ఐయాంసారీటుసే… ఎవరైనా పుస్తకం రాస్తే ఎలా ఉండాలి! నలుగురికీ చెప్తున్నారంటే, ఏం పాటించాలి? నిష్పాక్షికత, పారదర్శకతలు ప్రామాణికంగా దాని ముగింపులో ఒక సమగ్రత, విస్తృతత్వం ఉండాలి! అంతేకానీ, రచయితే ఓ అభిప్రాయానికి ఫిక్సై ఇతరులను అందుకు ఒప్పించే ప్రయత్నంలా ఉండకూడదు!
కల్లూరి భాస్కరం గారి ఇవీమనమూలాలు పుస్తకం చదివాను! కాలగర్భంలోకి మనం ఎంత లోతుకు వెళ్లగలం అని మొదలుపెడుతూ జెనెటిక్స్, జీనియాలజీ, లింగ్విస్టిక్స్ ఆధారిత పరిశోధనలను ఏకరువు పెడుతూ, ఈనాటికి 3500 ల ఏళ్ల క్రితం జరిగిందనే ఆర్యుల వలస వాదనను నిర్ధారించే పని పెట్టుకున్నారు! కాదు కాదు, ఆ సిద్ధాంతాన్ని జనాల మీద రుద్దే పని పెట్టుకున్నారు! అందుకు బిబ్లికల్ ఐడియాలజీని ఆధారంగా చేసుకున్నారు! వెస్ట్రన్ పరిశీలనలను నూరిపోస్తూ జనాల మూడ్ ను ఆవైపు ప్రిపేర్ చేద్దామనే ఇన్టెన్షన్ మినహా ఆ పుస్తకంలో మరొకటి లేదనిపించింది! దాన్ని రచన అనేకంటే, కొన్ని పాశ్చాత్య పుస్తకాల సమాహార సమీక్ష అనడం ఉత్తమం!
ప్రాచీనకాలంలో ఆదిమ మానవుడి నుంచి ఆధునిక మానవుడు, వేట, ఆహార సేకరణ జనం నుంచి వ్యవసాయ, పశుపాలన జనం, మైటోకాండ్రియల్ డీఎన్ఏ నుంచి వై క్రోమోజోమ్, హాప్లోగ్రూప్ నుంచి సబ్ హాప్లోగ్రూప్ వరకు విశ్లేషిస్తూ ప్రపంచవ్యాప్తంగా జరిగిన మానవ సమూహాల వలసలను మధ్యమధ్యలో వేద వాఙ్మయాలు, పురాణాలు, ఇతిహాసాల సంఘటనలతో పోలుస్తూ రచయిత తన రచనను సాగిస్తారు!
Ads
మానవ జాతుల మధ్య సాంకర్యం, వలసలు సర్వసాధారణం అంటారు! ఈ భూమ్మీద కల్తీ లేని మానవజాతి లేదని ప్రకటిస్తారు! ‘మేం మడికట్టుకొన్నాం, మా జాతి స్వచ్ఛమైనది’ అంటే కుదరదు, అర్దజ్ఞానం, మూర్ఖత్వం అని నిర్వచిస్తారు! ఆర్యావర్తం అంటే ఒక్క గంగా యమునా సంగమ ప్రాంతం మాత్రమే కాదు, పశుపాలన వృత్తిగా ఉన్న స్టెప్పీ జనం [ఆర్యులు] యురేషియా, పశ్చిమ యూరప్, మధ్య ఆసియాల మీదుగా వాయవ్య సరిహద్దుల నుంచి భారత్ లోకి ప్రవేశించారంటూ, అతి ప్రాచీనకాలం నుంచే దాని విస్తృతి ఖండాంతరాలుగా పాకి ఉందని వివరిస్తారు.
ఆర్యావర్తం అంటే అటు యూరప్ నుంచి ఇటు భారత్ వరకూ పశ్చిమాన్నీ, తూర్పునూ చుట్టబెట్టిన స్టెప్పీ జనాల వలస ప్రాంతంగా వర్ణిస్తారు! భారతదేశంలోకి ఆర్యులు వలస వచ్చారనడానికి సరైన ఆధారాలు లేవని ఓవైపు అంటూనే మరోవైపు, తూర్పు పశ్చిమాలను కలిపిన తొలి ప్రపంచీకరణగా ఆ వలసను అభివర్ణిస్తారు! అదిగో, అలా ఆ ఆర్యావర్త భావజాలం ప్రస్తుతం దక్షిణ, ఈశాన్య భారతాల్ని కబళించజూస్తోందనే సెన్స్ లో పుస్తకం రాస్తూ భాస్కరం గారు తనకు తానే కాంట్రడిక్ట్ ఔతారు!
