తమిళనాడులోని తిరునల్వేలి ఏరియాలో నంగునేరిలో కొన్నాళ్ల క్రితం ఒక స్కూల్లో చదివే ఇద్దరు అక్కాతమ్ముళ్ల మీద దాడి జరిగింది… బాగా కొట్టారు… కారణం, కులపెత్తనం, వివక్ష, ఆధిపత్యధోరణి… ఈ ఇద్దరూ దళిత పిల్లలు… పెత్తందారీ కులానికి చెందిన స్టూడెంట్స్ అలా దాడి చేశారు… మరీ స్కూళ్లలో కూడా ఈ కులాధిపత్యమా..? అని ఆశ్చర్యపోకండి… ఉంది, అక్కడి నుంచే ఆరంభమవుతోంది…
ఈ దుర్ఘటన తరువాత స్టాలిన్ ప్రభుత్వం ఓ సింగిల్ జడ్జి కమిటీని వేసింది… ఆయన రిటైర్డ్ హైకోర్ట్ జడ్జి జస్టిస్ చంద్రు… ఆమధ్య బాగా హిట్టయిన సూర్య సినిమా జైభీమ్‌లో లాయర్ పాత్ర తెలుసు కదా… ఆ పాత్ర ఒరిజినల్ వ్యక్తి చంద్రు… హక్కులు, అణగారిన వర్గాల మీద దాడులు, వివక్షకు సంబంధించి ఆయన వర్క్ మీద చాలా స్టోరీలు వచ్చాయి… మంచి పేరుంది తనకు…
స్కూళ్లలో ఈ కులవివక్ష పోవాలంటే ఏం చేయాలో ఆయన ఒక నివేదికను స్టాలిన్‌కు ఇచ్చాడు… అందులో ప్రధానంగా ఏమున్నాయంటే… స్కూళ్లల్లో పిల్లలు తమ కులాన్ని సూచించే ఏ రిస్ట్ బాండ్లనూ వేసుకోవద్దు, అనుమతించకూడదు… సేమ్, కులాన్ని సూచించే ఉంగరాలు, చివరకు నొసటన తిలకాన్ని కూడా అనుమతించవద్దు… కొందరు పిల్లలు తమ సైకిళ్ల రంగు కూడా తమ కులాన్ని సూచించేలా ఎంపిక చేసుకుంటారు, వాటినీ అనుమతించొద్దు…
Ads
స్కూళ్లలో కూర్చునే క్రమం కూడా అక్షరక్రమాన్ని బట్టి ఉండాలి… అంటే అ లేదా ఏ తో మొదలయ్యేవారి నుంచి సీట్లు స్టార్టవుతాయి… కులాల వారీగా గుంపులుగా కూర్చునే ధోరణి దీనివల్ల పోతుంది… ఇది కాలేజీల్లో కూడా అమలు చేయాలి… అటెండెన్స్ రిజిష్టర్లలో కూడా కులాన్ని సూచించే కాలమ్ తీసేయాలి… అంతేకాదు, కులాన్ని సూచించే పేర్లలో పిల్లలను టీచర్లు పిలవడం మానేయాలి…
స్కూళ్ల పేర్లలో కూడా కులాన్ని సూచించే పదం ఉండకూడదనీ, ఇప్పటికే ఉన్నవాటికే కాదు, కొత్తగా ఏర్పాటు చేయబోయే స్కూళ్లకూ ఇది వర్తింపజేయాలి… కుల ప్రభావం ఉండే ప్రైవేటు స్కూళ్లను కూడా గుర్తించి, ఆ మేనేజ్మెంట్లనూ ఎడ్యుకేట్ చేయాలి… విద్యాసంస్థల ఆడిటోరియాలు, ప్లే గ్రౌండ్స్, క్లాస్ రూమ్స్, ల్యాబ్స్ పరిసరాల్లో కూడా కులప్రభావం కనిపించే గుర్తులు, పేర్లు లేకుండా ఓ చట్టమే తీసుకురావాలి…
విద్య కాషాయీకరణ ఆరోపణలకు విచారించడానికి ఓ హైలెవల్ కమిటీ లేదా సంస్థ ఏర్పాటు చేయాలి… కుల సమానత్వానికి భంగం కలిగించే యాక్టివిటీస్‌ను అనుమతించకూడదు… టీచర్లను కూడా నిర్ణీత వ్యవధిలో ట్రాన్స్‌ఫర్స్ చేయాలి… అంతేకాదు, ఏ ప్రాంతంలోనైతే ఏదైనా కులం బలంగా ఉంటుందో ఆ కులానికి చెందిన అధికార్లకు పోస్టింగ్ ఇవ్వవద్దు… టీచర్ల నియామక ప్రక్రియ సమయంలోనే వాళ్లకు తప్పనిసరిగా కులవివక్ష, కులసమానత్వం, సామాజిక సమతూకం వంటి అంశాలపై ఓరియెంటేషన్ ప్రోగ్రామ్ నిర్వహించాలి…
ఇదీ చంద్రు కమిటీ సిపారసుల నివేదిక సారాంశం… ఐతే ఇది పూర్తిగా సదరు కమిటీకి నేతృత్వం వహించిన రిటైర్డ్ జడ్జి సైద్ధాంతిక వైఖరిని ప్రతిబింబిస్తున్నాయి తప్ప, చాలా సిఫారసులను అమలు చేస్తే కులవివక్ష తగ్గదు సరికదా ఇంకా పెరుగుతుందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై కొట్టిపడేశాడు… నిజమే, కులవివక్ష నిర్మూలించాలి, కానీ ఈ సిఫారసులు ఆ దిశలో ఫలితాలనివ్వలేవు అన్నాడాయన… రాష్ట్రంలో ఈ సిపారసులపై చర్చ సాగుతోంది బాగా..!!
Share this Article