రిలయన్స్ జియో టారిఫ్స్ 12.5% – 25% వరకూ పెరిగాయట. దీంతో ముఖేష్ అంబానీ వాళ్ళబ్బాయి పెళ్లి ఖర్చులు మొత్తం మన నెత్తినే రుద్దుతున్నట్టున్నాడు అని వాపోతున్నారు జనాలు.
అయితే ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. జియో కొత్తగా మార్కెట్లోకి వచ్చినప్పుడు ఉచిత టారిఫ్, అన్ లిమిటెడ్ కాల్స్, డేటా ఆఫర్లు ఇచ్చినపుడు ఇదే జనాలు అప్పటివరకు వాడుతున్న నెట్వర్క్స్ వదిలి జియోకి బదిలీ అయ్యారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీకి టెలికాం రంగం మీద ఆసక్తి ఉన్నప్పటికీ అన్నదమ్ములు ఆస్తులు పంచుకున్నప్పుడు పాత రిలయన్స్ టెలికాం తమ్ముడు అనీల్ అంబానీకి వెళ్లిపోయిన కారణంగా టెలికాం రంగంలోకి ప్రవేశించకుండా ఉండిపోయాడు. తమ్ముడి రిలయన్స్ టెలికాం నష్టాల బాట పట్టి దివాలా తీసిన తర్వాత ముకేష్ అంబానీకి టెలికాం రంగంలో ప్రవేశించడానికి మార్గం సుగమం అయ్యింది. దీంతో విపరీతమైన నగదు నిల్వలున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ జియోను లక్ష కోట్ల రూపాయల మూలధనంతో ప్రారంభించింది.
Ads
ఎయిర్ టెల్, వొడాఫోన్, ఐడియా వంటి టెలికాం సంస్థలతో అప్పటికే మొబైల్ కనెక్షన్స్ సాచ్యురేషన్ స్థాయికి చేరువగా ఉన్నాయి. కొత్తగా ప్రవేశించే కంపెనీ మార్కెట్ షేర్ సాధించాలి అంటే కొత్త వినియోగదారులను చేర్చుకుంటే సరిపోదు. అప్పటికే ఉన్న కంపెనీల వినియోగదారులను లాగేసుకోవడం ఒక్కటే మార్గం.
ఉచిత పథకాలకు భారతీయులు ఎలా ఆకర్షితులు అవుతారో మనందరికీ తెలిసిన విషయమే. ఉచిత కనెక్షన్, అపరిమిత కాల్స్, డేటా అని జియో ఆఫర్లు ప్రకటించగానే జనాలందరూ పాత నెట్వర్క్ లను వదిలి జియోకి పోర్ట్ అయ్యారు. దీంతో జియో టెలికాం మార్కెట్లో గణనీయమైన షేర్ సాధించింది. జియో దెబ్బకు ఎయిర్ టెల్ మార్కెట్ వాటా బాగా తగ్గిపోగా, వొడాఫోన్ ఐడియా కలసి పోయాయి, ఇతర చిన్న కంపెనీలు మూతపడ్డాయి.
రిలయన్స్ వ్యూహం గణనీయమైన మార్కెట్ షేర్ సాధించడం మాత్రమే కాదు మార్కెట్లో మోనోపోలీ సాధించడం కూడా. అయితే మార్కెట్లో జనాలందరూ జియోకి షిఫ్ట్ అవుతున్నా కూడా నేను మాత్రం వొడాఫోన్ నెట్వర్క్ లోనే కొనసాగుతున్నా… (ఆ తర్వాత ఐడియా అయ్యింది అనుకోండి) కారణం ఏమిటంటే నేను ఏ వ్యాపారరంగంలో అయినా ఏదో ఒక కంపెనీ ఏకస్వామ్యం (మోనోపోలీ) సాధించడం నాకు ఇష్టం ఉండదు.
మొబైల్ నెట్వర్క్ అనే కాదు నేను వినియోగించే ఏ వస్తువు మార్కెట్లో మోనోపోలీ కోసం ప్రయత్నించే ఏ కంపెనీది కాకుండా చూసుకుంటాను. ఆ రంగంలో నెంబర్ వన్ కంపెనీది కాకుండా ద్వితీయ, తృతీయ కంపెనీల వస్తుసేవలను మాత్రమే ప్రిఫర్ చేస్తాను.
ప్రజాస్వామ్యం బలంగా ఉండాలంటే మెజారిటీ కలిగిన అధికార పక్షానికి ఎదురుగా బలమైన ప్రతిపక్షం అవసరమో, వ్యాపార రంగంలో ధరలు అదుపులో ఉండి వినియోగదారులకి మెరుగైన సేవలు అందాలంటే ఆ రంగంలో ఏ ఒక్క కంపెనీ ఏకఛత్రాధిపత్యం వహించకుండా పోటీ కంపెనీల మనుగడ కూడా అంతే ముఖ్యం. అది జరగాలా వద్దా అనేది ప్రజల చేతుల్లోనే ఉంటుంది.
ఎయిర్ టెల్ కూడా టారిఫ్ ధరలు పెంచినట్టుంది… ఇతర టెలికాం కంపెనీలు కూడా టారిఫ్ ధరలు సవరించే అవకాశం లేకపోలేదు. అయితే జియో మీదే చర్చ జరగడానికి, ముఖేష్ అంబానీ ట్రోల్ అవడానికి కారణం ఇటీవల కాలంలో వారి అబ్బాయి పెళ్లి కోసం ఆడంబరంగా ఖర్చు చేయడం, సినిమా వాళ్ళకు కోట్లకు కోట్లు డబ్బులు చెల్లించడం వంటివి కూడా కారణం. ఎయిర్టెల్ ఓనర్ సునీల్ మిత్తల్ పేరు కూడా చాలామందికి తెలియక పోవచ్చు. …. – నాగరాజు మున్నూరు
Share this Article