అర్ధరాత్రి చీకటి ఆ శ్మశానాన్న్ని పరదాలా కప్పేసి౦ది. సమాధుల మధ్య నుంచి వీచే గాలి వెదురు బొంగుల్లో చేరి ఈలగా మారి, కీచురాళ్ళ లయకి పాటగా నాట్యం చేస్తోంది! దూరంగా కుక్క ఏడుస్తోంది. కాటికాపరి లేడు. అతడికి భయం వేయలేదు. అతడే ఒక ప్రేతంలా ఉన్నాడు.
మాధవిని దహనం చేసిందని ఇక్కడే అని అతడికి శర్మ చెప్పాడు.
అతడు లోపలికి ప్రవేశించాడు. పాతిక సంవత్సరాలు కలిసి పెరిగి తనతో పాటు పది సంవత్సరాలు కాపురం చేసిన మాధవి ఇక్కడే ఎక్కడో బూడిదగా మారి ఉ౦టుంది. ఈ మట్టిలోనే ఎక్కడో ఆమె తాలూకు చితాభస్మం కలిసిపోయి ఉ౦టుంది. ఇన్ని సమాధుల మధ్య ఎక్కడని వెతుకుతాడు?
బ్రతికి ఉ౦డగా మనసులో ఏముందో వెతికి పట్టుకోలేకపోయాడు! ఇప్పుడు మరణించాక ఎలా తెలుసుకుంటాడు? అదే వాక్యం- ఒకే దిండు మీద నిద్రించిన మన రెండు తలలు… ఉత్తర దక్షిణ ధృవాలు!
Ads
నువ్వు చనిపోయి నన్ను నాకు వదిలిపెట్టి వెళ్ళాక తీరిగ్గా నన్ను నేను పరిశీలించుకునే వీలు దొరికింది. నీ మీద కోపం పోయాక నీ వైపు నుంచి ఆలోచించే విశాలత్వం అలవడింది. ఆదిలో నేను-అంతంలో నువ్వు- మధ్యలో నీ సమాధి మీద వెలుగుతున్న దీపం నన్ను పరిహసిస్తూ నా మనసులో చీకటిని పారద్రోలుతోంది.
మన వైవాహిక జీవితంలో ‘నువ్వు నాకేమిచ్చావు’ అన్న ప్రశ్న సరే. అది అటుంచు. ‘నేను నీకేమి చేశాను’ అన్న ప్రశ్న విశ్వరూపం దాల్చి నన్ను చీల్చి చెండాడుతూ ఉ౦ది.
నువ్వు మూఢురాలివన్న నా మూర్ఖత్వం నుంచి నేను బయట పడుతున్నాను.
నా కష్టాన్ని నువ్వు అర్థం చేసుకోలేదనే నేను చింతించాను తప్ప నీ స్థాయికి దిగివచ్చి (చూశావా! ‘దిగిరావటం’ అన్న పద ప్రయోగం మళ్ళీ నా అహాన్ని సూచిస్తూంది.) నిన్ను నాతోపాటు తీసుకువెళ్ళే ప్రయత్నం ఏదీ చేయలేకపోయాను.
నిద్రపోతున్న అంధకారాన్ని, ఉషస్సు మేల్కొలిపే దాకా వెలుగురేఖ ఎలా విచ్చుకోదో, అలాగే… మరణం చివరి అంచు వరకూ నడిచే దాకా నాకు బ్రతుకులో సమన్వయం అర్థం కాలేదు.
అర్ధరాత్రి అరవై మంది అతిథుల మధ్య అరపెగ్గు తాగుతూ, ‘ఆహా’ డబ్బు ఆర్జిస్తున్నానని అహంతో ఆత్మవంచన చేసుకునే నేను… అదే రాత్రి… ఆత్మీయత కరువైన పక్క మీద, బెడ్ లాంప్ ఓదార్పుతో ఒంటరిగా పడుకుని, నేను రాగానే ఆ చిరాకుని అసంతృప్తిగా ప్రకటించే నీ మీద విసుక్కునే హక్కుని ఎలా కలిగి ఉన్నాను?
పక్క డైరెక్టరు కొన్న కొత్త కారు బావుందని డ్రైవ్ చేసి అభినందించే నేను, పక్కింటావిడ కొన్న కొత్త నగ బావుందని నువ్వు మెళ్ళో వేసుకుంటే చీదరించుకుంటానెందుకు?
