత భారీ ప్రాజెక్టులో సీతగా చేయడం మీద ఏదో వివక్షాపూరిత వ్యతిరేకత కనిపిస్తోంది… ఐనా బయటికి లీకైన ఫోటోల్లో సీతగా సాయిపల్లవి బాగానే ఉంది… ఒకప్పుడు సీత అంటే తెలుగు సినిమాలో అంజలీదేవి… తరువాత అంతగా ఎవరూ సూట్ కాలేదా..? చాలామంది చేశారు… చంద్రకళ కూడా బాగానే చేసింది… ఇతర భాషల్లో కూడా చాలామంది తారలు చేశారు, ఎవరూ ఆ పాత్రకు నప్పలేదు అనే విమర్శ రాలేదు…
ఇదే మొదటిసారి… అసలు సినిమా షూటింగు సమయంలోనే ఇలాంటి విమర్శలు… అసలు ఇదే సునీల్ లాహ్రి మాటలకున్న విలువెంత..? వాటికి ఇంత ప్రాధాన్యం దేనికి…? ఒక విరాటపర్వం, ఒక గార్గి, ఒక శ్యామ్ సింగరాయ్ చూసి ఉంటే ఇలాంటి మాటలు వచ్చి ఉండేవి కావేమో… అన్నింటికీ మించి ఇలాంటి మురికి ఇండస్ట్రీలో కూడా తనకంటూ ఓ కేరక్టర్‌ను, ఓ విశిష్టతను కాపాడుకుంటున్న ఆమెను ఆ సీత పాత్రే వెతుక్కుంటూ వచ్చిందేమో..!! అవునూ, అదే టీవీ సీరియల్‌లో సీత పాత్రకు ఎంపికైనప్పుడు దీపిక చికిలియా పేరు ఎందరికి తెలుసు… అన్నీ చిన్నాచితకా చిల్లర వేషాలు వేసుకునేదే కదా..!!
Share this Article