సింగర్ గీతామాధురి చెప్పినట్టు… తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్-3 పాటల పోటీలో పాల్గొనేవాళ్లు అదృష్టవంతులు… ఎందుకు..?
ఏదో ఓ చిన్న ఆర్కెస్ట్రా సాయంతో తమ ప్రతిభను ప్రదర్శించుకునే చాన్స్ గాకుండా… ఓ సింఫనీ, చాలా వాయిద్యాల సహకారంతో గ్రాండ్‌గా తమ పాటను శ్రోతలకు పరిచయం చేసుకునే అవకాశం దక్కడం..! ఆడిషన్ రౌండ్స్ పక్కన పెడితే ఇప్పుడు ఆహా ఓటీటీలో స్ట్రీమింగులో ఉన్న గ్రాండ్ గాలా రౌండ్ సినిమా సంగీత ప్రియుల చెవుల తుప్పు వదిలించింది…
చెన్నై ఆర్కెస్ట్రా… వీనులవిందైన పర్‌ఫామెన్స్ చూపించింది… సింగర్ కార్తీక్ చెప్పినట్టు కొన్ని వందల సినిమాలకు వాద్యసహకారం అందించిన చరిత్ర వాళ్లది… అందులో ఒక పెద్దాయన్ని థమన్ పరిచయం చేస్తూ, తనకు గాడ్‌ఫాదర్ ఒకరకంగా అంటూ లేచి నిలబడి కృతజ్ఞత చాటాడు… గుడ్… ఆయన కూడా అంతే హంబుల్‌గా ప్రత్యభివాదం చేశాడు…
Ads
ఐతే ఈ వారం ఎపిసోడ్‌కు మాత్రమే ఈ టీం పనిచేస్తుందా..? లేక సీజన్ మొత్తానికి వర్క్ చేస్తారా తెలియదు గానీ… ఆహా ఓటీటీ మేనేజ్‌మెంట్ పెడుతున్న ఖర్చుకు ప్రతిఫలం అయితే కనిపిస్తోంది… వేరే టీవీలు చేసే మ్యూజిక్ సాంగ్స్ కంపిటీషన్ షోలు ఈ తెలుగు ఇండియన్ ఐడల్ షోకు దరిదాపుల్లో కూడా లేవు…
ఎప్పటిలాగే థమన్ స్పాంటేనియస్ చెణుకులు, కార్తీక్ నిశిత పరిశీలన కూడా బాగున్నయ్… ఎస్, ఈసారి కంటెస్టెంట్ల ఎంపిక మరింత పదునుగా సాగి, మాంచి మెరిటోరియస్ దొరికారు… బాగా పాడుతున్నారు… ఒకరిద్దరి దగ్గరకు వెళ్లి మరీ కార్తీక్ అభినందించి, వాళ్లతో కలిసి పాడి షోను మరింత రక్తికట్టిస్తున్నాడు గానీ…
కంటెస్టెంట్లను మరీ అంత మెచ్చుకోవాల్సిన పని లేదేమో… మరీ అద్భుతం వంటి పదాల్ని వాడనక్కర్లేదు… అలాగని రంధ్రాన్వేషణ కూడా అవసరం లేదు… సంగీత పరిభాషలోనే ఎలా పాడారో కాస్త విశ్లేషించి, అభినందించి వదిలేస్తే చాలు… శ్రోతలకు కూడా కంటెస్టెంట్లను జడ్జిలు ఎలా పరిశీలిస్తున్నారనేదే ముఖ్యం…
ఓ కంటెస్టెంట్ మాండలిన్ స్వయంగా వాయిస్తూ పాట పాడాడు… తనకు అందులో ప్రావీణ్యం ఉండొచ్చుగాక… కానీ అంత పెద్ద సింఫనీ సహకారం ఉన్నప్పుడు తన వోకల్ టాలెంట్ ప్రదర్శించి, పోటీకి నిలబడాలే తప్ప మాండలిన్ ప్రతిభను కాదు కదా ప్రదర్శించాల్సింది… సేమ్, ఇలాగే ఇతర కంటెస్టెంట్లు కూడా ఒకరు ఫ్లూట్, ఒకరు తబలా, ఒకరు మృదంగం, ఒకరు కీబోర్డు, ఒకరు కంజెర, ఒకరు మౌత్ ఆర్గన్ పట్టుకొచ్చి ప్రదర్శిస్తే అసలు ఆ షో ఉద్దేశం, కేరక్టరే దెబ్బతినిపోదా..?
Share this Article