పత్రికలో ఫస్ట్ పేజీ… దీనికి ఓ శాంటిటీ ఉంటుంది… ఫస్ట్ పేజీ వార్త అంటే అది ఆ పత్రిక ప్రయారిటీలను చెబుతుంది… ఆయా వార్తల తీవ్రత, ప్రాధాన్యతల్ని కూడా చెబుతుంది… ఇప్పుడంటే ఫస్ట్ పేజీని ఇండికేటర్ల పేజీలను చేసేశారు… అంటే లోపల పేజీల్లో ఏమున్నాయో చెప్పే ‘పట్టిక’లాగా మార్చేశారు…
కానీ ఒకప్పుడు ఫస్ట్ పేజీ చదివితే చాలు… ఆరోజు ముఖ్యమైన వార్తలేమిటో అర్థమయ్యేవి… లోపల పేజీలు చదివినా చదవకపోయినా పెద్ద మునిగేదేమీ ఉండదు… కానీ క్రమేపీ ఏమైంది..? పత్రికల డబ్బు కక్కుర్తి, మార్కెటింగ్ అవసరాలు ఫస్ట్ పేజీ ప్రాధాన్యాన్ని, విశిష్టతను కూడా మంటగలిపాయి…
అందరిలోనూ ఓ భ్రమ… ఫస్ట్ పేజీ అంటే అది ఆ పత్రికకు పవిత్రమైంది అని… ఎడిటోరియల్ వింగ్ దాన్ని డిక్టేట్ చేస్తుంది అని… కానీ ఉత్తదే… పత్రిక ఆదాయ అవసరాలు, యాజమాన్యం వైఖరి, మార్కెటింగ్ పాలసీ, రెవిన్యూ స్ట్రాటజీలే పత్రికలో ఏ పేజీనైనా శాసిస్తాయి… ఇదంతా ఎందుకు చెప్పుకోవడం అంటే… కరోనాకు ముందు పత్రికలు వేరు… కరోనా అనంతర పత్రికలు వేరు… మరీ మన తెలుగు పత్రికల విషయానికే వస్తే…
Ads
ఈనాడును చూసి మిగతావన్నీ అనుకరణ వాతలు పెట్టుకునే బాపతు కాబట్టి వాటిని వదిలేద్దాం… ఈనాడు పెరిగిన ముద్రణ వ్యయం, నిర్వహణ వ్యయానికి తగినట్టు రెవిన్యూ పెరగక… గతంలో లేనట్టు కార్డ్ రేట్ మీద కూడా భారీగా రాయితీలు ఇస్తూ, స్కీములు పెడుతూ నెట్టుకొస్తోంది… ఫస్ట్ పేజీలు అంటే యాడ్ టారిఫ్ ఎక్కువ కదా… దాంతో ఎక్కువ ఫస్ట్ పేజీలు పబ్లిష్ చేయడం స్టార్ట్ చేసింది…
అదేమిటి..? ఫస్ట్ పేజీ అంటేనే మొదటి పేజీ కదా, మిగతావన్నీ తరువాత నంబర్లే కదా అనుకోవద్దు అమాయకంగా..! పత్రిక అన్నాక చాలా ఫస్ట్ పేజీలు ఉంటాయి… ఒకటే మాస్ట్ హెడ్ ఉండాలనే చద్దికాలం, పురాణకాలం కాదిది… ఎన్ని ఫస్ట్ పేజీలైనా ఉండొచ్చు, ఎన్ని మాస్ట్ హెడ్‌లయినా ఉండొచ్చు… ఫస్ట్ పేజీ జాకెట్ యాడ్ పేరిట కస్టమర్లకు బురిడీ కొట్టించి బోలెడు ఫస్ట్ పేజీలను వేసుకోవచ్చు ఇప్పుడు… వాటిల్లో కనిపించే వార్తలు మరీ లోపలపేజీల బాపతు సోది వార్తలయినా సరే, నింపేస్తారు…
సో, ఇప్పుడు యాడ్ భాషలో చెప్పుకోవాలంటే ఫస్ట్ ఫస్ట్ పేజీ, సెకండ్ ఫస్ట్ పేజీ, థర్డ్ ఫస్ట్ పేజీ అని చెప్పుకోవాలి… ఈనాడు ఈరోజు ప్రింట్ ఎడిషన్ (హైదరాబాద్) లో ఏకంగా ఐదు ఫస్ట్ పేజీలున్నాయి… ఒకప్పుడు జాకెట్ అంటే ఫస్ట్ పేజీ మొత్తం యాడ్… ఇప్పుడు ఆ భాష కూడా మారిపోయింది… ఫస్ట్ జాకెట్, సెకండ్ జాకెట్, డబుల్ జాకెట్… ఈమధ్య ఫస్ట్ పేజీల్ని నిలువుగా చీల్చి రెండుగా ఇస్తున్నారు కదా… అప్పుడు అవి యాడ్స్‌తో నింపేస్తే దాన్ని ‘బ్రా యాడ్స్’ అనాలేమో…!!
ఏమో… చెప్పలేం… ఆల్రెడీ ఈనాడును చూసి ఇతర పత్రికలూ ఇదే బాటలో ఉన్నాయి కదా… రేప్పొద్దున అవసరమైతే ప్రతి పేజీని ఫస్ట్ పేజీగా మార్చేసినా ఆశ్చర్యపోవద్దు… కనీసం రైట్ పేజీలన్నీ..!
ఎడిటోరియల్ పాలసీలు ప్రాంతాన్ని బట్టి ఉన్నట్టుగానే… మార్కెటింగ్, యాడ్ పాలసీలు కూడా ఏరియాను బట్టి మారిపోతున్నయ్… ఈనాడుకే వస్తే ఏపీ ఎడిషన్, తెలంగాణ ఎడిషన్, హైదరాబాద్ ఎడిషన్‌కు తోడు డిజిటల్ ఎడిషన్ వేరు… డిజిటల్ ఎడిషన్ ఈరోజు 32 పేజీలు… కానీ ప్రింట్‌లో హైదరాబాద్‌లో పాఠకుడిని చేరేది 16 పేజీలే… మిగతావన్నీ అలా డిజిటల్ ఫార్మాట్‌లో నెట్‌లో కనిపిస్తుంటాయి అంతే… సాక్షి అయితే స్కూల్ ఎడిషన్, ఇంకేదో పేజీ కనిపించేది…
ఇప్పుడు వెలుగు, దిశ, ప్రభ వంటివి ప్రత్యేకంగా బుల్లెట్, డిజిటల్, స్మార్ట్, డైనమిక్ ఎడిషన్ల పేరిట నెట్‌లో పెట్టేస్తున్నాయి… అవసరాన్ని బట్టి, టైమ్‌ను బట్టి… ప్రింట్ కావు… జస్ట్, నెట్‌లో చదువుకోవడమే… (రాబోయే రోజులన్నీ ఇవే)… వాటి న్యూస్ సైటల్లో పెట్టే వార్తల్నే పేజీలుగా పేజినేట్ చేసి నెట్‌లో పెట్టేయడమే… ఇవన్నీ రాబోయే రోజుల పత్రికల ప్రధాన పరిణామాలకు ఆరంభ సూచికలు…!!
Share this Article