Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

రాళ్లేరుకోవడం కాదు… వేళ్లేరుకోవాలి, కప్పలేరుకోవాలి, పాములేరుకోవాలి…

June 21, 2024 by M S R

ఐస్ క్రీమ్ లో తెగిన వేలు; అన్నంలో ఎగిరే కప్ప

1. ఫుడ్ డెలివరీ యాప్ లో ఐస్ క్రీమ్ కు ఆర్డర్ ఇస్తే- ఐస్ క్రీమ్ తో పాటు తెగిన వేలు టాపప్ గా ఫ్రీగా వచ్చింది.
2. విమానంలో అందాల గగనసఖి (ఎయిర్ హోస్టెస్) ఇచ్చిన అన్నం పొట్లంలో చచ్చిన బొద్దింక వచ్చింది.
3. ఫుడ్ ప్యాకెట్లో బతికి ఉన్న కప్ప బెకబెకమంటూ బయటికొచ్చింది.
4. ఆమెజాన్ లో బొమ్మ ఆర్డర్ ఇస్తే-బొమ్మతోపాటు బుస్ బుస్ అంటూ నాగుపాము పెట్టెలోనుండి బయటికొచ్చి…నట్టింట్లో పడగవిప్పి నాట్యమాడింది.
5. హైదరాబాద్ హోటళ్ల మీద ఆహారభద్రత అధికారులు దాడులు చేస్తే- కొన్ని చోట్ల పాచిన మాంసం మీద గులాబీ రంగు చల్లి…తాజాదని భ్రమింపజేస్తూ…రంగు రంగుల పొంగులతో వండి వడ్డించడం బయటపడింది.

హిందీ, ఇంగ్లిష్, తెలుగు న్యూస్ ఛానెల్స్ నిండా రెండు, మూడు రోజులుగా ఇవే ఎడతెగని చర్చలు జరుగుతున్నాయి. ఇందులో అన్నిటికీ వీడియోలు, ఫోటోల సాక్ష్యాలు కూడా ఉన్నాయి. కొన్ని వీడియోలు కంటితో చూడలేము. (మనం కంటితో చూస్తే తినలేమనే పగలైనా చీకటి చేస్తారు చాలా హోటళ్లలో)

Ads

మహానగరాలు మొదలు చిన్న పల్లెటూళ్ల దాకా ఇప్పుడంతా ఫుడ్ డెలివరీలు. ప్యాక్డ్ ఫుడ్. రెడీమేడ్ ఫుడ్డే. ఇళ్లల్లో వంటిల్లు అదృశ్యం కాబోతోంది. ఇంకో వందేళ్ల తరువాత- “అప్పట్లో ఇంట్లో వంటిల్లు ఇలా ఉండి…ఇంట్లోనే వండుకుని…ఇంట్లోనే తినేవారు- పరమ అనాగరికంగా” అని పరమ నాగరికులు చెప్పుకుంటారు.

food

మంచినీళ్ల బాటిల్ మొదలు న్యూక్లియర్ బాంబ్ దాకా ఏది కావాలన్నా ఇప్పుడు డెలివరీ యాప్ లో ఆర్డర్ ఇచ్చుకోవచ్చు. అయిదు, పది నిముషాల్లో ఏదయినా ఇంటికి తెప్పించుకోవచ్చు.

అధ్వ అంటే దారి. దారి మధ్యలో తినే అన్నం కాబట్టి- అధ్వ ప్లస్ అన్నం కలిపి అధ్వాన్నం అయ్యింది. అంటే ఉడికీ ఉడకనిది. బాగాలేనిది అని అర్థం. ఇప్పుడు ఆ అధ్వాన్నమే మనల్ను వెతుక్కుంటూ ఇంటికొస్తోంది డెలివరీ యాప్ ల ద్వారా.

food

భాషలో అర్థవ్యాప్తి, అర్థసంకోచం సహజం. కంపు అంటే ఒకప్పుడు వాసనే కానీ…
చెడు వాసన కాదు. చీర అంటే బాగా విస్తరించినది అనే కానీ మహిళలు మాత్రమే కట్టుకునేది అని కాదు. తెలుగు భారతంలో భీముడు కూడా చీర కట్టుకున్నాడు. బాగా పొడవుగా ఉన్న వస్త్రం అని ఒకప్పుడు చీరకు అర్థం. మనమిప్పుడు ఏరి ఏరి, కోరి కోరి తింటున్నదంతా అధ్వాన్నమే కాబట్టి భాషా శాస్త్రవేత్తలందరూ కూర్చుని అధ్వాన్నానికి పాజిటివ్ మీనింగ్ వచ్చిందని ప్రకటించవచ్చు.

కొన్ని దశాబ్దాల క్రితం వరకు మిమిక్రి కళాకారులు, కామెడీ స్కిట్స్ చేసేవారు- ఏమయ్యా కాఫీలో ఈగ వచ్చింది? అని…సమాధానంగా నువ్విచ్చే అయిదు రూపాయలకు ఈగ కాక చికెన్ వస్తుందా? అని నవ్వించేవారు. లేదా ఈగను తీసి తాగకుండా దానికి మళ్లీ నన్ను పిలవాలా? అని వెటకారంతో మనల్ను నవ్వించేవారు.

food

నవ్విన నాపచేలన్నీ ఇప్పుడు పండి…నిజంగానే మన కంచాల్లో ఈగలు, దోమలు, బొద్దింకలు రెక్క విప్పి ఎగురుతున్నాయి. ఎగరలేక చస్తే…మన కడుపుల్లోకి వాతాపి జీర్ణమై వెళుతున్నాయి.

ఇది బల్లి, నల్లితో అక్కడికి ఆగితే బాగుండేది. తెగిన వేళ్లు, కాళ్లు రావడమేమిటి? అనుకోవడంలో అర్థం లేదు. తోటకూరనాడే అలా అనుకుని ఉంటే ఇప్పుడు ఇలా అనుకోవడానికైనా మనకు హక్కు ఉండేది.

సాధనమున పనులు సమకూరు ధరలోన. నెమ్మదిగా మన సాధన కూడా ధరలో ఫలిస్తుంది. ఐస్ క్రీమ్ లో తెగిన వేలు, పళ్లరసంలో ఊడిన పళ్లు, అన్నం ముద్దలో ఎగిరే కప్పలను ఒడుపుగా పట్టుకుని…పక్కన పెట్టుకుని తినే రోజులు రావన్న గ్యారెంటీ అయితే లేదు!

దేనికైనా రాసి పెట్టి ఉండాలి!       -పమిడికాల్వ మధుసూదన్       9989090018

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions