నమస్తే తెలంగాణలో ఓ ప్రధాన వార్త… అందులోనే ఓ బాక్స్ ఐటమ్… వార్త ఎలా ఉందనేది పక్కన పెడితే… ఆ ఐఏఎస్ అధికారిణి పేరును ప్రత్యేకంగా రాస్తేనే నవ్వొచ్చింది… అందులోనే ఆ పత్రిక మార్మికంగా ఏదో చెప్పాలని ప్రయత్నించింది ఫాఫం… ఇదంతా ప్రయాస దేనికి..? నేరుగానే రాయొచ్చు కదా అనిపించింది…
ఆమె పేరు ఆమ్రపాలి కాట… విశాఖపట్నం జననం… (ఒంగోలు శివారులోని నరసాపురం అగ్రహారం వాళ్ల సొంతూరు)… తండ్రి ఆంధ్ర యూనివర్శిటీలో అధ్యాపకుడు… ఆయన పేరు వెంకటరెడ్డి… సో, నిన్న 44 మంది ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి కదా ఒకేసారి భారీగా తెలంగాణలో… దాని గురించిన వార్త.. అందులో ఈమె మీద ఓ బాక్స్ ఐటమ్… అసలు ప్రధాన వార్త శీర్షికే ‘హైదరాబాద్ ఆమ్రపాలికి’ అని… అదేదో నగరం మొత్తాన్ని ఆమెకు రాసిచ్చినట్టు…!!
Ads
హవ్వ… ఒక్క అధికారిణికి ఏకంగా ఐదు విభాగాలు కట్టబెట్టారు, ఇదేం ఇచ్చింత్రమో చూశారా అన్నట్టుగా రాసుకొచ్చింది… గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్, మెట్రోపాలిటన్ అథారిటీ జాయింట్ కమిషనర్, మూసీ రివర్ ఫ్రంట్ మేనేజింగ్ డైరెక్టర్, హెచ్‌జీసీఎల్ మేనేజింగ్ డైరెక్టర్, హైదరాబాద్ ఔటర్ రింగ్‌రోడ్ ప్రాజెక్ట్ డైరెక్టర్…. నిజానికి వీటిల్లో గ్రేటర్ కమిషనర్ అనేదే కీలకమైన పోస్టు… మిగతావన్నీ పెద్ద ప్రాధాన్యమున్నవేమీ కావు…
ఈ బాక్స్ ఐటమ్ చూశారుగా… ఆమ్రపాలిరెడ్డి అని రాసుకొచ్చారు… నిజానికి ఆమె పేరులో ఎప్పుడూ రెడ్డి అని రాసుకోదు, మీడియా కూడా ఎప్పుడూ ప్రత్యేకంగా కలిపి రాయదు… జస్ట్, ఆమ్రపాలి… చూశారా, రెడ్డి కాబట్టి ఇంత ప్రాధాన్యం ఇచ్చారు ఆమెకు అని చెప్పడమేమో పత్రిక ఉద్దేశం… ఇంకా నయం, ఆంధ్రా రెడ్డి లేడీకి తెలంగాణ పెత్తనం అని రాయలేదు… సంతోషం…
ఆమె జస్ట్ 2010 బ్యాచ్, ఆమెకన్నా సీనియర్లు చాలామంది ఉన్నా సరే, ఆమెకు ఐదు బాధ్యతలు ఇచ్చారు అని రాయడం అంటే ఆమె మీద ప్రత్యేక ప్రేమ చూపిస్తోంది ఈ ప్రభుత్వం అని చెప్పడం పరోక్షంగా..! పైగా జగన్‌రెడ్డి ఇంటి వద్ద సెక్యూరిటీ విభాగాల్ని కూల్చేసిన గ్రేటర్ ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ హేమంత్‌ను 10 రోజుల కింద బదిలీ చేసి, ఇప్పుడేమో ఏకంగా TSMSIDC ఎండీగా ఇచ్చారు అని ప్రస్తావన… ఆమ్రపాలి చొరవతోనే ఆయనకు మళ్లీ మంచి పోస్టింగ్ ఇచ్చారని కొన్ని వార్తలు కొన్ని సోషల్ మీడియా సైట్లలో వచ్చాయి కదా… ఆమ్రపాలి వార్త దగ్గరే ఇది రాయడం అంటే, ఆ సోషల్ వార్తల్ని ఎండార్స్ చేస్తున్నట్టా..?
నిజానికి సీనియారిటీని బట్టి ప్రాధాన్య పోస్టుల్లో పనిచేయించుకోవడం అనేదేమీ ఉండదు… మరి ఇదే నమస్తే బాస్ కేసీయార్ జూనియరే అయినా స్మిత సభర్వాల్‌ను ఏకంగా సీఎం ఆఫీసులో పనిచేయించుకోలేదా..? దాసరి హరిచందన కూడా 2010 బ్యాచే… అదేదో జిల్లాకు కలెక్టర్‌గా చేసింది, ఇప్పుడు వెయిటింగులో ఉన్న ఆమెను ఏకంగా ఆర్అండ్‌బీ స్పెషల్ సెక్రెటరీగా ఇచ్చారు…
ఎవరిని ఏ పోస్టులో వేసి, ఎలా పనిచేయించుకోవాలనేది ప్రభుత్వ విచక్షణ… ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న రామకృష్ణారావు చాలా ఏళ్లుగా బాగానే చేస్తున్నాడు… ఆ ప్లేసులో సందీప్‌కుమార్ సుల్తానియాను తీసుకొచ్చారు… రేవంత్‌రెడ్డి ఇష్టం… ఇంధనశాఖ నుంచి రిజ్వీ చెప్పినట్టు వినడం లేదని తొలగించారని రాశారు… తనను వాణిజ్య పన్నులు, ఎక్సయిజు శాఖకు వేశారు, అవీ ఇంపార్టెంటే కదా మరి…
మొత్తం వార్త పక్కనే వేసిన మరో వార్త మాత్రం బాగుంది… ఈవీ నర్సింహారెడ్డి గతంలో స్కూల్ అసిస్టెంట్… ఆయన తండ్రి కూడా టీచరే… ఇప్పుడు నర్సింహారెడ్డిని స్కూల్ ఎడ్యుకేషన్ బాస్ అయ్యాడు… అంటే కమిషనర్… నిజమే, టీచర్ నుంచి గ్రూప్-1, తరువాత కన్ఫర్డ్ ఐఏఎస్… ఇప్పుడొక కీలకమైన పోస్టింగ్… మంచి వార్తే..! చివరగా… ఆమ్రపాలి రెడ్డే కావచ్చుగాక, కానీ పెళ్లిచేసుకున్నది 2011 బ్యాచ్ ఐపీఎస్ షమీర్ శర్మ… సో, నాట్ ఆమ్రపాలిరెడ్డి… ఆమ్రపాలిశర్మ..!!
Share this Article