కాశి… వందలేళ్లుగా హిందూ పురాణాల్లోనూ ప్రస్తావించిన పుణ్యనగరి… జీవితంలో ఒక్కసారైనా కాశికి వెళ్లాలని కోరుకోని హిందువు ఉండడు… (గతంలో, ఇప్పుడు జ్ఞానం విపరీతంగా పెరిగి డిఫరెంటుగా ఆలోచించేవాళ్లున్నారు…) కానీ కాశికి పోతే కాటికి పోయినట్టే అనేవాళ్లు గతంలో… దట్టమైన అడవుల గుండా, కృూరమృగాలు, ప్రతికూల పరిస్థితుల్లో కాశికి చేరుకోవడం అంటేనే కైవల్యమనే దురవస్థ ఆనాడు…
కాశీకి వెళ్లి తిరిగి వస్తే ఊరుఊరంతా నీరాజనం పట్టేది… హారతులతో స్వాగతించేది ఒకప్పుడు… అలాంటి చారిత్రిక కాశి ఇన్నేళ్లూ దిక్కూమొక్కూ లేక… ఆక్రమణలతో, మురికితో, ఏ సౌకర్యాలూ లేకుండా, అర్చకగణం అరాచకమైన దోపిడీతో యమపురిని తలపించేది… కానీ ఇప్పుడు వేరు… వారణాసి కారిడార్ పేరిట మంచి డెవలప్మెంట్ జరిగింది… గంగా ఘాట్‌ల నుంచి ఆ కాశీ విశ్వనాథుడి మందిరం దాకా కొత్త కాశి కనిపిస్తోంది… గతంతో పోలిస్తే ఎందరు భక్తులు అధికంగా వచ్చారనే కాకిలెక్కల జోలికి ఇక్కడ పోవడం లేదు… కాకపోతే భక్తుల రాకడ బాగా పెరిగిందనేది వాస్తవం… ఐనా అక్కడ ఇంకా దోపిడీ ఉంది, దాన్ని యోగి, మోడీ నివారించలేరు, అదీ నిజమే…
కానీ సగటు హిందువుకు అక్కడ పెరిగిన సౌకర్యాలు బాగా ఆనందదాయకం… (ఈ మాటనగానే మరి మోడీ మెజారిటీ ఎందుకు తగ్గింది అనే ఓ పిచ్చి ప్రశ్న తలెత్తుతుంది ఓ తలతిక్క సెక్షన్ నుంచి…) అక్కడున్నది యోగి కదా… నిర్దాక్షిణ్యంగా ఆక్రమణలపై విరుచుకుపడి, రోడ్లు వెడల్పు చేసి, మందిరాన్ని సుందరమందిరం చేసి, ఓ కొత్త కాశిని ఆవిష్కరింపచేశారు… ఎవడు అంగీకరించినా, ఎవడు వ్యతిరేకించినా ఇదయితే నిజం… కళ్లెదుటే కనిపించేదే…
Ads
ఐతే హఠాత్తుగా ఆ దేవస్థానం సీఈవో విశ్వభూషణ్ మిశ్రా మాట్లాడుతూ ఒక సగటు దేవస్థాన ఈవోలాగా పరిణతి లేని వ్యాఖ్యలు చేశాడు… అధికారులు మారరు, వాళ్లు ఎక్కడున్నా ఒకటే లోకం… డబ్బు… ‘‘ఏడేళ్లలో నాలుగు రెట్ల ఆదాయం పెరిగింది… కరోనా తరువాత భక్తుల సంఖ్య బాగా పెరిగింది… విరాళాలు పెరిగాయి… 2017తో పోలిస్తే నాలుగు రెట్ల ఆదాయం పెరిగింది… అని చెప్పుకొచ్చాడు…
2017 నుండి దేవాలయ ఆదాయం…
2017-18 20,14,56,838
2018-2019 26,65,41,673
2019-20 26,43,77,438
2020-21 10,82,97,852
2021-22 20,72,58,754
2022-23 58,51,43,676
2023-24 86,79,43,102
హిందూ భక్తుల కోణంలో కాశిని మించింది లేదు… అక్కడే మరణించాలని, గంగలో నిమజ్జనం అయిపోవాలని, అక్కడే కట్టె కాలిపోవాలని కోరుకునేవారి సంఖ్య అపరిమితం… హిందూ ఆధ్యాత్మిక కోణంలో కాశి కాశే… వేరే పోలిక లేదు… మరి అలాంటిది అన్ని కోట్ల మంది భక్తులు పెరుగుతుంటే… ఒక సీఈవో చెప్పాల్సింది… ఏ సౌకర్యాలు పెరిగాయి, రవాణా సౌకర్యాలు ఎలా మెరుగుపడ్డాయి, వసతి ఎలా ఉంది వంటివి కదా…
ప్చ్, అదే ఆదాయం, అదే రూపాయల లెక్కలు… వీళ్లు మారరు… భక్తుల సంఖ్యదేముంది..? తిరుమలకు రోజూ సగటున 70. 80 వేల మంది వస్తారు… తిరుమల రోజువారీ హుండీ ఆదాయమే 3, 4 కోట్లు… దాంతో పోలిస్తే కాశి ఆదాయం ఏమూలకు..? సరే, తిరుమల కార్పొరేట్ గుడి… కాశి అలా కాదు… ఐనాసరే, ఒక సీఈవో కాశి అభివృద్ధిని ఆదాయంలో కొలవడం ఏమిటి..? నాన్సెన్స్… అది జీవన్ముక్తి క్షేత్రంరా బాబూ…
అంతెందుకు, హైదరాబాదులో కొత్తగా కట్టిన మానేపల్లి స్వర్ణగిరి అనే వెంకటేశ్వరుడి గుడికి రోజూ సగటున 60, 70 వేల మంది వస్తున్నారు… మస్తు ఆదాయం వస్తోంది… మరి ఈ రియల్ ఎస్టేట్ దేవుడితో కాశిని పోల్చగలమా..? అక్కడ పనిచేసే అధికార్లు కాస్త సగటు బ్యూరోక్రటిక్ ధోరణుల్ని వదిలించుకుని, ఓ ప్రసిద్ధ, ప్రపంచ హిందువుల ఫైనల్ డెస్టినేషన్‌గా పిలిచే కాశి అసలైన విశిష్టతను అర్థం చేసుకోవాలి కదా… ప్చ్, అదే లోపించింది… హిందూ దేవుళ్లందరికీ వీళ్లే పెద్ద శాపం..!!
Share this Article