ఆర్యావర్తమంటే కేవలం ఒక భౌగోళిక ప్రాంతమేనా? అని ఒకచోట ప్రశ్నిస్తారు! కాదు, అదొక నిర్దిష్ట జీవనవిధానంతో కూడిన భావజాలమనీ, మతం, సంస్కృతీ, సమాజం, రాజకీయ చింతనతో సహా అన్నీ అందులోకి వస్తాయని ఆయనే సమాధానం ఇస్తారు! ఆర్య భావజాల వ్యాప్తి ఉద్యమం ఎప్పుడో పురాతన కాలంలో ప్రారంభం ఐందనేది స్థూలంగా రచయిత వెర్షన్! దానికి పూర్తి విరుద్ధంగా ఆ వ్యాప్తిని నిలువరించాలన్న మెసేజ్ ను కూడా ఈ పుస్తకం ద్వారా ఆయనే ఇస్తారు!
మళ్లా, ఈ భూగోళం మీద వివిధ జాతులు తమ ఆచారాలను, సాంస్కృతిక పారంపర్యాన్ని తరతరాలపాటు కాపాడుకోవడానికి చేసే ప్రయత్నాలను కూడా మరోచోట ఉటంకిస్తారు! మిగిలిన ప్రాపంచిక పరిణామాల లాగే వేలు, వందల సంవత్సరాలుగా భారతదేశంలో సైతం ఆర్యుల ద్వారా అదే సాంస్కృతిక విస్తరణ కొనసాగుతుందనే కోణాన్ని విస్మరిస్తారు! పైగా, బుద్ధికి, చూపుకు దరి కట్టుకొని నిజాలను తెలుసుకోకుండా మనం వర్తమానం అనే కంచె వేసుకుంటామని కామెంట్ చేస్తారు! చివరికి, రచయితే ఆ స్పృహను కోల్పోయారేమో అనే భావన కలిగేలా పుస్తకాన్ని ముగిస్తారు!
పరిణామక్రమంలో ఆర్యులు, ఇతర జాతుల వలసలను యాదృచ్చికంగా, సహజసిద్ధంగా చోటు చేసుకున్న సంఘటనలుగానే మొదట్లో రచయిత చిత్రీకరిస్తూ వచ్చారు! ఆర్యులు హింసాప్రవృత్తిని కలిగిన వాళ్లనో, క్రూరత్వం కలిగిన అనాగరికులనో పుస్తకం మొత్తం భూతద్దం పెట్టి వెతికినా దొరకదు! స్టెప్పీ జనాలు తమ సంస్కృతిక ప్రాబల్యం కోసం తహతహలాడారని మాత్రమే ఆయన అంటారు! ఎక్కడైనా వలస జనాల్లో జరిగేది ఇదే అని వ్యాఖ్యానిస్తారు!
కొత్త ప్రాంతంలోకి, కొత్త జనంలోకి అడుగుపెట్టే ప్రతి వలస జనమూ అభద్రతకు లోనవుతారు, భావజాలంతో సహా సొంత గుర్తింపును కాపాడుకోవాలన్న స్పృహ వారిలో స్థానికులలో కన్నా ఎక్కువగా ఉంటుందని క్యాజువల్ గా చెప్పేస్తారు. అంతిమంగా ఆర్యుల విషయానికి వచ్చేసరికి దాన్నే ఒక సంక్లిష్టమైన అంశంగా చూపిస్తారు! వాళ్లది ఒక దుష్ట సంస్కృతి అన్నట్లు, బుక్ క్లైమాక్స్ లో విపరీతమైన కోపాన్ని ప్రదర్శిస్తారు! కంటెంట్ ఫ్లోలో సడెన్ గా ఆర్యులను విలన్లను కూడా చేసేస్తారు! అంతటితో ఆగకుండా, పశుపాలక ఆర్థికత నుంచి సంతరించుకున్న దేహబలం, గుర్రం, రథం, ఆయుధం, లోహ సంపద ఆర్యులకు ఆధిపత్య భావజాలాన్ని సంక్రమింప చేసిందని నెగెటివ్ గా పొసెస్ చేసే ప్రయత్నం సైతం చేస్తారు!
మరోవైపు, టిపికల్ లెఫ్టిస్టిక్ మైండ్ సెట్ తో ఋగ్వేద కాలాన్ని తప్పుగా పేర్కొంటూ, కేవలం వెస్ట్రన్ అబ్జర్వేషన్స్ ఆధారంగా ఆర్యులు, అనార్యులు అంటూ భారతీయులను విడగొట్టి మాట్లాడుతారు! ఉభయుల మధ్యా సర్దుబాట్లు, సంస్కృతుల ఆదానప్రదానాలను చర్చిస్తారు! ఆర్యులు, అనార్యుల పెనుగులాట స్వరూప స్వభావాలను ముస్లింలు, బ్రిటిషర్ల లాంటి తృతీయపక్షం న్యూట్రల్ గా చూపిందనే తనదైన వామపక్ష భావజాల ధోరణిని ప్రదర్శిస్తారు! కానీ, వాళ్ల మత సిద్ధాంతాలను దాటి, ఆ థర్డ్ ఫ్రంట్ అనబడే వాళ్లు ఏ రకమైన తటస్థను కనబరిచారో వివరంగా చెప్పలేదు!
