పొద్దున్నే వాట్సప్ న్యూస్ గ్రూపులో ఓ వార్త, కొన్ని వీడియోలు, కొన్ని ఫోటోలతోపాటు కనిపించింది… అది ఇలా ఉంది…
.
తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కూల్చివేత… ఉదయం 5:30 గంటల సమయంలో కూల్చివేత ప్రారంభం…
పొక్లైన్లు, బుల్డోజర్లతో భవనం కూల్చివేత… శ్లాబ్‌కు సిద్ధంగా ఉన్న భవనాన్ని కూల్చివేస్తున్న అధికారులు… కూల్చివేతకు సీఆర్డీయే ప్రిలిమినరీ ప్రొసీడింగ్స్‌ను సవాల్ చేస్తూ నిన్న హైకోర్టును ఆశ్రయించిన వైయస్సార్‌సీపీ… చట్టాన్ని మీరి వ్యవహరించవద్దని హైకోర్టు ఆదేశం…
Ads
హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ భవనాన్ని కూల్చివేశారంటున్న వైయస్సార్‌సీపీ… దీనిపై మళ్లీ హైకోర్టుకు వెళ్తామంటున్న పార్టీ వర్గాలు…. ఇదండీ వార్త…
.
ఈమధ్య ఈనాడులో, ఆంధ్రజ్యోతిలో చదివిన ఇంకొన్ని వార్తలు కూడా చకచకా గుర్తొచ్చాయి… 1) జగన్‌ది రాక్షసపాలన, సైకోపాలన, విధ్వంసపాలన… దానికి గుర్తుగా తను కూల్చేసిన ప్రజావేదిక శిథిలాలను అలాగే ఉంచేస్తామని చంద్రబాబు ప్రకటన… 2) నో కక్షసాధింపులు అని ప్రకటించిన పవన్ కల్యాణ్… 3) మారిన చంద్రబాబు, జగన్ పట్ల గౌరవంగా వ్యవహరించాలని చంద్రబాబు ఆదేశాలు…
మరి ఈ జేసీబీలు ఏమిటి అంటారా..? బహుశా చిన్నబాబు పదే పదే చెప్పిన రెడ్ బుక్ తెరుచుకుని ఉంటుంది… ఎస్, కొత్త ప్రభుత్వం రాగానే కొన్ని పరిణామాలుంటాయి… పాత ప్రభుత్వంలో అరాచకంగా వ్యవహరించారనో, పాత పాలకులకు మరీ లోబడి, పక్షపాతంతో వ్యవహరించారనో విమర్శలున్న ఉన్నతాధికారులను నాన్ ఫోకల్ పాయింట్లలోకి తరిమేస్తారు…
పాత ప్రభుత్వం రాజకీయ ఉద్దేశాలతో నియమించినవారినీ తొలగిస్తారు… కొన్ని నిర్ణయాలపై విచారణలూ స్టార్టవుతాయి… పాత ప్రభుత్వ తప్పుల్ని తవ్వితీసే ప్రక్రియ కొన్నాళ్లు కొనసాగుతుంది… తమను వేధించిన ముఖ్యులపై కన్నేసి, కొంత గోకడమూ పరిపాటే… కానీ జేసీబీలు మాత్రం కామన్ ఈరోజుల్లో…
హుందా రాజకీయాలు నడవడానికి ఇదేమీ ఒడిశా కాదు, చంద్రబాబు నవీన్ పట్నాయక్ కాదు… కొత్త సీఎం మాఝి కాదు… ప్రజావేదికను విధ్వంసపాలనకు ప్రతీకగా అలాగే ఉంచాలనే నిర్ణయం వెనుక తమ నిర్మాణాత్మక పాలన స్పూర్తి ఉంటుందని చెప్పే చంద్రబాబు ఈ వైసీపీ ఆఫీసు కూల్చివేతకు ఆదేశించడం దేనికి..? పాత జగన్ పాలనకూ దీనికీ ఇక తేడా ఏమున్నట్టు..?
పోనీ, కూల్చివేతకు కారణాలేమిటి..? ప్రభుత్వ స్థలంలో కడుతున్నారా..? ఇచ్చిన పర్మిషన్లకు భిన్నంగా కడుతున్నారా..? అసలు పర్మిషన్లే లేవా..? లేక అసలు వైసీపీ కార్యాలయ భవనమే ఉండకూడదా..? అదైనా ప్రజలకు క్లారిటీ ఇవ్వండి… ఎలాగూ వైసీపీ కోర్టును ఆశ్రయించింది… కోర్టు ఏదో చెప్పింది… కూల్చివేతకు ముందు కోర్టుకే అసలు వయోలేషన్స్ ఏమైనా ఉంటే చెప్పొచ్చు కదా… అక్రమ నిర్మాణమని తేలితే కోర్టు ఏమీ సమర్థించదు కదా… (ఇది ఇరగేషన్ శాఖ స్థలమనీ, పార్టీ ఆఫీసు కోసం కేటాయించబడినా ఆ స్థలాన్ని అధికారికంగా స్వాధీనం చేయకుండానే, ఏ పర్మిషన్లూ లేకుండా భవనం కడుతున్నట్టు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి)…
కోర్టుకు ఈ వివరాలే చెబితే సరిపోయేది, ఆ తరువాత కూల్చేస్తే అది సరైన తోవలో కూల్చివేత అవుతుంది… లేదంటే రెగ్యులరైజేషన్‌కు వీలుంది… అన్ని అనుమతులూ తీసుకొండి అని హుకుం జారీ చేయాల్సింది… లేదు, పర్లేదు, రెగ్యులరైజ్ చేసుకుంటారు అనుకుంటే కొనసాగనివ్వండి… అది ప్రైవేటు ప్రాపర్టీ అవుతుంది, ఐనా భవనాలు కూల్చేస్తే పార్టీలు కూలిపోతాయా..? వైసీపీ కనిపించకుండా పోతుందా…? సరే గానీ… ఆ రుషికొండ భవనాల జోలికి మాత్రం వెళ్లకండి… వందల కోట్ల ప్రజాధనంతో కట్టారవి… స్పూర్తిమంతులు కాబట్టి వాటిని మీరు వినియోగించుకోకపోయినా… ఇంకేదైనా ఆదర్శ అవసరాల కోసం వాడండి..!
Share this Article