మీరు కట్టుకున్న టై బావుందని ఒకమ్మాయి అంటే గర్వంగా నవ్వుకునే నేను-మీరీ చీరలో బావున్నారని నిన్నెవరైనా అంటే ఉడుక్కున్నానెందుకు?
మాయమైన గతం నుంచి నాకు సంకేతం వస్తోంది. వాస్తవం బీడు మీద నా కన్నీరు పడి పశ్చాత్తాపం మొలక హృదయాన్ని చీల్చుకుని వెల్వడుతుంది., మృత్యు ద్వారం గుండా జీవితయాత్ర వెళుతూన్న సమయాన మాత్రమే శాశ్వత నిత్యసత్యాలు గోచరమవుతాయి.
నీ స్నేహితుడు నీకు ప్రేమ గురించి వ్రాసిన ఉత్తరం చదివి, ‘ఇద్దరు అజ్ఞానులు చేరి జ్ఞానం గురించి మాట్లాడుకున్నట్టుంది’ అని నవ్వుకున్నాను. నా ప్రియురాలు నాకు వ్రాసిన ఉత్తరం చదివి ‘ఎంత అదృష్టవంతుడిని’ అని పొంగిపోయాను. ఒకే తప్పు ఇద్దరు చేసినప్పుడు ఆ ఉత్తరం కృష్ణశాస్త్రిలా వ్రాసినా, కృష్ణారెడ్డిలా వ్రాసినా తప్పు తప్పేకదా అన్న సత్యాన్ని మర్చిపోయాను. నువ్వు దక్షిణ ప్రాంగణంలో కూర్చున్నప్పుడు నేను ఉత్తర శ్మశానంలో వెతికాను.
ఎవరో కవి అన్నట్టు-
“నీకు సత్యం అర్థవంతం. నాకు నిజం భయంకరం.
ఏ కేంద్రంలో మనిద్దరం కలుసుకోవటం?
ఓ ప్రత్యూష పవనంలోని మందార లతాంతమా!
అటు-ఆనంద సుధర్మ౦ వైపు నక్షత్రధూళిని జల్లుతూ నువ్వు వెళ్ళు.
ఇటు- కలల బూడిద రాసుల మీద కన్నీళ్ళు చిమ్ముతూ నే కూలబడతా”.
ఎన్ని వేల సమాధులు ఇక్కడ! ఎన్ని వందల చితులు ఇక్కడ! ఎంతమంది భిన్న మనస్కులు అవతలివారితో రాజీ పడలేక మృత్యువుతో రాజీపడ్డారో, ఎంతమంది ప్రేమార్తులు చితిమంటల్లో చల్లారిపోయారో, ఓ నా ప్రియబాంధవీ! నన్ను క్షమించు. నాతి చరామి అన్న మాటకు నేను న్యాయం చేకూర్చలేకపోయాను. పెళ్ళయిన రోజు నుంచీ నిన్నొక మనిషిగా చూడలేకపోయాను. నీకూ ఒక మనసు ఉ౦టుందనీ, దానికీ కొన్ని కోర్కెలుంటాయనీ తెలుసుకోలేకపోయాను. నా అజ్ఞాతపు నేత్రాలతో నీలోని మూర్ఖత్వాన్నే చూశాను తప్ప, నా జ్ఞాన చక్షువుతో నీ అంతరంగాన్ని గ్రహించలేక పోయాను.
కన్నీళ్ళతో విమానాశ్రయంలో తన భర్తకి వీడ్కోలు ఇస్తున్న ఇల్లాలిని చూసి మెచ్చుకున్నానే తప్ప-ఇన్నేళ్ల సంసార జీవితంలో నేను వెళ్తున్నప్పుడు నా ఎడబాటుతో నా భార్య కళ్ళలో కనీసం ఒక చుక్క నీటిని కూడా తెప్పించలేకపోయిన నా ప్రేమ రాహిత్యాన్ని గుర్తించ లేకపోయాను. కాలిన చేతుల్తో ఆకుల కోసం వెతక్కుండా, దోసిలి బట్టి గుర్తు తెలియని నీ సమాధి ముందు నిలబడి క్షమాపణ వేడుకుంటున్నాను. నన్ను అసహ్యించుకోకు. జాలిపడు నన్ను క్షమించు. వెళ్లొస్తాను” అతడు లేచి తూలుకుంటూ శ్మశానం నుంచి బయటకు వచ్చాడు. (Going for Reprint today. 20th edition. ఇంతలా ఆదరించిన పాఠకులకు కృతజ్ఞతతో)…. యండమూరి వీరేంద్రనాథ్
Share this Article