తెలుగు సినిమా ఇండస్ట్రీని ఏపీకి రప్పించడానికి, కోనసీమను సినిమా షూటింగులకు అనువైన ప్రాంతంగా డెవలప్ చేయడానికి ప్రయత్నిస్తానని కొత్తగా ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రిగా పదవీప్రమాణం చేసిన జనసేన నేత, కందుల దుర్గేష్ ప్రకటించాడు… గుడ్… సినిమా నిర్మాతలు ఏపీలో స్టూడియోల నిర్మాణానికి ముందుకు రావాలని కోరాడు… గుడ్… కానీ..?
జనసేన అధినేత, ప్రభుత్వంలో భాగస్వామి పవన్ కల్యాణ్ సాక్షాత్తూ సినిమా మనిషే కాబట్టి… ఎంతోకొంత ఇండస్ట్రీకి సహాయ సహకారాలు అందుతాయని ఆశించొచ్చు… అటు చంద్రబాబు కుటుంబానికీ సినిమా వాళ్లతోనే అధిక బాంధవ్యాలు కాబట్టి తన ప్రోద్బలం కూడా ఉంటుందని ఆశించొచ్చు… కానీ..? అదంత ఈజీ అయితే కాదు, ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో ఉత్సాహం రాను రాను రియాలిటీ అర్థమై సన్నగిల్లుతుంది… చంద్రబాబు గత హయాంలో కూడా చూసింది ఇదే…
అక్కినేని దగ్గర నుంచి, ఎన్టీయార్, రామానాయుడు, కృష్ణ తదితరులు స్టూడియోలు కట్టి… ఇక్కడే సినిమాలు తీస్తూ, ఫుల్ ఫోకస్ పెడితేనే చెన్నై నుంచి హైదరాబాద్‌కు రావడానికి చాలాకాలం పట్టింది… ఐనా చెన్నైలో తెలుగు ఇండస్ట్రీకి చెందినవాళ్లు ఇంకా చాలామంది అక్కడే ఉండిపోయారు… ఈ దశలో ఇండస్ట్రీ ఏపీకి వచ్చి, ఓ రేంజ్‌కు డెవలప్ కావాలంటే అల్లాటప్పా నిర్ణయాలతో కాదు, చాలా స్థిరమైన విధానం, వర్క్ అవసరం… పైగా సినిమా ప్రముఖులందరికీ హైదరాబాదులో ఇతర వ్యాపారాలు కూడా బోలెడు…
Ads
హైదరాబాదులో ఆల్రెడీ డెవలపైంది కాబట్టి కొత్తగా ఇక్కడి ప్రభుత్వం చేయాల్సింది ఏమీ లేదు… ఇబ్బంది పెట్టకపోతే సరి… కేసీయార్ కూడా ఇండస్ట్రీ హైదరాబాదులో ఉండటం వల్ల ప్రయోజనాలు గమనించే, ఇండస్ట్రీ పట్ల స్నేహభావంతో ఉన్నాడు తప్ప వెంటపడలేదు ఎప్పుడూ… ఒకరిద్దరు సినిమా ప్రముఖులు మరణించినప్పుడు అధికారికంగా అంత్యక్రియలు జరిపించి, తను ఇండస్ట్రీకి ఇస్తున్న ప్రాధాన్యం, గౌరవాన్ని చాటిచెప్పాడు…
రచయిత, దర్శకుడు, నిర్మాత ప్రభాకర్ జైనీ అభిప్రాయంలో చెప్పాలంటే… ‘‘ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతానికి అయితే ఇన్‌ఫ్రా సరిపడా లేదు… షూటింగులకు సంబంధించిన, జూనియర్ ఆర్టిస్టులు, కెమెరాలు, లైట్లు, లెన్సులు, కెమెరామెన్లు, అసిస్టెంట్ కెమెరామెన్లు, క్రేన్లు, ప్రొడక్షన్, కాస్ట్యూమ్స్, మేకప్ మెన్, ట్రాన్పోర్ట్, రికార్డింగ్ స్టూడియోలు, లొకేషన్లకు పర్మిషన్లు వంటి సదుపాయాలు లేవు!
సినిమా షూటింగ్ కావడంతోనే సినిమా పూర్తయిపోదు. కొన్ని వేల మంది పని చేసే పోస్ట్ ప్రొడక్షన్ కు సంబంధించిన ఎడిటింగ్, డబ్బింగ్, మ్యూజిక్, RR, DI, CG స్టూడియోలు లేవు. సెన్సార్ స్క్రిప్ట్ రైటర్స్, సెన్సార్ బోర్డు, పబ్లిసిటీ ఇవన్నీ సమకూరాలంటే, ఇప్పటికిప్పుడు కష్టం.
వాతావరణ రీత్యా, హ్యుమిడిటీ, వేడి, చెమట వల్ల విజయవాడ, వైజాగులలో షూటింగ్ కష్టం. మేకప్ పగిలిపోతుంది. వేరే ఊళ్ళల్లో చేయాలంటే, అకామిడేషన్, ట్రాన్స్పోర్టు ఖర్చులు తడిచి మోపెడవుతుంది.
ఒక మంచి బృహత్ ప్రణాళికతో చిత్తశుద్ధితో పనిచేస్తే, రాయితీలు ఇస్తే, కార్మికులకు, కళాకారులకు గృహ వసతి కల్పిస్తే, ఒక పదేళ్ళలో ఒక మోస్తరు సినిమా పరిశ్రమను అభివృద్ధి చేయవచ్చు. దానికి నిబద్ధత కావాలి. స్టూడియోలు కట్టుకోవడానికి స్థలాలు ఇస్తే సరిపోదు.
గత ఐదేళ్ళలో, అంతకు ముందు చంద్రబాబు గారి ప్రభుత్వం అనౌన్స్ చేసిన ‘నంది’ అవార్డులు కూడా ఇవ్వలేదు. సినీ పరిశ్రమ, ఆంధ్రప్రదేశ్ లో, ప్రభుత్వ సంపూర్ణ సహకారం లేనిదే అభివృద్ధి కాదు. తెలంగాణలో ఆ అవసరం లేదు. హైదరాబాద్ లో అన్నీ ఉన్నాయి… కానీ..?
తెలంగాణలో కూడా సినీ పరిశ్రమ చిక్కుల్లో పడింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లు దివాళా తీస్తున్నాయి. మల్టీప్లెక్సుల సక్సెస్ కూడా బూటకపు లెక్కలే. కాబట్టి, ఒక సమగ్ర ప్రణాళిక లేనిది, ఆంధ్రప్రదేశ్ లో సినిమా పరిశ్రమ అభివృద్ధి చెందలేదు. ఒక్క దర్శకుణ్ణో, నిర్మాతనో కాకుండా 24 క్రాఫ్టుల యూనియన్ల ప్రతినిధులను పిలిచి వారి సమస్యలేమిటో తెలుసుకుని, వాటికి పరిష్కారాలు కనుగొన్న చర్వాత, ఒక సంపూర్ణ అవగాహనతో ముందుకు పోతే ఏమైనా ఫలితం ఉంటుంది…’’
Share this Article