ఆర్యావర్తం అనే అజెండా ముసుగులో జరుగుతోన్న ఆర్యలు, అనార్యులనే ఇరువర్గాల పెనుగులాటకు తార్కికాంతం కావాలంటారు. అంతవరకూ భారత్ ప్రస్తుత చక్రభ్రమణం ఆగదు. అది స్థిమితపడదు! ఒక సుసంఘటిత దేశానికి కావలసిన రూపురేఖలు దానికి ఏర్పడవని వాపోతారు! భారత్ అనే గానుగను తిప్పుతున్నది మన ఆలోచనలు కావు, ఆర్యావర్తం భావజాలం అంటారు!
ఒకవేళ ప్రాచీన ఆర్య సంస్కృతి దేశంలో వ్యాపిస్తుందే అనుకుందాం! దాన్ని బలవంతంగా ఎందుకు ఆపాలో, తన రచనకు లోబడి రచయిత ఏ రీజన్ ఇవ్వలేదు! మిగిలిన సహజ పోకడల లాగే ఆర్య సంస్కృతీ విస్తృతి చెందుతుంది! తప్పేమిటి? మరి, రచయిత ప్రకారం, ప్రాచీనకాలంలో మిగిలిన చోట్ల కూడా అదే జరిగింది కదా! వర్తమాన కాలంలో సైతం, ఆయన పేర్కొన్న ఆ సహజసిద్ద పరిణామాలు భారతదేశంలో అలా కొనసాగకూడదా? వాటిని ఎవరు, ఎందుకు ఆపాలి? అసలు ఆపాలని ఎందుకు అనుకోవాలి!
పుస్తకాన్ని భాస్కరం గారు సమతుల్యంగా రాసే ప్రయత్నమే చేశానని అనుకున్నారు! బట్, తూకం తప్పారు! భారత్ ను చక్రభ్రమణంలో ఇరికించింది ఆర్యావర్త భావజాలమే అన్నారు! కానీ, కేవలం పాశ్చాత్య సిద్ధాంతాలను సమర్థించడానికి మినహా, ఆర్యావర్తం సహజత్వానికి భిన్నంగా ఉండాలని రచయిత కోరుకోవడంలో ఆంతర్యం ఏమిటో అర్థం కాలేదు! ఆయన, అది ఎంత భిన్నంగా ఉండాలని అనుకున్నారంటే, అప్పటి దాకా తానే వివరించిన వలసలు, సాంకర్యాల విస్తృతత్వాన్ని విడనాడే అంతగా అన్నమాట!
పోనీయ్, పైన పేర్కొన్న అంశాలన్నీ ఆయనే స్వయంగా పరిశోధిస్తే తేలాయా? అంటే, నో! పుస్తకంలో చాలాచోట్ల పాశ్చాత్య సాహిత్యాన్ని ఆయన బహిరంగంగానే కోట్ చేశారు! ఆ పరిశీలనల ఆధారంగా ఎండింగ్ లో సడెన్ గా ఆర్యులపై వ్యతిరేక దండకం అందుకున్నారు! వీటన్నిటి దృష్ట్యా, రచయిత వైఖరి కేవలం పాశ్చాత్య భావజాలానికి దాసోహం అన్నట్లుగా అనిపించింది, కానీ ఒక విలువైన సమాచారం అందించినట్లుగా లేదు!
మొత్తం పరిణామ చరిత్రను అతిప్రాచీన గతంలోకి తొంగి చూడాలి, సమీపగతం నుంచి మాత్రమే చూస్తూ వర్తమానంపై భాష్యం చెప్పడం వల్ల ప్రయోజనం ఉండదని అంటూనే, చివరికి రచయిత ఆర్యుల విషయానికి వచ్చేసరికి తన భావజాలంతో తానే కాంట్రడిక్టవుతారు! ఇది నా అభిప్రాయం మాత్రమే!……… విశ్లేషణ :: సూరజ్ వి. భరద్వాజ్
(అవును, ఇది విశ్లేషకుడి సొంత అభిప్రాయం మాత్రమే… విబేధించేవాళ్లూ ఉండొచ్చు, పుస్తక రచయిత చెప్పిందే కరెక్టు అనేవాళ్లు ఉండొచ్చు… కానీ మన తెలుగులో పుస్తక సమీక్ష నామమాత్రం… పైగా భజించేవే గానీ సరైన పద్ధతిలో విబేధించేవాళ్లు, విశ్లేషించేవాళ్లు తక్కువ… కారణాలను కూడా తమ కోణంలో సగౌరవంగానే వెల్లడించడం మరీ మరీ అరుదు… అదుగో, ఆ కోణంలో ఈ పుస్తక సమీక్షను లెంతీ అయినా సరే, ముచ్చట ప్రచురించడానికి కారణం…… ముచ్చట)
Share this Article